రాజ్యాంగ హక్కుల పరిరక్షణకే మన ఓటు

May 10,2024 04:50 #editpage

భారత ప్రజాస్వామ్యంలో 18వ సాధారణ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. నాల్గవ దశ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో వివిధ ప్రాంతాలలో మే 13న జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాలు, ముఖ్యంగా ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల పట్ల అనేక మంది మేధావులు, రాజ్యాంగ నిపుణులు, విద్యావేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, రాజ్యాంగ మౌలిక స్వరూప లక్ష్యాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి గౌరవం లేదు. దశాబ్ద కాలంలో ఆర్థిక, సామాజిక అసమానతలు విపరీతంగా పెరిగాయి. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, క్రోనీ కాపిటలిజం అవధులు దాటి పెరిగాయి. మతతత్వ ధోరణులతో ప్రజలలో చీలిక తెస్తూ భావోద్వేగాలు రెచ్చగొట్టడం పరిపాటిగా మారింది. రాష్ట్రాల హక్కులు హరిస్తూ భారత సమాఖ్యను ‘ఏక కేంద్ర’ విధానంగా మార్చటానికి ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటరీ ప్రజా స్వామ్యంలో ఉండే భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని అణచి వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. స్వతంత్రంగా ఉండవలసిన న్యాయవ్యవస్థ అనేక వత్తిళ్లను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలలో రాజ్యాంగ హక్కుల, సంస్థల, వ్యవస్థల పరిరక్షణే ధ్యేయంగా ఓటు వేయవలసి ఉంటుంది.
ఆర్థిక, సామాజిక అసమానతలు
భారత రాజ్యాంగం ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం జరగాలని చెప్పింది. కాని గత దశాబ్ద కాలంలో ఆర్థిక, సామాజిక అసమానతలు విపరీతంగా పెరిగాయి. మోడీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో స్కిల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌, జన్‌ధన్‌ యోజన, ఆత్మనిర్భర్‌ భారత్‌, విశ్వగురు, అమృత్‌కాల్‌, సబ్‌ కా సాధ్‌ సబ్‌కా వికాస్‌, బేటీ పఢావో – బేటీ బచావో, సబ్‌కా ప్రయాస్‌-సబ్‌కా విశ్వాస్‌, హర్‌ ఘర్‌ తిరంగా … వంటి అనేక ఆకర్షణీయ పదాలతో డొల్ల నినాదాలు ప్రవేశపెట్టింది. ఇప్పుడు నరేంద్రమోడీ ”వికసిత్‌ భారత్‌” గురించి మాట్లాడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రచారం చేస్తున్నారు. కాని వాస్తవంలో భారతదేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య గత దశాబ్ద కాలంలో పెరిగింది. 2021 లోనే 7.5 కోట్ల మంది అదనంగా పేదల జాబితాలో చేరారు. మనవాభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచంలో 191 దేశలలో భారత్‌ 132వ స్థానంలో ఉన్నది. 2022 ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 121వ స్థానంలో ఉన్నది. 2022 నాటికి నిరుద్యోగం రేటు 8.3 శాతం పెరిగిందని సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్థ తెలియజేసింది. మోడీ 2014లో అధికారంలోకి రాగానే జాతీయ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో ఏర్పడిన ‘నీతి ఆయోగ్‌’ సంస్థ దేశానికి ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టలేదు.
ప్రముఖ అర్థ శాస్త్రవేత్త థామస్‌ పికెట్టీ ”కాపిటల్‌ అండ్‌ ఐడియాలజీ” అనే గ్రంథం, దానికి కొనసాగింపుగా ”కాపిటల్‌ ఇన్‌ ది ట్వింటీ ఫస్ట్‌ సెంచరీ” అనే గ్రంథం రాశారు. ఈ గ్రంథంలో ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆదాయం, సంపద పంపిణీ, పన్నులు మొదలగు వాటి గురించి అనేక వివరాలు ఉన్నాయి. భారతదేశంలో కూడా పెరిగిన అసమానతల గురించి వివరించాడు. ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం భారతదేశంలో బిలియనీర్లు 2020లో 102 మంది ఉంటే, 2021లో 142 మందికి పెరిగారు. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో 100 మంది ధనవంతుల దగ్గర పోగుపడిన సంపద రికార్డు స్థాయిలో 775 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. జాతీయ సంపదలో 2022లో మన జనాభాలో దిగువన ఉన్న 50 శాతం వాటా కేవలం 6 శాతం అయితే, అగ్ర భాగాన ఉన్న 10 శాతం వద్ద 45 శాతం సంపద కేంద్రీకరించబడింది.
