ఆగని ఇజ్రాయిల్‌ దాడులు

May 26,2024 23:02 #gaja, #issrel
  • మరో 30 మంది గాజా పౌరులు మృతి
  • చర్చల పునరుద్ధరణకు యత్నాలు

రఫా: అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయిల్‌ దళాలు రఫాతో సహా గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతున్నాయి. తాజా దాడుల్లో మరో 30 మంది పాలస్తీనీయులు చనిపోయారు. ఒక వైపు హమాస్‌పై యుద్ధం పేరుతో ఇజ్రాయిల్‌ యథేచ్ఛగా మారణ కాండను కొనసాగిస్తుండగా, వచ్చేవారం ఇరు పక్షాలమధ్య చర్చలు తిరిగి ప్రారంభించేందుకు మధ్యవర్తులు యత్నిస్తున్నారు. ఇజ్రాయిల్‌ గూఢచారి సంస్థ మొసాద్‌, అమెరికన్‌ గూఢచారి సంస్థ సిఐఎ అధిపతి, ఖతార్‌ ప్రధానితో జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్‌, ఈజిప్టు, అమెరికా ప్రమేయంతో కొన్ని కొత్త ప్రతిపాదనలను చర్చకు పెడతాయని ఈ వర్గాలు తెలిపాయి. చర్చల పునరుద్ధరణ పై హమాస్‌ ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించి ఇంతకు ముందు కైరోలో జరిగిన చర్చల్లో మధ్యవర్తులు సూచించిన ముసాయిదా ఒప్పందానికి హమాస్‌ అంగీకరించినా, ఇజ్రాయిల్‌ మొండిగా తిరస్కరించింది. అంతర్జాతీయ న్యాయస్థానం గాజాపై ఇజ్రాయిల్‌ దాడులను తక్షణమే ఆపాలని ఆదేశించడం, అంతర్జాతీయ నేర విచారణ కోర్టు (ఐసిసి) చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతున్న నెతన్యాహుకు అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని కోరడం వంటి పరిణామాలతో ఇజ్రాయిల్‌, దానికి అతిపెద్ద మద్దతుదారుగా ఉన్న అమెరికా అంతర్జాతీయంగా మరింత ఒంటరిపాటుకు గురయ్యాయి.
ఇంకోవైపు లెబనాన్‌ నుంచి హిజ్బుల్లాలు, యెమెన్‌ నుంచి హౌతీలు ఇజ్రాయిల్‌, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలపై ప్రతీకార చర్యలకు పూనుకోవడంతో ఇది ప్రాంతీయ యుద్ధానికి దారి తీసేలా ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌, అమెరికా చర్చల పునరుద్ధరణకు అయిష్టంగానైనా అంగీకరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. చర్చలకు ఒక వైపు అంగీకరిస్తూనే మరో వైపు గాజాపై బాంబు దాడులను తీవ్రతరం చేయడం యూదు దుర్హంకార నెతన్యాహు ప్రభుత్వ కపటత్వాన్ని తెలియజేస్తోంది. ఇజ్రాయిల్‌ గత 230 రోజులుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల్లో పిల్లలు, మహిళలతో సహా మొత్తం 35,903 మంది పాలస్తీనీయులు చనిపోయారు. మరో 80,420 మంది గాయపడ్డారు. గాజాకు సంఘీభావంగా యెమెన్‌లోను, పశ్చిమ దేశాల్లోను ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

➡️