‘శుభ’ ఆకాంక్షలు

Jan 1,2024 10:27 #sahityam

ఈ నూతన వత్సరానికి

అక్షరాలను పేర్చితేనో

లక్షణాలను కూర్చితేనో

చేతికి బంధనాలు దాల్చితేనో

కొత్తదనం వస్తుందనీ

కొత్త వెలుగు ఉదయిస్తుందనీ

నేనమ్మను కాక నమ్మను

 

కొత్త సీసాలో పాత సారాను

పోసేసుకునీ

సంబరాలను అంబరంగా

జరిపేసుకునీ

క్యాలెండర్లో తారీఖును

చింపేసుకునీ

మొఖానికి నవ్వుల్ని

పూసేసుకునీ

అదే నూతనత్వం అంటే

నేనమ్మను కాక నమ్మను

 

జారిపోతున్న కాలాన్నీ

కూలిపోతున్న దూలాన్నీ

వెతుకుతున్న కళ్లనూ..

ఆలోచిస్తున్న మెదళ్లనూ..

ఎవరాపగలరు చెప్పండి..!

 

కాలం మిగిల్చిన గాయాల్ని

వేలం గెల్చిన మానాల్ని

కరోనాలు కూల్చిన ప్రాణాల్ని

ఏ ద్ణుఖపు త్రాసులో

కొలుసుకోవాలో చెప్పండి..!

 

వెలవెల బోతున్న బతుకును

తెరమరుగవుతున్న మెతుకులను

చిరుగులకు వేస్తున్న అతుకులను

మాటల మనసు చితుకులనూ

ఎవరో ఒకరు ఆపాలి..!

ఏ కొత్తదనమో ఆవహించాలి

 

కల్మషాలను కడిగేసుకొని

కళ్లల్లో కాంతులు పోగేసుకుని

గతాన్ని నెమరేసుకొని

బాధల్తో తడుస్తున్న

వర్తమానాన్ని మానాన్ని

ఓ కొత్త వలువతో చుట్టుకోవాలి

భవిష్యత్తును అందంగా

ముస్తాబు చేసుకోవాలి…

 

సమతను పెంచి మమతను పంచి

ఈ నూతన వత్సరాన

కొత్తగా.. కొంగ్రొత్తగా..

అభ్యుదయ భావాల చిగుళ్ళు

తోడుక్కోవాలి

ఉషస్సులా.. తపస్సులా..

నూతనత్వం వెల్లివిరియాలి..!

– డా.కటుకోఝ్వల రమేష్‌,99490 83327

➡️