మోడీ కుట్రలను తిప్పికొట్టండి- వి శ్రీనివాసరావు పిలుపు

Mar 22,2024 23:15 #cpm v srinivasarao, #speech

కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా ఇండియా వేదిక నిరసన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ప్రజాతీర్పును హైజాక్‌ చేసే కుట్రలో భాగంగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిందని, ఈ అరెస్ట్‌ను దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా శుక్రవారం ఇండియా వేదికలోని పార్టీలు విజయవాడలోని ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ తరహా కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాలపై అవినీతి ముద్ర వేస్తూ జైళ్లకు పంపడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఐదేళ్ల కాలంలో ఇడి, సిబిఐ బనాయించిన కేసుల్లో 95శాతం ప్రతిపక్షపార్టీ నేతలపై వున్నాయంటే నరేంద్రమోడీ ప్రభుత్వం ఎంతగా కక్షపూరిత రాజకీయాలకు బరితెగిస్తోందో అర్థమవుతోందన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పురందేశ్వరి మద్యం కుంబకోణంపై కేంద్ర హోమ్‌ మంత్రికి ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విశాఖ డ్రగ్స్‌పై సమాచారం వచ్చినా చర్యలు తీసుకునేందుకు ఆరు రోజుల సమయం ఎందుకు పట్టిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బిజెపి, వైసిపి, టిడిపిలు ఒకరిమీద ఒకరు నెపంనెట్టుకుంటున్నాయని అన్నారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ అవినీతికేసుల్లో బిజెపి కూరుకుపోయినా కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పందించడం లేదని అన్నారు. ప్రతిపక్షాల మీదికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేకున్నా ఫిర్యాదులు రాగానే అరెస్ట్‌లు చేస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొందన్నారు. రాహుల్‌గాంధీ జోడో యాత్ర తర్వాత ఇండియా వేదిక అంటే మోడీకి భయం పట్టుకుందన్నారు. అందుకే కాంగ్రెస్‌పార్టీ ఆర్థిక కార్యకలాపాలను స్థంబింపజేయడంతోపాటు భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇండియా వేదిక నాయకులను అక్రమ కేసుల్లో అరెస్ట్‌ చేసి జైళ్లలో పెడుతోందన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందన్నారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ పేరుతో బిజెపి దేశంలో దందాకు పాల్పడుతోందని విమర్శించారు. ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీకి చెందిన అమిత్‌షాను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటికీ ప్రతిపక్షాలు టార్గెట్‌ కావడం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా ఆప్‌ కన్వీనర్‌ రమేష్‌ మాట్లాడుతూ దేశంలోని ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటిని దుర్వినియోగపరుస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలకు కార్పోరేట్‌ విద్యను అందించిన మనీష్‌ సిసోడియాను ఏడాది కాలంగా జైలులో వుంచిన ప్రభుత్వం ఇపుడు కేజ్రీవాల్‌ను కూడా అక్రమంగా అరెస్ట్‌ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు, నగర కార్యదర్శి డి కాశీపతి, నాయకులు సత్యబాబు, కాంగ్రెస్‌ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, సిపిఐ నాయకులు ఫణికుమార్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గన్నారు.

➡️