ఇజ్రాయిల్‌, అమెరికా రెండూ దోషులే !

May 10,2024 05:16 #editpage

అవతలి వైపు ఈజిప్టు, ఇవతలి వైపు పాలస్తీనా సరిహద్దులో రఫా వద్ద ఉన్న నడవాను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్‌ మిలిటరీ పాలస్తీనా వైపు ప్రాంతాన్ని ఒక అమెరికా కిరాయి సాయుధ సంస్థకు అప్పగించింది. వారికి అవసరమైనపుడు సాయం చేసేందుకు ఇజ్రాయిల్‌- అమెరికా-ఈజిప్టు మధ్య ఒక ఒప్పందం కుదిరింది.ఈ చర్య తమ భూభాగాన్ని దురాక్రమణ చేయటమేనని, అందువలన దురాక్రమణదారులను ఎదుర్కొనేందుకు సాయుధ దాడులతో సహా తమకు అన్ని హక్కులూ ఉన్నాయని పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్న పలు సంస్థలు బుధవారం నాడు స్పష్టం చేశాయి. మూడు దేశాల ఒప్పందం ఏ విధంగా చూసినా అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ఉల్లంఘన తప్ప మరొకటి కాదు. ఒక వైపు కాల్పుల విరమణ గురించి కైరోలో చర్చలకు సిద్ధమంటూనే గాజా పౌరులపై మారణకాండను మరింత తీవ్రం గావించేందుకు, ఆకలి, రోగాలతో మాడ్చి చంపేందుకు పూనుకున్న ఇజ్రాయిల్‌కు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. మధ్యవర్తిగా ఉన్న ఈజిప్టు కూడా పరోక్షంగా వంత పాడుతున్నది. ఇదంతా కొరకరాని కొయ్యగా ఉన్న హమాస్‌ను లొంగదీసుకొనేందుకు తప్ప మరొకటి కాదు.
గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయిల్‌ ప్రాంతంపై హమాస్‌ జరిపిన దాడిని సాకుగా చేసుకొని గతేడాది అక్టోబరు ఏడు నుంచి సాగిస్తున్న మారణకాండ నివారణలో ఐరాస ఘోరంగా విఫలమైంది. అమెరికా ఒత్తిడి కారణంగా ప్రపంచ న్యాయస్థానం కూడా చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా, నికరాగువా దాఖలు చేసిన కేసుల విచారణను సాగదీస్తున్నది. ఈ పూర్వరంగంలో తమనెవరూ అడ్డుకోలేరన్న తెగింపుతో దారుణాలను కానసాగించేందుకు పూనుకున్నారు. ఇది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో అనూహ్యం. అనేక దేశాల మీద దురాక్రమణ, దాడులకు పూనుకున్నపుడు అమెరికన్‌ సైనికులు మరణిస్తే తలెత్తుతున్న స్వజన ఆగ్రహాన్ని తట్టుకోలేని అమెరికా పాలకులు ప్రపంచమంతటా అమెరికా మాజీ సైనికులు, ఇతరులతో కూడిన కిరాయి మూకలను రంగంలోకి దించుతున్నది. తమ చేతులకు మట్టి అంటకుండా అలాంటి కిరాయి సంస్థనే రఫా క్రాస్‌లో కూడా నియమించి ఇజ్రాయిల్‌, అమెరికా ఇప్పుడు అదే చేస్తున్నాయి. రఫా క్రాస్‌ను ఆక్రమించుకొనేందుకు, నగరంపై దాడి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటూనే కైరో చర్చలను సాగదీశాయని స్పష్టమైంది. కాల్పుల విరమణ ప్రతిపాదనలకు అంగీకరించదనే అమెరికా అంచనాలను వమ్ముచేస్తూ హమాస్‌ అంగీకారం తెలిపింది. దాంతో ప్లేటు మార్చి దానిలో ఉన్న అంశాలు తామనుకున్నట్లుగా లేవని ఇజ్రాయిల్‌ పరక్షోంగా తిరస్కరించింది. కాల్పుల విరమణకు హమాసే ఆటంకంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ముందుగానే ఆరోపించాడు. ఇజ్రాయిల్‌ దాడుల ప్రారంభం నుంచి నెపాన్ని హమాస్‌ మీద నెట్టేందుకే చూస్తున్నది. ఇజ్రాయిల్‌ను దోషిగా చూపుతూ ఐరాసలో ప్రవేశ పెడుతున్న తీర్మానాలన్నింటినీ అమెరికా వ్యతిరేకిస్తున్నది, భద్రతా మండలిలో వీటో చేస్తున్నది.
మరోవైపు మానవత్వం, మానవ హక్కుల గురించి ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా, పశ్చిమ దేశాలకు గాజాలో అల్లాడుతున్న జనం కనిపించటం లేదు. ఇజ్రాయిల్‌కు బాంబులు, ఇతర మారణాయుధాలను పంపటం తక్షణావసరంగా చెబుతున్నాయి. తమ చర్యలను సమర్ధించుకొనేందుకు ఆడుతున్న నాటకాలెన్నో. రఫాపై దాడులకు తాము వ్యతిరేకమంటూ అమెరికా ఉత్తుత్తి ప్రకటనలు చేసింది. తమ మాట వినలేదు గనుక పంపదలచిన బాంబుల అందచేత నిలిపివేసినట్లు మరో డ్రామాకు తెరతీసింది. ఇదంతా ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకే అన్నది స్పష్టం. వాటిని దొడ్డిదారిన పంపదని కూడా చెప్పలేము. ఆ బాంబులు ఎంత పెద్దవంటే ఒక్కొక్కటి 900 కిలోలున్నవి 1,800లు…225 కిలోల బరువున్నవి 1,700లు పంపాలని నిర్ణయించింది. వాటిని ప్రయోగించిన చోట భవనాలు నేలమట్టం అవుతాయి. జనాల ప్రాణాలు గాలిలో కలసిపోతాయి. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన బాంబులు యూదు దురహంకారుల దగ్గర గుట్టలుగా పడి ఉన్నాయి. గాజాను సర్వనాశనం చేశాయి. నిజానికి కొత్త వాటి అవసరం లేదు. రఫా నగరం, పరిసరాలపై దాడి జరిగితే అక్కడున్న ఆరులక్షల మంది పిల్లలతో సహా పన్నెండు లక్షల మంది నిస్సహాయ పౌరుల భవిష్యత్‌కు ముప్పు అని ఐరాస ప్రధాన కార్యదర్శితో సహా ఎందరు చెప్పినా వినకుండా ముందుకుపోతున్న దుష్ట శక్తులు, వాటికి మద్దతు ఇస్తున్న సామ్రాజ్యవాదులను శాంతిశక్తులే అడ్డుకోగలవు. ఇప్పటికే అమెరికాలో విద్యార్థులు ఆ ప్రక్రియలో ముందున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచమంతా కదలాలి, మారణకాండను ఆపేందుకు పూనుకోవాలి.
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️