వేసవి వేళ .. థియేటర్లు డీలా …

May 20,2024 04:38 #movies, #Theaters

వేసవి అంటేనే జన సందోహాల కోలాహలం. పిల్లలకు సెలవులు కాబట్టి- వినోదాలూ విహారాలకు అనువైన కాలం. అందుచేతనే సినిమాలు పోటాపోటీగా విడుదలై థియేటర్లు నిండుగా నడుస్తాయి. స్టార్‌ హీరోల చిత్రాలు, చిన్న బడ్జెట్‌ సినిమాలు, అనువాద చిత్రాలూ … ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. విద్యాసంస్థలు తెరిచే వరకూ థియేటర్ల దగ్గర సందడే సందడి. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులూ నమోదవుతుంటాయి. ఇదంతా ఒకప్పటి వైభవం. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.

ఈసారి ప్రముఖ హిరోల సినిమాలు లేక పాత సినిమాల రీ రిలీజ్‌లు కొనసాగాయి. రిలీజైన చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతగా లభించటం లేదు. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు ఐపిఎల్‌ టోర్నమెంట్‌ ఉండడంతో ఎక్కువమంది వాటిలో లీనమయ్యారు. ఈ రెండింటి కారణంగా ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావటం లేదు. ఈ పరిస్థితిని గమనించిన సినిమా నిర్మాతలు, దర్శకులు కొత్త సినిమాల విడుదల తేదీలను మే నుంచి జూన్‌కు మార్చుకున్నారు. పెద్ద హీరోల సినిమాల సంగతి అలా వుంచితే కనీసం చిన్న హీరోలవి కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రావటం లేదు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని భావించిన సింగిల్‌ థియేటర్ల యజమానులు ఈనెల 17 నుంచి నెలాఖరువరకూ మూసివేస్తున్నామని ఏకంగా ప్రకటించి అమలు చేస్తున్నారు.
ఆంధ్రాలో 800, తెలంగాణాలో 450కుపైగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు ఉన్నాయి. తెలంగాణాలో పూర్తిగా మూసివేస్తున్నట్లుగా అక్కడి యాజమాన్యాలు ప్రకటించగా, ఆంధ్రాలోనూ అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. అయితే ఈనెల 26తో ఐపీఎల్‌ ముగుస్తోంది. మరో వైపు ఎన్నికల హడావుడి కూడా పూర్తయ్యింది. జూన్‌ 4న ఫలితాల రోజు తప్ప సినిమాలకు అడ్డేమీ ఉండదు.

అంతంతే ఆదరణ
‘ఓం భీమ్‌ బుష్‌’, ‘టిల్లు స్క్వేర్‌’, ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘కృష్ణమ్మ’.. ఇప్పటివరకూ ఈ వేసవిలో విడుదలైన చెప్పుకోదగ్గ సినిమాలు ఇవే! యువ కథానాయకుల చిత్రాలు, పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలకి బాగుందనే టాక్‌ వచ్చాకే ప్రేక్షకులు థియేటర్లకి వస్తారు. అగ్ర హీరోల సినిమాలకి తొలి ఆట నుంచే హాళ్లు నిండిపోతాయి. ఇక సినిమా హిట్‌ అంటే… కొన్ని నెలలపాటు థియేటర్లు కళకళలాడతాయి. ఈ వేసవి మొదట చాలా అంచనాల్నే పెంచినా… ఆ తర్వాత నీరుగార్చింది. వస్తాయనుకున్న సినిమాలేవీ విడుదల కాలేదు. ఈనెల 31న రావాల్సిన మ్యూజిక్‌ షాపు మూర్తి సినిమా కూడా వాయిదా పడినట్లే. ఈనెల 9న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఎ.డి’ వస్తుందనుకుంటే ఆ సినిమా జూన్‌ 27కి వాయిదా పడింది. పుష్ప-2 ఆగస్టు 15, దేవర అక్టోబర్‌ 10న విడుదల కానున్నాయి.

