మణిపూర్‌ విషాదంపై అధ్యయనం

Jun 10,2024 05:42 #book review, #Manipur, #sahityam

మణిపూర్‌ సంఘటనలు .. మన కాలం చూసిన మహా విషాదం! అక్కడి ప్రజలు ఉన్న చోటనే కాందిశీకులయ్యారు. శిబిరాల్లో శరణార్ధులుగా మారారు. ప్రజాస్వామిక దేశంలో ఇటువంటి దృష్టాంతాలు చోటుచేసుకోవడం దారుణం. పరిస్థితులు విషమించినా పాలకులు పట్టింపులేని వ్యవహారంగా చోద్యం చూశారు, చూస్తున్నారు. ఆ నిర్లక్ష్యం ఫలితంగానే అరాచక శక్తులు ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించగలిగాయి. అయినా సరే, మన దేశ ప్రధాని స్పందించలేదు. భరోసా అందించలేదు. పైగా అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం నిజాలకు పాతరేసే పనికి పూనుకొంది.
అందుకనే, అసలు అక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక మహిళా బృందం నడుం కట్టింది. ఆరు రోజుల పాటు ఆ ప్రాంతాల్లో పర్యటించింది. శిథిల గోడల మాటున బిక్కుబిక్కుమంటున్న గ్రామాలను చూసింది. రెక్కల తెగిన పక్షుల్లా ఆ శిబిరాల్లో దీనంగా బతుకులను వెల్లదీస్తున్న బాధితులను పలకరించింది. వారి గాధలను ”అంతర్యుద్ధంలో మణిపూర్‌” ఒక క్షేత్ర స్థాయి పరిశీలన పేరిట ఓ పుస్తకంగా వెలువరించింది. అంతర్గతంగా ఉన్న ఆర్ధిక ప్రయోజనాలు, బహిరంగంగా సాగుతున్న రాజకీయ ప్రయోజనాలు వంటి వాటి మధ్య మణిపూర్‌ మండుతుందన్న ఓ వాస్తవ చిత్రానికి అద్దం పట్టింది. సామరస్యతను సాధించడంలో గానీ, రక్షణ కల్పించడంలో గానీ ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లిప్తత కొనసాగుతుందని, అందుకు అధికార పార్టీయే కారణమని పేర్కొంది.
మణిపూర్‌కి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 33లో ఉనికిలోకి వచ్చింది. క్రీస్తు శకం 11వ శతాబ్ధంలోనే రాజు లోయింబ సారధ్యంలోకి వచ్చింది. లిఖిత రాజ్యంగం ప్రకటితమైంది. 1891 వరకూ అది అమలై, కాంగ్‌ లెయి పాక్‌ పేరుతో ఈ రాజ్యం నడిచేది. ఇటు భారత్‌ నుంచి అటు బర్మా నుంచి దాడులను ఎదుర్కొంది. 1847 వరకూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. 1724లో ఆ రాజ్యం పేరు మణిపూర్‌గా మార్చబడింది. బర్మా నుంచి తనని తాను కాపాడుకునేందుకు చాలా మూల్యమే చెల్లించింది. 1891లో బ్రిటీష్‌ సైన్యంతో పోరాడి, ఓటమి చెందింది. అలా ఆ రాజ్యం బ్రిటీష్‌ పరిధిలోకి చేరింది. మణిపూర్‌ యువరాజు చుర్‌ చాందాని రాజుగా ప్రకటించింది. అలా బ్రిటీష్‌ ఇండియా చిత్రపటంలోకి మణిపూర్‌ చేర్చబడింది. తొలి నుంచి స్వతంత్రంగా బతకాలన్నది ‘మణిపూర్‌’కి బలమైన కోరిక. భారత్‌ నుంచి బ్రిటీష్‌ వాళ్లు వెళ్లిన తరువాత తమ రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకే ప్రయత్నిస్తూనే ఉండేది. స్వంత రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. ఆ సమయంలో భారత్‌ ప్రభుత్వంలో సంస్థానాలను విలీనం చేయాలని ఓ నిర్ణయం జరిగింది. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. మణిపూర్‌ రాజు బుధ చంద్ర సింగ్‌తో 1949 సెప్టెంబర్‌ 21న ‘భద్రత’ పేరిట విలీన ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంతో మణిపూర్‌… భారత్‌లో భాగం అయ్యింది.
