వృక్షో రక్షతి రక్షిత:

May 19,2024 06:05 #Articles, #edit page, #trees

మానవ మనుగడకు, సర్వజీవుల సుఖజీవనానికి వృక్ష సంపదను రక్షించాలని శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు. వృక్షాలను దేవతలుగా పూజించి, ఆదరించే దేశంలో వృక్ష సంపద రోజురోజుకూ తరిగిపోతోంది. ‘క్షీరసాగర మథనం’లో ‘కల్పవృక్షం’ ఆవిర్భావం, ‘రామాయణం’లో అడుగడుగునా చెట్ల వర్ణనలు, ప్రత్యేకతలను పురాణాల్లోనూ చెప్తారు. పర్ణశాల నిర్మాణవేళ లక్ష్మణునితో ‘వృక్ష సంపద ఆవశ్యకతను’ శ్రీరాముడు వివరించినట్లుగా రాస్తారు. ‘కుమార సంభవం’లో చెట్ల రక్షణ కోసం పార్వతీదేవి పెద్దపులినే కాపలాగా కట్టి వేసిందని రాస్తాడు కాళిదాసు. ‘భాగవతం’లోనూ వనాల వర్ణన మనసులను పరవశింపజేస్తుంది. నీడ, పూలు, ఫలరసాలు మాత్రమేకాక ప్రాణవాయువునూ నిరంతరం విడుదల చేస్తున్న చెట్లు జీవకోటికి గొప్ప మేలు చేస్తున్నాయి. వేలాది సంవత్సరాలు జీవిస్తూ, ఎంతోదూరం, నిరంతరం ఆక్సిజన్‌ను అందించే శక్తి ఈ మహావృక్షాలకు ఉంది. ‘అవ్వకైనగాని గువ్వకైనను కాని/ తల్లి ఒడిగ చెట్టు తావునొసగు/ చెట్టు గుణములేదె? చెట్టంత మనిషికి’ అంటాడో కవి. ప్రకృతి ఒడిలో పచ్చల హారం అని కొనియాడబడే ఈ మహా వృక్షాలు… మనిషి ఆశకు తమ ప్రాణాలను బలిపెడుతూ ఎండిన మోళ్ళవుతున్నాయి.
పూలకొమ్మలతో, లేరెమ్మలతో, కొమ్మల్లోని గిజిగాడి గూళ్ళతో, నిలువ నీడలేని నిర్భాగ్యుల చిన్నారుల ఊయలలూపుతూ- మనిషి పోయినా, తరం మారినా నిరంతరంగా నిలబడేవి చెట్లు. ‘పచ్చ చెట్టును గూల్చ మనసెట్టులొప్పెనో/ కరకు గుండెల కర్కశ మూకలు/ దుడుకు గుండెల ముష్కర మూకలు/ చెలగి చెండాడి తునిమి ముక్కలు చేసి/ పదును రంపాల పరపరా కోసి/ కూల్చినారే నిన్ను కర్తవ్యమూఢులై’ అంటూ చెట్టు వేదనను వర్ణిస్తారో కవయిత్రి. ఇప్పుడు గూడు లేదు… ఆ చెట్టూ లేదు. చెట్టు మనిషి అత్యాశకు బలైందని తెలియని వెర్రి పిచ్చుక రోజూ వచ్చి వెతుక్కుని నిరాశతో వెనక్కి తిరిగిపోతున్న దృశ్యం నిత్యం కనిపిస్తూనేవుంది. మనిషి ప్రకృతి వనరులను అడ్డూఅదుపూ లేకుండా కొల్లగొడుతున్నాడు. మనిషి దురాశ పర్యావరణ కాలుష్యానికి కారణమౌతోంది. ఈ కాలుష్యం వల్ల భూమి వేడెక్కుతోంది. భూసారం క్షయమవడం, అడవులు క్షీణించడం, వందలాదిగా జంతు, వృక్ష జాతులు నశించిపోవడంతో పర్యావరణం హానికరంగా మారుతోంది. కార్పొరేట్ల లాభార్జన కోసం అభివృద్ధి పేరుతో సాగిస్తున్న జీవనయానం మనిషిని పతనపుటంచులలో నిలబెట్టింది. ‘మానవుడు ముందుచూపు కోల్పోయాడు. భూమిని నాశనం చేస్తున్నాడు’ అంటాడు ఆల్బర్ట్‌ స్క్విట్జర్‌. తాజాగా 2018 నుంచి 2022 వరకు- ఈ మూడేళ్లలో దాదాపు 60లక్షల చెట్లు వ్యవసాయ భూముల నుంచి అదృశ్యమయ్యాయని శాటిలైట్‌ మ్యాపింగ్‌ అధ్యయనం తెలిపింది. దేశంలో సుమారుగా 56శాతం వ్యవసాయ భూములు, 22శాతం అడవులు వున్నాయి. 2010 నుంచి 2022 వరకు చెట్ల సంఖ్యలోని మార్పులను అంచనా వేయడానికి పరిశోధకులు రాపిడ్‌ఐ, ప్లానెట్‌ స్కోప్‌ రెండు రిపోజిటరీల నుండి ఉపగ్రహ చిత్రాలను కలిపి చూశారు. అనేక హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోని వ్యవసాయ భూమి చెట్లలో 50శాతం వరకు కోల్పోయినట్లు గుర్తించారు. చదరపు కిలోమీటరుకి 22 చెట్లు అదృశ్యమయ్యాయి. ‘బ్రతికినన్ని నాళ్లు ఫలములిచ్చుటెగాదు/ చచ్చి కూడ చీల్చి ఇచ్చు తనువు/ త్యాగభావమునకు తరువులే గురువులు’ అంటారు జంధ్యాల పాపయ్యశాస్త్రి.
చెట్టు, పుట్ట, నది, మబ్బు, వర్షం, ఆకాశం ఇలా… ప్రపంచమంతా ప్రకృతి పలవరింతే. మానవాళికి ఎంతో మేలు చేస్తున్న ప్రకృతిపై పగబట్టినట్లు చెరబడుతున్నాడు మనిషి. చెట్లను ధ్వంసం చేస్తున్నాడు. నదులను కలుషితం చేస్తున్నాడు. ‘నేడు ప్రపంచ సమస్య టెర్రరిజం కాదు… కాలుష్యం’ అంటారు దాశరథి రంగాచార్య. వందేళ్ల క్రితం భారత భూభాగంలో 40శాతంగా వున్న అడవులు- క్రమేణా అంతరించి పోతున్నాయన్నది వాస్తవం. అభివృద్ధి పేరుతో అడవులు కనుమరుగవు తున్నాయన్నది చేదు నిజం. ప్రాణాధారమైన చెట్లను సంరక్షిస్తూ, నరికివేతకు గురవుతున్న వృక్షాలను కాపాడుకోవాలి. కలుషితమైపోతున్న ప్రాణవాయువును స్వచ్ఛమైనదిగా మార్చుకోవాలంటే ఇంటింటా చెట్లను నాటాలి. అడవులను సంరక్షించాలి. వృక్షం గమయ అంటూ నినదించాలి.

➡️