IPL 17 season: కెకెఆర్‌ తీన్‌మార్‌

May 27,2024 10:06 #ipl 2024, #kkr, #win
  • ఐపిఎల్‌ 2024 టైటిల్‌ కొల్‌కతా నైట్‌రైడర్స్‌ వశం
  • ఫైనల్లో సన్‌రైజర్స్‌కు భంగపాటు
  • హైదరాబాద్‌ బ్యాటర్ల వైఫల్యం
  • హైదరాబాద్‌ 113/10, కొల్‌కతా 114/2

ఆదివారం చెపాక్‌లో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలుపొందిన కొల్‌కతా నైట్‌రైడర్స్‌ ముచ్చటగా మూడోసారి ఐపిఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. 2012, 2014లో గంభీర్‌ కెప్టెన్సీ టైటిల్‌ కొట్టిన కొల్‌కతా 2024లో గంభీర్‌ కోచింగ్‌ సారథ్యంలో టైటిల్‌ అందుకుంది.
సన్‌రైజర్స్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. పరుగుల వరద పక్కనపెడితే.. కనీసం పోటీ ఇవ్వగల స్కోరు సాధించలేదు. కొల్‌కతా పేసర్లు స్టార్క్‌, రానా, రసెల్‌ విజృంభించటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఐపిఎల్‌ ఫైనల్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు. ఈ సీజనో కొల్‌కతా చేతిలో హైదరాబాద్‌కు ఇది హ్యాట్రిక్‌ పరాజయం. స్వల్ప లక్ష్యాన్ని కొల్‌కతా బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఛేదించారు. వెంకటేశ్‌ అయ్యర్‌ (52 నాటౌట్‌), రెహ్మనుల్లా గుర్బాజ్‌ (39) పవర్‌ప్లేలోనే టైటిల్‌ విజయం లాంఛనం చేశారు. మరో 57 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన కొల్‌కతా నైట్‌రైడర్స్‌ సన్‌రైజర్స్‌పై ఈ సీజన్లో మూడో విజయంతో పాటు ఐపిఎల్‌లో మూడో టైటిల్‌ను ముద్దాడింది.

చెన్నై : కొల్‌కతా నైట్‌రైడర్స్‌ సాధించింది. 2022, 2023 సీజన్లలో ఏడో స్థానానికి పరిమితమై కనీసం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించని నైట్‌రైడర్స్‌ 2024 ఐపిఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరిగిన ఐపిఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కొల్‌కతా నైట్‌రైడర్స్‌ మూడోసారి టైటిల్‌ సొంతం చేసుకుంది. 114 పరుగుల ఛేదనలో కొల్‌కతా బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్‌ రెహ్మనుల్లా గుర్బాజ్‌ (39, 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరువగా.. నం.3 బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (52 నాటౌట్‌, 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. 10.3 ఓవర్లలోనే కొల్‌కతా నైట్‌రైడర్స్‌ లాంఛనం ముగించింది. రెహ్మనుల్లా, వెంకటేశ్‌ రెండో వికెట్‌కు 91 పరుగులు జోడించి సన్‌రైజర్స్‌ ఆశలు ఆవిరి చేశారు. సునీల్‌ నరైన్‌ (6) నిరాశపరిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కోల్‌కత పేసర్లు మిచెల్‌ స్టార్క్‌ (2/14), హర్షిత్‌ రానా (2/24), అండ్రీ రసెల్‌ (3/19) స్వింగ్‌, పేస్‌, స్లో బాల్స్‌తో వణికించారు. 18.3 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 113 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (24, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (16, 17 బంతుల్లో 1 ఫోర్‌), ఎడెన్‌ మార్‌క్రామ్‌(20, 23 బంతుల్లో 3 ఫోర్లు) చెప్పుకోదగిన పరుగులు సాధించారు. ట్రావిశ్‌ హెడ్‌ (0), అభిషేక్‌ శర్మ (2) విఫలమయ్యారు.


టాప్‌ ఫ్లాప్‌ షో

ఐపిఎల్‌ ఫైనల్లో టాస్‌ నెగ్గిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆ తర్వాత ఏదీ కలిసి రాలేదు. ఎర్రమట్టి పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్‌ ఓపెనర్లను ఆరంభంలోనే కోల్పోయింది. అభిషేక్‌ శర్మ (2)ను మిచెల్‌ స్టార్క్‌ సూపర్‌ బాల్‌తో క్లీన్‌బౌల్డ్‌ చేయగా.. ట్రావిశ్‌ హెడ్‌ (0)ను తొలి బంతికే వైభవ్‌ అరోరా సాగనంపాడు. విధ్వంసక ఓపెనర్లు ఇద్దరూ ఆరు బంతుల్లో 2 పరుగులకే నిష్క్రమించగా సన్‌రైజర్స్‌ శిబిరం నైరాశ్యంలో కూరుకుంది. రాహుల్‌ త్రిపాఠి (9) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా.. మిచెల్‌ స్టార్క్‌ ముందు తలొంచక తప్పలేదు. ఓ ఫోర్‌, సిక్సర్‌తో ఆశలు రేపిన తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ (13) హర్షిత్‌ రానా ఓవర్లో వికెట్‌ పారేసుకున్నాడు. దీంతో 47/4తో సన్‌రైజర్స్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. టాప్‌-3 బ్యాటర్లలో ఎవరూ రెండెంకల స్కోరు అందుకోలేకపోయారు.

క్లాసెన్‌ ఆదుకోలేదు

ఈ సీజన్లో హైదరాబాద్‌ను క్లిష్ట పరిస్థితుల్లో నిలకడగా ఆదుకున్న హెన్రిచ్‌ క్లాసెన్‌ (16) సైతం ఈసారి నిలబడలేదు. ఎడెన్‌ మార్‌క్రామ్‌ (20)తో కలిసి క్లాసెన్‌ కాసేపు వికెట్ల పతనం ఆపాడు. దీంతో నెమ్మదిగా ఇన్నింగ్స్‌ గాడిలో పడినట్టే అనిపించింది. కానీ మార్‌క్రామ్‌ వికెట్‌తో కథ మళ్లీ మొదటికొచ్చింది. షాబాజ్‌ అహ్మద్‌ (8), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అబ్దుల్‌ సమద్‌ (4) సహా జైదేవ్‌ ఉనద్కత్‌ (4) నిరాశపరిచారు. పాట్‌ కమిన్స్‌ (24) రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో జట్టు స్కోరు వంద పరుగుల మార్క్‌ దాటించాడు. 18.3 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 113 పరుగులకు ఆలౌటైంది.

➡️