భారత్‌ అత్యంత పేద దేశం

May 21,2024 09:20
  •  నిరుద్యోగం ఎక్కువ
  •  ఉద్యోగాలు కల్పిస్తేనే అభివృద్థి
  •  ఓటర్లు పరిపక్వత కలిగిన వారు
  •  ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌

న్యూఢిల్లీ : భారత్‌ ఇప్పటికీ అత్యంత పేద దేశమేనని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. జి20 దేశాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్నప్పటికీ.. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ పేద దేశమేనని పేర్కొన్నారు. సిఎన్‌ఎన్‌ ఇంటర్యూలో ‘ఆన్‌ జిపిఎస్‌ : ఇండియాస్‌ ఎంప్లాయిమెంట్‌ క్రైసిస్‌’ అనే అంశంపై రాజన్‌ మాట్లాడుతూ.. భారత్‌లోని నిరుద్యోగ సమస్యపై విమర్శలు గుప్పించారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) రిపోర్ట్‌ ప్రకారం.. 2024 ఏప్రిల్‌ నాటికి భారత్‌లో 8.1 శాతం నిరుద్యోగం ఉందన్నారు. భారతదేశంలోని శ్రామిక జనాభాలో కేవలం 37.6 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని వివరించారు. పెద్ద సంఖ్యలో యువత శ్రామికశక్తిలోకి వస్తేనే మేలు జరుగుతుందన్నారు. యువకులకు కావలసిన ఉపాధి కల్పించగలిగితేనే.. దేశం మరింత వేగంగా అభివృద్థి చెందుతుందన్నారు.
”ఇక్కడ అధిక జనాభా ఉండటం వల్ల మొత్తం జిడిపి పరంగా ఇతర దేశాలను అధిగమిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే బ్రిటన్‌ను ఇండియా అధిగమించింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌, జర్మనీలను అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. భారతదేశం వృద్దాప్యం కాకముందే భారతీయులు ధనవంతులు కాగలరా..? అన్నదే ప్రశ్న.” అని రాజన్‌ అన్నారు.
ప్రస్తుతం భారత జనాభాకు వయసు పెరుగుతుందని రాజన్‌ పేర్కొన్నారు. 2047-2050 నాటికి భారతీయ జనాభా వృద్ధాప్యంలోకి ప్రవేశించనుందన్నారు. అప్పటికి మనం ధనవంతులం కాబోతున్నామా అన్నదే అసలు ప్రశ్న అని రాజన్‌ అన్నారు. భారతదేశానికి తగినంత ఉద్యోగాలను సృష్టించడం, వారికి ఉపాధి కల్పించేలా నైపుణ్యాన్ని పెంచడం, కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం తక్షణ సవాల్‌గా రాజన్‌ పేర్కొన్నారు.
కాగా.. భారత్‌ ప్రస్తుతం కొనసాగుతున్న 6-6.5 శాతం వృద్థితో దానిని సాధించటం కుదరదని రాజన్‌ అన్నారు. మోడీ ప్రభుత్వానికి ఎంత క్రెడిట్‌ దక్కుతుందనే ప్రశ్నపై రాజన్‌ సమాధానం ఇస్తూ.. రోడ్లు, రైల్వేలు నిర్మాణాలు, మౌలిక వసతులు బాగున్నప్పటికీ.. ముఖ్యంగా చర్చలు, చర్చల కోసం స్వేచ్ఛా వాతావరణం అవసరమని సూచించారు. అలాగే దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
2024 ఆర్థిక సర్వేలో నిరుద్యోగ పదాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదని రాజన్‌ అన్నారు. జాతీయవాదం, మైనారిటీలపై స్పందించిన రాజన్‌ ఏ దేశమూ తన జనాభాలో అధిక భాగాన్ని ద్వితీయ శ్రేణీ పౌరులుగా పరిగణించడం ద్వారా విజయం సాధించలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం అనుభవిస్తున్న సమానత్వ వాతావరణాన్ని ఎవరూ రద్దు చేయలేరని విమర్శించారు. బిజెపి ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని చర్యలు ముస్లింలతో పాటు ఇతర మైనారిటీలకు చాలా బలమైన ప్రతికూల సంకేతాలను పంపుతున్నాయని అన్నారు. టాప్‌ 100లో భారతదేశానికి చెందిన ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదని రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం ఎప్పుడూ ఆశ్చర్యపరిచే మార్గాన్ని కలిగి ఉందని, ”భారత ఓటర్ల పరిపక్వతను చూసి మనం మళ్లీ మళ్లీ ఆశ్చర్యపోతాము” అని రాజన్‌ అన్నారు.

➡️