పార్లమెంటులో ‘మీ వాణి’ వినిపిస్తా : రాహుల్‌ గాంధీ

Jun 9,2024 15:55 #neet exam, #Parliament, #Rahul Gandhi

న్యూఢిల్లీ :   పార్లమెంటులో   మీ గొంతుకగా నిలుస్తానని,  మీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను  లేవనెత్తుతానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం  నీట్  విద్యార్థులకు హామీ ఇచ్చారు.    మెడికల్‌ ప్రవేశ పరీక్ష ‘నీట్‌’ వివాదంపై  ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోడీపై విరుచుకుపడ్డారు.  నీట్‌ పరీక్షల్లో ‘అక్రమాల’తో 24లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు సర్వనాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

” ప్రధాని మోడీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. నీట్‌ పరీక్షలో అక్రమాలు 24 లక్షల మంది విద్యార్థులను మరియు వారి కుటుంబాలను నాశనం చేశాయి ” అని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించారని, చాలా మంది విద్యార్థులకు సాంకేతికంగా సాధ్యంకాని మార్కులు వచ్చాయని అన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పేపర్‌ లీక్‌ కాలేదని బుకాయిస్తోందని ధ్వజమెత్తారు.

విద్యా మాఫియా, ప్రభుత్వ యంత్రాంగంతో కుమ్మక్కై చేస్తున్న పేపర్‌ లీక్‌ పరిశ్రమను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పటిష్టమైన ప్రణాళికను రూపొందించిందని అన్నారు. చట్టం రూపొందించడం ద్వారా విద్యార్థులకు పేపర్‌ లీక్‌ల నుండి విముక్తి కల్పిస్తామని తమ మెనిఫెస్టోలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు.

➡️