సుందరయ్య స్ఫూర్తితో నూతన రాజకీయ సంస్కృతి – కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి నేడు

దేశానికి, రాష్ట్రానికి నేడు సుందరయ్య స్ఫూర్తిదాయక విధానాల ఆవశ్యకత పెరిగింది. 1951 నాటికి తెలుగు ప్రజలు నాలుగైదు ముక్కలై ఉన్నారు. ఒక పెద్ద భాగం మద్రాసు ప్రావెన్సులో, మరో భాగం నైజాం తెలంగాణలో మరి కొన్ని చిన్న భాగాలుగా మహారాష్ట్ర, మైసూరు సంస్థానం, ఒరిస్సాలలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు భాషా ప్రాతిపదికపై రాష్ట్రాలు ఏర్పడాలన్న నినాదం దేశమంతటా వేగంగా వ్యాపించింది. అది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసింది. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్న ఫెడరల్‌ స్ఫూర్తికనుగుణంగా ఈ ఉద్యమాలు నడిచాయి. అప్పటికే రాష్ట్రంలో జమిందారీ వ్యతిరేక పోరాటాలు, వీర తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాది వేశాయి. ఈ పోరాటాలన్నింటినీ సుందరయ్య అగ్రభాగాన ఉండి నడిపించారు. ఈ నేపథ్యంలో పుచ్చలపల్లి సుందరయ్య రాసిన ”విశాలాంధ్రలో ప్రజారాజ్యం” గ్రంథం తెలుగు ప్రజల హృదయ స్పందనగా మారింది. 1951 ప్రథమ పార్లమెంటులో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుండి ఎక్కువ మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. సుందరయ్య ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. 1955 ఎన్నికల్లో నాటి ఆంధ్ర (విభజనానంతరం నేటి ఆంధ్రప్రదేశ్‌) భాగంలో కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని అందుకోబోతున్నంత ఉధృతంగా క్యాంపెయిన్‌ సాగింది. నాటి కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకించి భూస్వామ్య శక్తులు కమ్యూనిస్టులపై అనేక అభాండాలు, తప్పుడు ప్రచారాలు చేశారు. పెత్తందారీతనాన్ని, డబ్బుని ఉపయోగించి కమ్యూనిస్టుల్ని అధికారంలోకి రాకుండా నిరోధించగలిగారు. క్రమంగా ఆర్థిక, రాజకీయ రంగాలలో వచ్చిన అనేక మార్పులు కమ్యూనిస్టు పార్టీని బలహీనపరుస్తూ వచ్చాయి. నూతన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ వ్యూహం, ఎత్తుగడలను నిర్ణయించుకోవడంలో పార్టీలో వచ్చిన అంతర్గత విభేదాలు చీలికలకు దారితీశాయి. ఎడాపెడా చీలికల అనంతరం 1969 నాటికి సిపిఐ(యం) బలహీనమైన స్థానంలోకి వెళ్ళిపోయింది. బడా పెట్టుబడిదారుల నాయకత్వంలోని బూర్జువా, భూస్వామ్య శక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలపై పట్టు సాధించాయి. 1973-75 మధ్య బెంగాల్‌లో అర్థ ఫాసిస్టు నిర్బంధకాండలో వేయి మందికిపైగా నేలకొలిగారు. 1975-77 ఎమర్జెన్సీ, తదనంతర పరిణామాలు సిపిఐ(యం) తీసుకున్న రాజకీయ విధానానికి విజయంగా భావించవచ్చు. అప్పటి వరకు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన సిపిఐ(యం) దేశవ్యాపిత పార్టీగా విస్తరించింది. సిపిఐ(యం) నాయ కత్వంలో కేరళ, బెంగాల్‌, త్రిపురలలో ఎన్నికల్లో సాధించిన విజయాలు జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీల మధ్య ఐక్యతకు పునాది వేశాయి. ఈ విజయాల అనంతరం సిపిఐ కూడా వామపక్ష ప్రభుత్వాల్లో భాగస్వామ్యమైంది. ఈ కాలమంతటా సుందరయ్య సిపిఐ(యం) పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