మణిపూర్‌ విభిన్న సాంస్క ృతిక మూలాలున్న తెగలు సంగమం. రాష్ట్ర భూభాగంలో 90 శాతం కొండలతో నిండి ఉంటుంది. అక్కడ 40 శాతం మంది ప్రజలు జీవిస్తున్నారు. వారిలో అత్యధికంగా నాగాలు, కుకీలు ఉన్నారు. మిగిలిన 10 శాతం ప్రాంతం లోయ. అక్కడ బతుకున్న వాళ్లల్లో అత్యధికులు మొయితేలు. అయితే, నాగాలు, కుకీలను తెగల సముదాయాల కింద గుర్తిస్తారు. బ్రిటీష్‌ కాలంలో క్రైస్తవ మిషనరీల వల్ల వాళ్లకు విద్య అందుబాటులోకి వచ్చింది. ఆ తరువాత కాలంలో మతమార్పిడి విస్తృతంగా సాగింది. మతం మారినా వారి సంప్రదాయాలను మాత్రం వదలలేదు. లోయ ప్రాంతంలో మొయితేలు అధికారిక కేంద్రమైన ఇంఫాల్‌కి చుట్టూ అల్లుకుని ఉంటారు. వీరు వలస వచ్చిన వారుగా స్థానిక చరిత్ర రికార్డు చేసింది. దూకుడు స్వభావం కలిగిన నాగాలను కట్టడి చేసేందుకు కుకీలను బ్రిటీస్‌ వాళ్లే తీసుకుని వచ్చారనీ, నల్లమందు పండించేందుకు అవసరమైన కూలీలుగా వీళ్లను తరలించారనీ చెబుతారు. కుకీలు ఒక్క మణిపూర్‌లోనే కాకుండా అస్సాం, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్‌, మేఘాలయ, బర్మా, బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో కూడా అత్యధికంగా కనిపిస్తారు.
ఈ తెగల జీవన చిత్రాన్ని చూసినప్పుడు వైవిధ్యం, వైరుధ్యం చాలా కనిపిస్తుంది. కుకీ, నాగాల్లో అత్యధికులకు పోడు వ్యవసాయమే దన్ను. మిషనరీల సహకారంతో వాళ్ల పిల్లలు విద్యారంగంలోకి అడుగుపెట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లి మరీ ఉన్నత చదువును అభ్యసిస్తున్నారు. కొంత అభివృద్ధినీ సాధించారు. వారి నివాసాలు పర్యాటక ప్రియులను ముగ్ధులను చేస్తాయి. మొయితేలకి కుటీర పరిశ్రమే ముఖ్య జీవనాధారం. వ్యాపార కూడలిని అంటిపెట్టుకుని బతుకుతూ ఉంటారు. రాజధానికి ఆనుకుని ఉండడం వలన వారిళ్లు అత్యంత ఇరుకుగా ఉంటాయి. ఆర్థికంగా ఒత్తిడిలోనూ ఉంటాయి.
