Mamata Banerjee: ఏకపక్ష చర్చలు ఆమోదయోగ్యం కాదు

కోల్‌కతా :  బంగ్లాదేశ్‌ -కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన నీటి పంపిణీ చర్చలను పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ చర్చలకు తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. తీస్తా నీటి పంపిణీపై కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష చర్చలు, సంప్రదింపులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. తీస్తా నది, గంగానది జలాల భాగస్వామ్య ఒప్పందం అంశంపై గత వారం బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో ప్రధాని మోడీ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

2026తో ముగియనున్న భారత్‌ -బంగ్లాదేశ్‌ ఫరక్కా ఒప్పందం (1996)ను కేంద్రం పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోందని, ఇది బంగ్లాదేశ్‌ -భారత్‌ల మధ్య నీటి భాగస్వామ్యం గురించి వివరించే ఒప్పందమని అన్నారు. అయితే ఈ ఒప్పందం బెంగాల్‌ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి ఒప్పందాల వల్ల పశ్చిమ బెంగాల్‌ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. భారత్‌ -బంగ్లాదేశ్‌ల మధ్య రైల్వే లైన్‌, బస్‌ సర్వీసుల అంశాల్లో గతంలో బంగ్లాదేశ్‌కు పశ్చిమ బెంగాల్‌ సహకారం అందించిందని అన్నారు.

నీరు చాలా విలువైనది, ప్రజల జీవనాధారం. ప్రజలపై తీవ్రమైన, ప్రతికూల ప్రభావం చూపే సున్నితమైన సమస్యపై తాము రాజీపడలేమని లేఖలో స్పష్టం చేశారు. తీస్తానది జలాల విషయంలో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

➡️