కిర్గిజ్‌లో విదేశీ విద్యార్థులపై అల్లరి మూకల దాడి !

May 19,2024 08:26 #allarlu, #Kyrgyzstan, #vijayanagaaram
  •  అప్రమత్తంగా వుండండి
  •  భారతీయ విద్యార్థులకు ఎంబసీ సలహా

బిష్కేక్‌ : కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కేక్‌లో విదేశీ విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ దౌత్య కార్యాలయం శనివారం నాడు ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులెవరూ బయటకు రావద్దని, తలుపులేసుకుని రూముల్లోనే ఉండాలని సూచించింది. ఈ అల్లర్లు కొన్ని అరాచక మూకల పనేనని కిర్గిజిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనతో తెలిపింది. అల్లర్లకు సంబంధించిన ఘటనా క్రమాన్ని అందులో వివరించింది. దీని ప్రకారం ఈ నెల 13న తెల్లవారుజాము 2గంటల సమయంలో బిష్కేక్‌లోని పిజారియా సమీపంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ విద్యార్ధులతో తలపడ్డారు. సిగరెట్లు కావాలని ఆ గ్రూపు అడగడం, ఆ ప్రాంతంలో పొగ తాగరాదంటూ విద్యార్ధులు అనడంతో ఘర్షణ మొదలైంది. వారిలో ఒక వ్యక్తి కావాలనే ఘర్షణను కొనసాగించడానికి ప్రయత్నిస్తుం డడంతో విదేశీ విద్యార్ధులు అక్కడ నుండి పారిపోయారు. దాంతో ఆ గ్రూపు వారిని వెంటాడింది. హాస్టల్‌ భవనంలోకి ప్రవేశించి విదేశీ విద్యార్ధుల వద్ద నుండి డబ్బును, వస్తువులను లాక్కున్నారు. ఈలోగా మరికొంతమంది హాస్టల్‌లోని గదుల తలుపులను కొట్టడం ఆరంభించారు. మహిళలు నివసిస్తున్న గదుల్లోకి వారు చొరబడడంతో కొంతమంది విదేశీవి ద్యార్ధులు అడ్డుకుని ఆ వ్యక్తులతో ఘర్షణ పడ్డారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈలోగా హాస్టల్‌లోని విదేశీ విద్యార్ధులందరూ బయటకు రావడంతో గొడవ పెద్దదైంది. దాంతో నలుగురు దుండగుల్లో ముగ్గురు అక్కడ నుండి పారిపోయారు. మిగిలిన వ్యక్తి గాయపడడంతో విద్యార్ధులే అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి పంపారు. అక్కడ చికిత్స తీసుకుని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. ఇదంతా కూడా సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డ్‌ అయింది. ఈ సంఘటనపై పోలీసులు క్రిమినల్‌ దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తుకు సంబంధించి నలుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఆ దుండగులు ఫోన్లు, డబ్బులు లాక్కున్నారని ముగ్గురు విద్యార్ధులు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిని పోలీసులు గుర్తించారు.
శుక్రవారం ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దాంతో స్థానికంగా అశాంతి పెచ్చరిల్లింది. నగరంలోని యువత అంతా ఒకచోట చేరి ఈ పరిణామాలను తీవ్రంగా నిరసించారు. బాధ్యులైన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితేఈ సంఘటనలో బాధితులకు సంబంధించి కొంత తప్పుడు సమాచారం కూడా వ్యాప్తి చేశారని తెలిపింది. ప్రస్తుతమైతే పరిస్థితులు చక్కబడ్డాయని పేర్కొంది. కిర్గిజ్‌ విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటనను ఇండియన్‌ ఎంబసీ తన ఎక్స్‌లో పోస్టు చేసింది.
అప్రమత్తంగా వుండాల్సిందిగా భారత్‌ అక్కడ నివసిస్తున్న భారతీయులకు, విద్యార్ధులకు పలు సూచనలు జారీ చేసింది. బయటకు వెళ్లకుండా ఇళ్లల్లోనే వుండాల్సిందిగా కోరింది. అల్లరి మూక ఆగడాల వీడియోలు సోషల్‌ మీడియాలో రావడంతో అప్రమత్తమైన ఇండియన్‌ ఎంబసీ శనివారం ఉదయం ఆదేశాలు వెలువరించింది. భారత విద్యార్ధులతో నిత్యం మాట్లాడుతున్నామని తెలిపింది.
దాడికి పాల్పడుతున్నవారు, విదేశీయుల మధ్య చెలరేగిన హింసకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బయటకు వచ్చిన నేపథ్యంలో శనివారం ఉదయం నిరసనలు మొదలయ్యాయి. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ ట్వీట్‌ చేస్తూ, భారత విద్యార్ధుల పరిస్థితులను ఎప్పుటి కప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.
నగరంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కిర్గిజ్‌ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుతం పరిస్థితులు నిలకడగా వున్నాయని, నగరంలోని అన్ని వీధుల్లో ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని పేర్కొంది. ఒక నివేదిక ప్రకారం స్థానికులు, ఈజిప్ట్‌ విద్యార్ధుల మధ్య ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ హింసలో ముగ్గురు పాకిస్తానీ విద్యార్ధులు మరణించినట్లు పాక్‌ అధికారి తెలిపారని పాక్‌ వార్తా వెబ్‌సైట్‌ తెలిపింది. అయితే ఆ వార్తలను పాక్‌ ఎంబసీ కొట్టేసింది. కిర్గిజ్‌ ఎంబసీతో తాము మాట్లాడుతునే వున్నామని పాక్‌ ప్రధాని ట్వీట్‌ చేశారు.

భయాందోళనలో భారతీయ వైద్య విద్యార్థులు
ప్రజాశక్తి- బొబ్బిలి (విజయనగరం జిల్లా) : కిర్గిజిస్తాన్‌లో అల్లరి మూకల దాడులతో ఆ దేశంలో వైద్య విద్యనభ్యసిస్తున్న విజయనగరం జిల్లా రాజాంకు చెందిన 12 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కిర్గిజిస్తాన్‌లో అరబ్‌ దేశానికి చెందిన యువతీ యువకులు ఒకే హాస్టల్‌లో ఉంటున్నారు. అమ్మాయిలను కిర్గిజిస్తాన్‌ యువకులు మూడు రోజుల క్రితం ర్యాగింగ్‌ చేయడంతో యువకులు అడ్డుకున్నారు. దీంతో, అదే రోజు సాయంత్రం యువకులు మూకుమ్మడిగా అరబ్‌ విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో, పక్కనే నివాసముంటున్న మన దేశానికి చెందిన వైద్య విద్యార్థులు భయంతో రూముల్లోనే ఉంటున్నారు. తమను తీసుకెళ్లిన కాంట్రాక్టర్‌, ఇండియన్‌ ఎంబసీ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. తమకు కిర్గిస్తాన్‌ కార్మికులు రక్షణగా ఉన్నారని వారు సోషల్‌ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు.

➡️