మట్టి పువ్వు

Jan 19,2024 09:00 #sahityam

చీకటిని మోసీ మోసీ

ఇక చీకటి అంతు తేల్చేందుకు

నిదురపోయే జాతిని జాగృత పరిచేందుకు

నిదురలేని రాత్రిగా మెలకువతో తానే ఒక వేకువగా

ఒక మహా సంక్షోభంలోంచి

మహా బోధిగా ప్రభవించినవాడు.

కలలకు మహత్తరమైన శక్తినివ్వడానికి

రక్తాన్ని, కన్నీళ్ళని, అవమానాల్ని కలం లోకి వొంపి

అక్షరాన్ని ఆయుధంగా చెక్కిన రాజ్యాంగమతడు.

కోటి కన్నుల కలగా ఆలోచన ఆచరణకు ఆరంభమన్నవాడు.

కలల సాకారతకు కర్తవ్యమై కదలాడే మట్టిపూల రాగం వాడు.

కుల వ్యవస్థకు మించిన దుర్మార్గమైన సామ్రాజ్యవాదం

మరొకటి లేదని స్పష్టపరిచినవాడు.

ఆత్మగౌరవం నా జాతి కిరీటమని

గుడిసెలో దీపమై గొంతెత్తిన వాడు.

నిప్పు కణికల కొలిమి.

జ్ఞానఖడ్గమే అతని బలిమి.

జాతి కన్నీరు తుడవడానికి

అమ్మ చేతులుగా మారిన వాడు.

తన బతుకును చెప్పులుగా చేసి

ఆ చెప్పుల చేతులతో యావత్‌ ప్రపంచాన్ని మనిషిగా మోసిన వాడు.

బుద్ధ దమ్మాన్ని నిజం చేసే

మనుషుల కోసం తాను నవయానమై మనలో సజీవమై

తొంగి చూస్తున్న వాడు.

ఆచరణ లేని ఆరాధనలెందుకని

నన్ను మీలో ఒకడిగా మననీయుడని

ప్రతి ఒక్కడు మనిషి అవ్వమని

నూతన భవితను నిర్మించినవాడు.

కుల సౌధాన్ని కూలగొట్టేందుకు

ఎత్తిన పలుగు అతడు.

మను ధర్మానికి చితిపెట్టిన

తొలి వెలుగు అతడు.

రాజకీయ నియంతల కుట్రదారుల కలలో సైతం

కలవరపెట్టిన కాలం వీరుడు

కరుడుగట్టిన కులహంకారుల వెన్నులో

వణుకు పుట్టించిన విప్లవ యోధుడు.

జ్ఞానఖడ్గం చేతబట్టి మా స్వేచ్ఛ పేరు భూమ్యాకాశాలని

ఎలుగెత్తి నినదించి నిలువెత్తు జాతి నినాదంగా

ఊరు మొగదల చూపెత్తి

నిలబడ్డ మట్టిపువ్వు అతడు.

నిశ్శబ్దంలోంచి మహావిస్ఫోటనంలా

చీకటి ఘనీభవించిన చోట

మహోదయంలా నీవు.

అడ్డుగోడలను కూలగొట్టిన

సాంఘిక సమానత్వమా!

స్త్రీల హక్కుల విప్లవ పిడికిలి.

కార్మిక హక్కుల వినూత్న కొడవలి.

హిందూ బ్రాహ్మణీయ శక్తుల గుండెల్లో అగ్గిరవ్వా!

దళిత బతుకుల్లో పరిమళించే మట్టి పువ్వా!!

స్త్రీల పెదవులపై నవ్వే స్వేచ్ఛా!

ఆత్మగౌరవాల చైతన్యమా!

ప్రజాస్వామిక విప్లవాల యుగ కర్తా!

వేగుచుక్కా! మహోదయాన్ని

నా కాలికి చెప్పుగా తొడిగినవాడా!

అజ్ఞానం నుండి జ్ఞానంలోకి

భయం నుండి సాహసంలోకి

బానిసత్వంలోంచి స్వేచ్ఛ లోకి

వేలు పట్టి నడిపించిన అమ్మ తల్లీ!

మూతిన ముంత, ముడ్డిన తాటాకుగా వేలాడిన

మనువుగాడి ధర్మాన్ని మంటల్లో తగలేసిన

మా చందమామ పువ్వా!

జ్ఞానం నీ అసలు పేరు.

పోరాటం నీ ఇంటి పేరు.

మనిషి తనం నీ ఊరు.

మానవత్వం నీ హోరు.

ఆకాశం నుదుటన సృజనగా

అంటరాని విప్లవం పేరు

డా.బి.ఆర్‌.అంబేద్కర్‌.

– శిఖా-ఆకాష్‌, సెల్‌ : 9381522247

➡️