25 నుంచి కొత్త సినిమాల సందడి?
ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘లవ్‌ మీ..ఇఫ్‌ యు డేర్‌’ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 31న విడుదల ఖరారు చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, సుధీర్‌బాబు ‘హరోం హర’, కాజల్‌ ‘సత్యభామ’, కార్తికేయ కథానాయకుడిగా నటించిన ‘భజే వాయు వేగం’, ఆనంద్‌ దేవరకొండ ‘గం గం గణేశా’ చిత్రాలు అదే రోజే ప్రేక్షకుల ముందుకు వస్తాయని చెబుతున్నారు.

మూస్తే రూ.4వేలు, తెరిస్తే రూ.6 వేలు నష్టం
కొత్త సినిమాలు లేకపోవటంతో ఒకరిద్దరు ప్రేక్షకులు వచ్చినా షో నడపాల్సి వస్తుంది. కరెంట్‌ ఛార్జీలు, నిర్వహణా ఖర్చులు తడిచిమోపెడవుతున్నాయని తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజేందర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ‘థియేటర్‌లో ప్రదర్శనలు రద్దు చేస్తే మాకు రోజుకు రూ.4 వేలు, కొనసాగిస్తే రూ.6 వేలు నష్టం వస్తుంది. ప్రదర్శనలు వేస్తేనే ఎక్కువ నష్టం వస్తుండడంతోనే కొన్నాళ్లపాటు బంద్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమాలు లేక, మాకు గిట్టుబాటు కాకపోవడంతోనే ఈ నిర్ణయం ఎవరికి వాళ్లు వ్యక్తిగతంగా తీసుకున్నాం. అసోసియేషన్‌ పరంగా తీసుకున్న నిర్ణయం కాదు. కొత్త సినిమాలు వస్తే మళ్లీ తెరుస్తాం.’ అని చెప్పారు.
జిల్లా కేంద్రాల్లో ఒకొక్క థియేటర్‌ నిర్వహణకి రోజుకు రూ.10 నుంచి రూ. 12 వేలు, అదే కార్పొరేషన్‌లో రూ.15 నుంచి రూ.18 వేలు ఖర్చు అవుతున్నాయి. వసూళ్లు వచ్చేసరికి రూ.ఐదారు వేలు కూడా రావడం లేదు.
సింగిల్‌ స్క్రీన్‌లే కాదు, మల్టీప్లెక్స్‌ల్లోనూ ప్రదర్శనలు తగ్గిపోయాయి. తెలంగాణలో దాదాపు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఎవరైనా నిర్మాత వచ్చి తాము ఖర్చులు భరిస్తామని అడిగితే… ప్రదర్శనలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని థియేటర్ల యజమానులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి 450 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మూతబడ్డాయని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎపి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా ఆవేదన వ్యక్తంచేశారు.

పరిశ్రమపై తీవ్ర ప్రభావం
ఓటీటీ మార్కెట్‌ కొత్త సినిమాల విడుదలలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా తర్వాత థియేటర్‌ కంటే, ఓటీటీ మార్కెట్టే బలంగా కనిపించింది. పోటీపడి మరీ భారీ రేట్లకి సినిమాల్ని కొనుగోలు చేశాయి ఓటీటీ వేదికలు. దాంతో ఆ మార్కెట్‌ని నమ్ముకునే సినిమాల్ని మొదలు పెట్టిన నిర్మాతలు చాలామందే. కానీ ఏడాదిలోపు పరిస్థితులు తారుమారయ్యాయి. ఓటీటీ సంస్థలు ఇప్పుడు ఆచితూచి సినిమాల్ని కొంటున్నాయి. థియేటర్స్‌లో సినిమా విడుదలైతే నిర్మాతల దగ్గర నుండి బుకింగ్‌ క్లర్క్స్‌, పోస్టర్స్‌ వేసే బార్సు, థియేటర్‌ రెప్రజెంటేటివ్‌, కూల్‌ డ్రింక్స్‌, సమోసాలు అమ్మే వర్కర్స్‌ వరకు ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. మూతపడటంతో వీరంతా ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

➡️