తీవ్ర తుపానుగా ‘రెమాల్‌’

May 27,2024 12:14 #Remal Typhoon Effect

న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా బలపడుతోంది. దీనికి రెమాల్‌ తీవ్ర తుపానుగా వాతావరణ శాఖ అధికారులు నామకరణం చేశారు. తీవ్ర తుఫానుగా బలపడిన ‘రెమాల్‌’ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ఐలాండ్స్‌, బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటలకు 120-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రెమాల్‌ ఆదివారం రాత్రి బంగ్లాదేశాన్ని తీరాన్ని తాకిందని, బెంగాల్‌ తీరాన్ని దాటే ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 నుండి ఒంటిగంట మధ్య తీరాన్ని దాటుతుందని, ఆ తర్వాత రెమాల్‌ తుఫాన్‌ బలహీనపడుతుందని తెలిపారు.

కోల్‌కతా ఎయిర్‌పోర్టు విమాన సర్వీసులు రద్దు ….
పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటలపాటు విమాన సర్వీసులను రద్దు చేశారు. తుఫాన్‌ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో 8 లక్షల మందికి పైగా ప్రజలను అక్కడి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అల్లకల్లోలంగా సముద్రం…
అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలోని సముద్రం మొత్తం అల్లకల్లోలంగా మారింది. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలుల తీవ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా, వెస్ట్‌ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలను ఇప్పటికే వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మత్యకారులు, జాలర్లు వేటకు వెళ్లవద్దని ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసింది. 27వ తేదీ వరకు సముద్రంలో వేట నిషిద్దం అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. దీంతో పాటు కేరళ పరిసర ప్రాంతాలపై కూడా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇది పశ్చిమ దిశ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపుగా గాలులు వీస్తున్నట్లు వివరించారు. ఈ ఉపరితల ఆవర్తనంతో ఎపి లో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అలాగే ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

➡️