సుందరయ్య 1978 తరువాత రాష్ట్రానికి తిరిగి వచ్చి 1981లో రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ప్రణాళికాబద్దమైన కృషిని సాగించారు. 1978 నాటికి మన రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పార్టీ లేదు. ఉన్న జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈ స్థితిలో విద్యార్ధి, కార్మిక రంగాలపై కేంద్రీకరించి పురోగతి సాధించింది. 1979-81 మధ్య రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున భూపోరాటాలు సాగాయి. గిట్టుబాటు ధరల కోసం రైతు ఉద్యమాలు నడిచాయి. వేతనాల పెంపుదల కోసం వ్యవసాయ కార్మిక సమ్మెలు నడిచాయి. కార్మికోద్యమాలను సంఘటితపర్చడానికి కీలక పరిశ్రమల్లో ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమాన్ని బలపర్చడానికి సుందరయ్య చేసిన కృషి అపారమైనది. ఈ పోరాటాల ఫలితంగా 1983 నాటికి రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా కమ్యూనిస్టు పార్టీ ముందుకు రావడానికి అవసరమైన రాజకీయ నేపథ్యం ఏర్పడింది. ఈ సమయంలోనే ఎన్‌.టి.రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండే భూస్వామ్య శక్తులు, కొందరు ధనిక రైతులు తెలుగుదేశంలో చేరారు. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీని వెనక్కి నెట్టి తెలుగుదేశం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించింది. నాడు సిపిఐ, సిపిఐ(యం) అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసి 9 స్థానాల్లో విజయం సాధించారు. 1984లో కాంగ్రెస్‌ ప్రోద్భలంతో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో ఎన్‌టిఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చారు. ప్రజలు దీన్ని సహించలేకపోయారు. దీనిని తమమీద దాడిగా భావించారు. వెనువెంటనే రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం రగిలింది. దీన్ని ముందుండి నడిపించినవారు సుందరయ్య. నాడు సుందరయ్య ఇచ్చిన పిలుపు ఎన్‌టిఆర్‌ సహా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు, తెలుగుదేశం అభిమానులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఫలితంగా ఇందిరా గాంధీ తలవంచి ఎన్‌టిఆర్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ ప్రజాస్వామిక చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టం.

కార్పొరేట్‌ రాజకీయ సంస్కృతి
నూతన ఆర్థిక విధానాల పేరుతో 1991లో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ షరతులను దేశంపై రుద్ది అమలు చేయడం మొదలు పెట్టాక కొత్త పరిణామాలు ప్రారంభమయ్యాయి. రాజకీయ రంగం మీద వాటి ప్రభావం తీవ్రంగా పడింది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ తదితర బూర్జువా పార్టీలలో వ్యాపారాల్లో, వ్యవసాయంలో సంపాదించుకున్న బడా వ్యాపారవేత్తలు, భూస్వాములు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. బడా పెట్టుబడిదారులెవరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. స్వాతంత్య్రోద్యమ ప్రభావం కొంత కాలం పాటు కొనసాగింది. బయట సంపాదించుకున్న డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టి, గెలిచి తమ అధికారాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడేందుకు సాధనంగా వాడుకునేవారు. స్థానికంగా ప్రజల మీద తమ పట్టు నిలబెట్టుకునేందుకు అధికారాన్ని ఉపయోగించారు. కానీ 21వ శతాబ్దం ప్రారంభం నుండి రాజకీయ రంగం రూపురేఖలు మారాయి. డబ్బున్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడంగాకుండా డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి రావడం మొదలైంది. బడా కార్పొరేట్లు ప్రత్యక్షంగా దిగారు. రాజకీయం వ్యాపార రంగంగా మారింది. ఓటును ఒక సరుకుగా మార్చేశారు. మీడియాను నియంత్రణలోకి తెచ్చుకున్నారు. సోషల్‌ మీడియాను దానికి సాధనంగా వాడుకుంటున్నారు. స్వేచ్ఛగా ఓటేసే హక్కును ప్రజలు కోల్పోతున్న పరిస్థితి. ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసే విధానం మొదట దక్షిణాది రాష్ట్రాల్లో మొదలై క్రమంగా దేశమంతటా విస్తరించింది. కేరళ, బెంగాల్‌, త్రిపుర లాంటి వామపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో డబ్బు పంపిణీ దాదాపు లేదనే చెప్పవచ్చు. కానీ ఇటీవల కాలంలో ఆ రాష్ట్రాలకూ ఈ జబ్బు విస్తరించింది. డబ్బు అనేక రూపాల్లో రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది. ఓటు వేస్తారా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రతి ఇంటికి ఓటుకు ఇంత అని స్లిప్పుతో పాటు కవర్‌లో పెట్టి పంపిణీ చేస్తున్నారు. తమకు డబ్బు అందకుంటే ఆందోళన చేసే స్థాయికి ప్రజలు కూడా వెళ్ళారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ చేయడమే గాకుండా దానికి ముందు సేవా, సహాయ కార్యక్రమాల పేరుతో ధనవంతులు ప్రజలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి అప్పటి వరకు పరిచయం లేకున్నా డబ్బు సంచులతో దిగి అనుచరులను, వందిమాగధులను సంపాదించుకుంటున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేయక ముందే వారి పేరు, కొత్తగా ఉత్పత్తి చేసిన ప్రతిష్ట ప్రజలకు చేరిపోతున్నది. 2014లో మోడీ పర్సనాలిటీ బిల్డింగ్‌ (వ్యక్తిత్వ నిర్మాణం) దానికి పెద్ద ఉదాహరణ. ఆ ప్రాంతంతో సంబంధం లేనివాళ్ళూ దిగుమతి అవుతున్నారు. ఒక పార్టీ టికెట్టు కోసం దరఖాస్తు చేసుకొన్నా టికెట్టు రాకుంటే మరొక పార్టీకి వెంటనే జంప్‌ అయి పోతున్నారు. కమ్యూనిస్టు పార్టీలు మినహా ఏ పార్టీ పేరుమీదనైనా వారు పోటీ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ట్రెండ్‌ పార్టీలే ఆయా అభ్యర్థులను మార్చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన వారిలో కొంత మంది సీటు ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీ తరపునే అభ్యర్థి పోటీ చేయడం. అనపర్తి, ఉండి లాంటి నియోజకవర్గాలు దీనికి పెద్ద ఉదాహరణ. రాజకీయాల్లో ప్రవహిస్తున్న ఈ డబ్బు జనాన్ని దోచుకున్నదే. అవినీతి నేడు సహజ వనరులపై ఆధిపత్యం, ప్రభుత్వ సహకారంతో బ్లాక్‌ మనీ పోగేసుకోవడం అన్నీ కలిపి కుబేరుల చేతుల్లోకి సంపద పోయింది. అదే ఎన్నికల బాండ్ల పేరుతో చట్టబద్దమైంది. అవినీతి సొమ్ముతో రాజకీయాలు నడుస్తున్నాయి. జనాన్ని కూడా అవినీతి కూపంలోకి దించి తమకు అడ్డు లేకుండా చేసుకుంటున్నారు.

ప్రజల్ని చీలుస్తున్న సోషల్‌ ఇంజనీరింగ్‌
ఈ ఎన్నికల్లో వ్యక్తమైన మరో ధోరణి సోషల్‌ ఇంజనీరింగ్‌. ఇది కొత్తది కాకపోయినా బిజెపి ఈ ఎన్నికల్లో దాన్ని పతాక స్థాయికి చేర్చింది. కులాలు, ఉప కులాలు, తెగలు, ఉప తెగల మధ్య పోటీ పెరిగింది. అస్థిత్వ రాజకీయాల ప్రత్యక్ష ఫలితమిది. కులాలవారీ అడ్డంగా, నిలువునా చీలికలు, పోటీలు చివరకు శ్రామిక ప్రజల మధ్య అనైక్యతకు, ఘర్షణలకు దారితీస్తున్నది. ప్రజల మధ్య చీలికలను పెట్టుబడిదారీ వ్యవస్థను శాశ్వతం చేసుకోవడానికి సాధనంగా వాడుకుంటున్నారు. ఆ యా కులాల, తెగల నాయకులకు కొన్ని పదవులు మరికొంత డబ్బు ఇచ్చి దగ్గర (ఇంక్లూజివ్‌) చేసుకుంటున్నారు. తమకు నమ్మకమైన అనుచరులుగానూ, ఏజెంట్లుగానూ మార్చుకుంటున్నారు. ప్రజలకు, పెట్టుబడిదార్లకు మధ్య వీరే వారధులు. వైఎస్సార్‌ ప్రభుత్వం వచ్చాక దీనిని మరింత ఆధునీకరించి ప్రజలతో నిత్య సంబంధాల కోసం వలంటీర్‌ వ్యవస్థను ఏర్పర్చింది. ఒకరకంగా ఇది ప్రజలపై నిఘా (సర్వైలెన్స్‌) లాంటిదే. మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రజలపై నిఘా పెరిగింది. దానికి సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వంటి ఆధునిక సాధనాలు తోడ్పడుతున్నాయి. ప్రజాస్వామ్య హక్కులు కుంచించుకు పోతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఏక వ్యక్తి నియంతృత్వానికి దారి తీసే ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి.