మొయితీలు తమ ఇళ్లల్లో తయారు చేసే ఉత్పత్తులను ఇటు ఇంఫాల్‌ మార్కెట్లోనూ, అటు పొరుగు ప్రాంతాల్లోనూ అమ్ముకుంటారు. బయట ప్రాంతాలకు తమ సరుకులు చేర్చడం ద్వారా వారికి అధికాదాయం వస్తుంది. ఆ క్రమంలో కుకీలూ, నాగాలూ జీవించే ప్రాంతాల మీదుగానే వీళ్లు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అలా వెళ్లిన ప్రతిసారీ రోడ్డు టాక్సు చెల్లించాల్సి వచ్చేది. ఒకనాడు అదేమీ భారం కాలేదు. కాని, క్రమేణా పారిశ్రామిక ఉత్పత్తులు ముంచెత్తడంతో వారి ఉత్పత్తులకు గిరాకీ తగ్గుతూ వచ్చింది. టాక్సు కట్టడం వారికి భారంగా పరిణమించింది. తగ్గుతున్న వ్యాపారాల వలన మొయితీలు కూడా నల్లమందు సాగు వైపు ఆకర్షితులయ్యారు. కొందరు ఆ సాగులోకి దిగారు. మిగిలిన వాళ్లు వెళ్లేందుకు భూమి అందుబాటులో లేదు. ఆ భూమి కోసం ఎగువకి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. ఇది ఘర్షణలకు బీజం వేసింది. ఈ నేపథ్యంలో ఎస్టీ రిజర్వేషన్ల కోసం మొయితీలు ఆందోళన ప్రారంభించారు. అది వాదవివాదాలకు తెరదీసింది. ఆ సమయంలోనే కుకీల చేతిలో ఉన్న భూమిని రిజర్వు ఫారెస్టుగా ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల క్రితం వారికి ఇచ్చిన పట్టాలన్నింటినీ రద్దు చేసింది. ఈ పరిణామం నెమ్మదినెమ్మదిగా కుకీలూ, మొయితీల మధ్య వివాదంగా రూపాంతరం చెందింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వల్ల పది జిల్లాల్లో అగ్గి రాజుకుంది. అదింకా మండుతూనే ఉంది. ఈ విద్వేష వాతావరణంలో చిన్న రైతుల ఘోష, చేతి వృత్తిదారుల విలాపం ఎవరికీ వినిపించకుండా పోయింది.
వాస్తవానికి, ఈ ప్రాంత రాజకీయం బతికేది నల్లమందు మీదనే అని ఈ బృందం చేసిన ఇంటర్వ్యూలు ప్రస్ఫుటపరుస్తాయి. మాదక ద్రవ్యాల కేసులో ఒక రాజకీయ నాయకుడిని అరెస్టు చేసినందుకు ఎన్‌ఎబిలో ఎఎస్‌పిగా పనిచేసిన బృందా తవునొజమ ఉద్యోగాన్ని వీడాల్సి వచ్చింది. అక్కడ మిలిటెంట్‌ గ్రూపులకు కొదవలేదు. కొందరు స్వతంత్రత కోసం, మరికొందరు కేంద్ర పాలిత ప్రాంతం కోసం, ఇంకొందరు ప్రత్యేక ప్రాంతాలుగా ప్రకటించాలని పనిచేస్తున్నారు. రోడ్డు టాక్సుల మీద, నల్లమందు వ్యాపారం మీదనా, సాధారణ వ్యాపారాల మీదనా ఆ సంస్థలు ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. తెగలుగా చీలిన ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో ముఖ్యంగా కుకీలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోయారు. అధికారిక పార్టీ వారి పట్ల పరాయి భావనతో ఉంది. దక్షిణ భారత క్రైస్తవ సమాజం వారికి ఆసరా నిలిచింది. ఇంఫాల్‌ నుంచి అందుతున్న ఆర్ధిక సాయంతో మొయితీలు కాలం వెల్లదీస్తున్నారు. శరణార్ధి శిబిరాల్లోనూ తమ చేతి వత్తులను కొనసాగిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల్లో కార్పొరేట్లకు సహజ వనరులను కట్టబెట్టాలన్న కుట్ర కూడా ఉందని ఒక సీనియర్‌ నాయకుడు చెప్పాడు.
ప్రభుత్వాలు సరైన జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. నిర్ధిష్ట పరిస్థితుల మీద నిర్ధిష్ట అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిన వారు సైతం అస్తిత్వ భావనకు గురవుతున్న ధోరణి ఆ సమూహాల్లో చూశామని పరిశీలకులు రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్నొక మత ప్రాతిపదిక ఘర్షణగా చూస్తున్నంత కాలమూ దీనికి పరిష్కారం దొరకదు. మనుషులను మనషులుగా చూసి, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పే బాధ్యతను పాలకులు తీసుకోవాలి. ఇంత ఆధునిక కాలంలో ఈ అమానుష కాండ సాగటం సిగ్గుచేటని, అమానవీయమని గుర్తించాలి. మణిపూర్‌ చరిత్రను, నేపథ్యాన్ని, వర్తమానాన్ని కళ్లకు కట్టే ఈ రచన అందరూ చదవదగినది.

– వి.ఎం.కె.లక్ష్మణరావు
94417 49192

➡️