క్రోనీ కాపిటలిజం విధానాల ఫలితంగా గౌతమ్‌ అదానీ ఆస్తులు 2014లో రూ.50 వేల కోట్లు ఉంటే, 2022 డిసెంబర్‌ నాటికి రూ.11 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్‌ పన్నులు 27.7 శాతం నుండి 22.6 శాతానికి తగ్గాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి పేదల నిజ ఆదాయాలు క్షీణించాయి. విశాఖ ఉక్కు కర్మాగారం వంటి పెద్ద ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిం చటానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నది.
‘ఫెడరలిజం’పై దాడి
మోడీ ప్రభుత్వం రాజ్యాంగ మాలిక భావన అయిన ఫెడరలిజంపై దాడికి పూనుకున్నది. రాష్ట్రాల హక్కులను హరించింది. జిఎస్‌టి ద్వారా రాష్ట్రాల ఆదాయ వనరులను దెబ్బతీసింది. 2029 నాటికి ‘జమిలి ఎన్నికలు’ ప్రవేశ పెట్టటానికి ప్రణాళిక రూపొందించింది. గవర్నర్ల ద్వారా కేరళ, తమిళనాడు, బెంగాల్‌ మొదలగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. హిందీ భాష ఆధిపత్యాన్ని ఇతర భాషలపై, ప్రాంతాలపై రుద్దటానికి ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా రాష్ట్రాలతో సంప్రదించకుండానే కేంద్రం చట్టాలు చేస్తున్నది. పార్లమెంట్‌ మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించండం దీనికి పెద్ద ఉదాహరణ. రైతాంగ ఉద్యమం ద్వారానే ఈ చట్టాలను ఉపసంహరించుకోవడం రైతాంగ ఉద్యమం సాధించిన గొప్ప విజయం. జాతీయ విద్యావిధానం-2020 రాష్ట్రాలతో సంప్రదించకుండానే కేంద్రం ప్రకటించడం, ఏకపక్ష ధోరణికి నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం
భారత సమాఖ్యలో భాగమైన ఆంధ్రప్రదేశ్‌కు, 2014లో రాష్ట్ర విభజన సమయంలో చట్టం ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్ర మోసం చేసింది. మే మొదటి వారంలో రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడలలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్న ప్రధాన మంత్రి ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి ప్రస్తావన చేయలేదు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదా దశాబ్దకాలంగా ఇవ్వలేదు (ఇటీవల ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక సంపాదకులు ప్రధానమంత్రిని ఒకటిన్నర పేజీ ఇంటర్వ్యూ చేశారు. దీనిలో ప్రత్యేక హోదాపై ఒక ప్రశ్న లేకపోవటం ఏమనుకోవాలో?). విభజన హామీలలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కడపలో ఉక్కు కర్మాగారం, విశాఖలో రైల్వేజోన్‌, దుగరాజపట్నంలో భారీ ఓడరేవు, పోలవరం నిర్మాణం-నిర్వాసితులు మొదలైనవేవీ అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌కు దశాబ్ద కాలంలో మోడీ ప్రభుత్వం పూర్తి అన్యాయం చేసింది.