నూతన రాజకీయ సంస్కృతికి బాట కమ్యూనిస్టు పార్టీ
కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామిక విలువలకు, సాంప్రదాయాలకు వారసురాలు. నాడు సుందరయ్య ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పిలుపు నేటికీ అనుసరణీయం. ఆ పుస్తకంలోని 5వ అధ్యాయం నూతన రాష్ట్రంలో నూతన ప్రజాస్వామిక వ్యవస్థ గురించి వర్ణించారు. ఇందులో ప్రజలే ప్రభువులు. ప్రజల చేతికి అధికారం రావాలంటే పంచాయతీ వ్యవస్థ బలపడాలని, 18 సంవత్సరాలు దాటిన వయోజను లంతా గ్రామ సభల్లో భాగస్వామిగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ నూతన ప్రజాస్వామిక వ్యవస్థ స్వరూప స్వభావాలను ఆయన వర్ణించారు. ఎన్నికల వ్యవస్థ ఎలా ఉండాలి, న్యాయ వ్యవస్థ ఎలా పని చేయాలి, మెరుగైన ఆధునిక విద్యా, వైద్య సదుపాయాలెలా ఉండాలో నిర్దిష్టంగా పేర్కొన్నారు. అందమైన, ఆరోగ్యవంతమైన గ్రామ సీమల నిర్మాణానికి ఆయన స్పష్టమైన ప్రణాళికను ప్రకటించారు. రైతులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు, వృత్తిదారులు, మహిళలకు ఉండే ప్రజాస్వామిక హక్కులను నిర్దిష్టంగా పేర్కొన్నారు. ఆనాటికీ, నేటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు న్నప్పటికీ సుందరయ్య కన్న కల ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం ఒక కర్తవ్యంగా మన ముందున్నది.
సుందరయ్య కల నిజమవ్వాలంటే బలమైన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాలి. డబ్బు పాత్ర లేని ఎన్నికల వ్యవస్థ రావాలి. ప్రతి పార్టీకి ఎన్నికలకయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరించాలి. దామాషా ప్రాతిపదికపై ప్రజా ప్రతినిధులు ఎన్నికవ్వాలి. ప్రజా ప్రతినిధులు దారి తప్పితే వారిని వెనక్కి పిలిపించే (రీకాల్‌) హక్కు ప్రజలకుండాలి. ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు జరపని పార్టీలపై చర్యలుండాలి. ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలి. మతాన్ని రాజకీయాలకు దుర్వినియోగం చేయడాన్ని నిషేధించాలి. రాజకీయాల్లో కార్పొరేట్ల ఆధిపత్యాన్ని సవాలు చేసే శ్రామిక వర్గం చొరవతో ముందుకొస్తేనే నూతన రాజకీయ సంస్కృతికి పునాది పడుతుంది. రాష్ట్రంలో యువతరం, ప్రగతిశీల, ప్రజాస్వామికవాదులు మతోన్మాద రాజకీయాన్ని, కార్పొరేట్‌ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి నూతన సంస్కృతిని ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకురావాలి. అదే మనం సుందరయ్యకు అర్పించే నివాళి.

 వ్యాసకర్త సిపిఎం ఎ.పి రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

➡️