ప్లాస్టిక్‌ కాలుష్యం

May 10,2024 05:45 #editpage

వాతావరణానికి, పర్యావరణానికి ప్లాస్టిక్‌ చేస్తున్న హాని ఇంతా అంతా కాదు. మానవాళితో పాటు భూమి మీద సమస్త జీవరాశి భవిష్యత్‌ను ఇది సవాల్‌ చేస్తోంది. అదే సమయంలో మానవాళి నిత్య జీవితంలో అంతగా ముడిపడిపోయింది కూడా! ప్లాస్టిక్‌ లేని జీవితాన్ని ఊహించడం అసాధ్యంగా మారింది. అంతేకాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసించే స్థాయికి ప్లాస్టిక్‌ చేరింది. ప్లాస్టిక్‌ పరిశ్రమల మీద ఆధారపడి పొట్ట పోసుకుంటున్న వారి సంఖ్య ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. పెట్రోలియం ఉప ఉత్పత్తియైన దీని నుండి కార్పొరేట్లు పోగుచేసుకునే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఒట్టావాలో గత వారం ప్లాస్టిక్‌ వినియోగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు విఫలమ వ్వడానికి ఇవన్నీ కారణాలే! 192 దేశాలకు చెందిన ప్రతినిధులు వారం రోజుల పాటు సమావేశమై సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో ప్లాస్టిక్‌ నిషేధం గురించి కాదు కదా, ఉత్పత్తులపై పరిమితంగా ఆంక్షలు విధించే విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. చివరిరోజు సమావేశాన్ని అర్ధరాత్రి వరకు పొడిగించినా ఫలితం శూన్యం. ప్లాస్టిక్‌ మానవాళికి ప్రమాదకరంగా మారిందని, భూ తాపం పెరగడానికి ప్లాస్టిక్‌ కూడా కారణ మవుతోందనే అంశాలపై అత్యధిక దేశాలు ఏకాభిప్రాయానికి రావడమే ఈ సమావేశంలో లభించిన కొంత ఊరట! దీనినే చర్చల్లో స్వల్ప పురోగతిగా ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించడం, దాని వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయడానికి కాల వ్యవధిని నిర్ణయించడం లక్ష్యాలుగా 2022లో ఈ చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ పరంపరలో నాల్గవ విడత చర్చలు ఒట్టావాలో జరిగాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ మేరకు ఒక ఒప్పందానికి ప్రపంచ దేశాలు రావాల్సి ఉంది.
ధనిక దేశాలు, పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు వాతావరణ చర్చల తరహాలోనే ప్లాస్టిక్‌ చర్చల్లోనూ పురోగతికి మోకాలడ్డుతున్నాయి. పూర్తిస్థాయిలో వినియోగాన్ని నిలిపివేసే సంగతి అటుంచితే, ఉత్పత్తులపై స్వల్ప స్థాయిలో పరిమితులు విధించాలన్న ప్రతిపాదనలను సైతం ఆ దేశాలు తిరస్కరించాయి. ఈ తరహా చర్చల్లో చక్రం తిప్పే కార్పొరేట్‌ సంస్థలదీ ఇదే వైఖరి! దీంతో ఎన్ని రోజులు కొనసాగినా చర్చల్లో పురోగతి లేని స్థితి నెలకొంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వాటి నిర్వహణ, పారదర్శకత, ట్రాకింగ్‌, పర్యవేక్షణ, లేబిలింగ్‌, నాన్‌ ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాలు, పాలిమర్లు, వాటి ఉత్పత్తుల వ్యాపారం, ప్రమాదకరం కాని రీతిలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, సముద్ర పర్యావరణంపై ప్లాస్టిక్‌ ప్రభావం తదితర అంశాలను చర్చించడానికి కూడా ధనిక, పెట్రోలియం ఉత్పత్తి దేశాలు ఒట్టావా సదస్సులో సిద్ధపడలేదని సమాచారం. దీంతో నూరుశాతం విఫల సదస్సు అన్న ముద్ర నుండి బయట పడటానికి హడావిడిగా ఇరాక్‌ చేసిన ఒక ప్రతిపాదనను సభ్యదేశాలు ఆమోదించాయి. ఈ ప్రతిపాదన ప్రకారం సమావేశం ఒక నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఆ నిపుణుల కమిటీ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో ఆందోళన కలిగించే రసాయనాలను గుర్తించడంతో పాటు, పునర్‌వినియోగానికి వీలయ్యే ఉత్పత్తుల ప్రమాణాలను నిర్ధారిస్తూ నివేదికను తయారు చేస్తుందని పేర్కొన్నారు. బ్రెజిల్‌ కూడా ఇదే విధమైన కమిటీని ప్రతిపాదించింది. ఈ తరహా కమిటీలు కంటితుడుపు చర్యలు తప్ప మరొకటి కాదు. ఈ సమావేశంలో భారతదేశం ప్రాథమిక ప్లాస్టిక్‌ పాలిమర్లు, వర్జిన్‌ ప్లాస్టిక్‌లపై విధించే నిషేధం, నియంత్రణలను వ్యతిరేకిస్తామని ప్రకటించింది. రసాయనాలకు సంబంధించిన నిబంధనలు శాస్త్రబద్దంగా, పారదర్శకంగా ఉండాలని వాదించింది.
మన దేశంలో 2019 నాటి గణాంకాల ప్రకారం 40 లక్షల మందికి ప్లాస్టిక్‌ పరిశ్రమ ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. 2023 సంవత్సరాంతానికి ఈ సంఖ్య రెట్టింపై ఉంటుందని అంచనా! పరోక్షంగా కోట్లాదిమంది ఆధారపడి ఉన్నారు. వీరందరికి ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. స్థిరమైన, సమర్ధవంతమైన ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తయారు చేయడం, సరైన రీసైక్లింగ్‌ విధానాలను అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటం తక్షణం ప్రభుత్వాలు చేయాల్సిన కర్తవ్యాలు. ఈ పనులు చేస్తూనే ప్లాస్టిక్‌ భూతాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన పరిశోధనలు సాగించాలి.

➡️