మతతత్వం
రాజ్యాంగ నిర్మాతలు ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించారు. లౌకిక రాజ్యంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు 1994లో ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో లౌకిక విధానం భారత రాజ్యాంగ ముఖ్య లక్షణంగా ప్రకటించింది. మతపరమైన ‘భిన్నత్వం’ గల భారతదేశంలో మత ఐక్యత ద్వారానే పురోగతి ఉంటుంది. గత దశాబ్ద కాలంలో ప్రజల మధ్య మతపరమైన చీలికలు తేవటానికి ముఖ్యంగా హిందూ-ముస్లిం బేధాలు తీసుకు రావటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత పది రోజులుగా ప్రధాన మంత్రి అనేక బహిరంగ సభలలో చేసిన విద్వేషపూరిత ప్రసంగాలే దీనికి పెద్ద ఉదాహరణ. ఎన్నికల నోటిఫికేషన్‌ రావటానికి ముందు మార్చి 11న ‘పౌరసత్వ సవరణ చట్టం’ అమలు చేయటానికి నోటిఫికేషన్‌ జారీ చేయటం మతతత్వాన్ని రెచ్చగొట్టటానికే. గో రక్షక దళాల పేరుతో దాడులు, ముస్లిం అభ్యర్థులను నిలబెట్టకపోవటం, ముస్లింలకు కొన్ని రాష్ట్రాలలోగల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించటం, ముస్లిం జనాభా గురించి చేసే ప్రకటనలు, హిజాబ్‌ వివాదాన్ని రెచ్చగొట్టటం మొదలగు విషయాలన్నీ మతతత్వాన్ని రెచ్చగొట్టటంలో భాగమే. లౌకిక రాజ్యంగా ఉండజాలని రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యంగా ఉండదని చరిత్ర చెబుతున్న సత్యం.
ప్రజాస్వామ్యానికి సవాళ్లు
రాజ్యాంగ మౌలిక లక్షణమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సవాళ్లు ఏర్పడ్డాయి. భారతదేశ భిన్నత్వం దృష్ట్యా ‘బహు పార్టీ విధానం’ ఏర్పడింది. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు పొందిన పార్టీలు పని చేస్తూ ఉంటాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను, పార్టీలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బిజెపి రూ. వేల కోట్లు పొంది దేశంలో ధనిక పార్టీగా మారింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సిబిఐ, ఇన్‌కంటాక్స్‌, ఎన్‌ఐఎ మొదలగు వాటి ద్వారా దాడులు చేయిస్తూ ఇతర పార్టీల నాయకులను తమ దారిలోకి తెచ్చుకోవటం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎన్నికల సమయంలో జైలులో ఉండటం బిజెపి పగ సాధింపు ధోరణులకు పరాకాష్టగా చెప్పవచ్చు. అనేక రాష్ట్రాలలో పార్టీలను చీల్చివేసి, ఒక వర్గంతో జతకట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నది. మణిపూర్‌ వంటి రాష్ట్రంలో సంవత్సర కాలం నుండి మెయితీ-కుకీల మధ్య ఘర్షణ జరగటానికి ప్రధాన కారణం కేంద్రమే. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవలసిన బాధ్యత అన్ని శక్తులపై ఉన్నది.
18వ సాధారణ ఎన్నికలు-బాధ్యత
పై పరిస్థితులు ఉన్న నేపథ్యంలో 18వ సాధారణ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సారి 400 స్థానాలు గెలుపొందాలని, రాజ్యాంగాన్ని మార్చాలని, 2029 నాటికి జమిలి ఎన్నికలు ప్రవేశపెట్టాలని, లౌకికవాదం తొలగించాలని ఉవ్విళ్లూరుతున్నది. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదముందని సామాజికవేత్తలు భావిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తిగా భంగం కలిగే ప్రమాదం ఉన్నది. దీనికి భిన్నంగా ‘ఇండియా’ వేదికకు చెందిన పార్టీలు స్పష్టమైన ఎజెండాతో, విధానాలతో పోటీ చేస్తున్నాయి. దేశంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను, లౌకికవాదాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవటానికి, ‘ఇండియా’ వేదిక పార్టీలను గెలిపించుకోవటానికి సాధారణ ప్రజలతో పాటు, మేధావులు, ప్రజా సంఘాలు, దళిత-బహుజన సంఘాలు, మైనారిటీల సంఘాలు, మహిళా సంఘాలు, పౌరసమాజం పెద్ద ఎత్తున స్పందించి కృషి చేయవలసి ఉన్నది.

/ వ్యాసకర్త శాసనసభ్యులు, సెల్‌ : 8309965083 /

➡️