కవితా ఫిరంగి ‘1818’

Dec 18,2023 09:36 #sahityam

1818 … ఇలా ఒక అంకె శీర్షికగా కవి పుప్పాల శ్రీరాం వెలువరించిన కవిత్వ పుస్తకం ఒక కొత్త ప్రయోగం. రెండు శతాబ్దాలుగా స్వతంత్ర భారతదేశంలో బడుగు, నిమ్న వర్ణ వర్గాలు గురైన అణచివేతను ఆయన కవిత్వంగా మలిచారు.ప్రస్తుతం కవిత్వం అస్తిత్వవాద ధ్రువం వైపు కేంద్రీకతమైంది. దీనివల్ల బహుజన, దళిత, స్త్రీవాదాలు తమ ఉనికిని చాటుతున్నా, సమాజానికి అవసరమైన ‘సామూహిక కార్యాచరణ’ దిశగా అంటే వీaతీషష్ట్ర ్‌శీషaతీసర a జశీఎbఱఅవస స్త్రశీaశ్రీ విషయంలో కవిత్వ ప్రయోజనం వెనుకబడి ఉందనే చెప్పాలి. ఈ నేపధ్యంలో ఖచ్చితమైన మార్పు కోసం నిఖార్సైన సామాజిక, రాజకీయ దృక్పథం అవసరమని కవి ఈ పుస్తకం ద్వారా చెబుతున్నారు. కవి తన దక్కోణాన్ని ‘భీమానది’ గొంతులో వినిపిస్తున్నారు. 1818 నుంచి ఇప్పటివరకూ భారతదేశంలో వర్ణవివక్ష ఎలా కొనసాగిందో సంఘటనలు, బాధిత వ్యక్తుల పేర్లతో సహా ప్రస్తావించిన తీరు, కవి ఉద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తోంది. గత పదేళ్ళుగా దేశ చరిత్రలో కొన్ని సంఘటనలను మార్చి, కొన్ని కప్పిపెట్టి, కొత్తగా రాసే ప్రయత్నం చేస్తున్న శక్తులు ప్రబలమయ్యాయి. వీటిని నిరోధించడానికి కృషి చేసిన 16 మంది మేధావులు ప్రభుత్వ ఆగ్రహానికి గురై, చెరసాల పాలయ్యారు. వారి పోరాటాన్ని సూచిస్తూ 16 ఖండికలుగా కవి గళం విప్పారు. ఇది ఈ పుస్తకం బలం. ఈ దీర్ఘ కవిత అంతస్సూత్రం పాఠకుని జాగృతం చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీయడం- రెండూనూ.తొలి వాక్యం నుంచీ ‘నేను,భీమా నదిని’ అంటూ, కవి నది గొంతుతో ఆ పరీవాహక ప్రాంతపు తేమను, సారాన్ని వివరిస్తూ, బాధార్తుల వెతలను చెప్పారు. గతపు గాయాలు తనపై మూగాయని, వాటిని తడుముతూ మొదలుపెట్టారు. ‘నేను భీమా నదిని’ అంటూ పదే పదే వచ్చే ఈ మాట, ఒకసారి హెచ్చరికను, ఒకచో బాధ, ఓసారి ఆందోళన, మరోసారి కవి ధర్మాగ్రహపూరిత ప్రశ్ననూ సూచిస్తూ దీర్ఘ కవిత నిర్మాణ విజయానికి బాటలు వేసింది. పాఠకునితో సజీవ సంభాషణ కొనసాగిస్తుంది.

              ”నీటి దేహమ్మీద జ్ఞాపకాల తూనీగలెగురుతున్నాయి.

                 బయళ్ళ దోవంతా గతం గుచ్చుకుంటోంది.”

                కవి కధను కాదు. చరిత్రను చెబుతున్నానని ప్రకటించారు. ఇది అవ్వ బువ్వ తినిపిస్తూ చెప్పే చందమామ కథ కాదంటూ, ఇది ‘రాజును వేటాడిన సైనికుల కథ’ అంటారు. అంటే తిరుగుబాటు బావుటా ఎగిరిన వైనం మనకు అందించే ప్రయత్నం చేశారు. అసలీ పోరాటం జరపాల్సిన అవసరమేమిటో తెలియాలంటే ఈ కవిత్వ పుస్తకం వచ్చిన నేపధ్యాన్ని ప్రస్తావించుకోవాలి.

1818 సంవత్సరంలో భీమానది తీరాన కోరేగావ్‌ ప్రాంతంలో అప్పటి బ్రిటిష్‌ సైన్యంలో మహర్లు భాగంగా ఉండేవారు. వారి ధైర్య పరాక్రమాల సహాయంగా బ్రిటిష్‌ సైన్యం పీష్వాల పాలనను అంతమొందించింది. ఆ సందర్భంగా ఆ యుద్ధంలో పాల్గొన్న మహర్ల పేర్లతో సహా కోరేగాంలో (1851లో) ఒక స్మారక స్థూపం కూడా నిర్మించారు. కానీ, కొన్ని కారణాల వల్ల, 1892, 1917లో బ్రిటిష్‌ ప్రభుత్వం మహర్లను సైనికులుగా గుర్తించడం మానేసింది. మహర్లను ‘మార్షియల్‌ రేస్‌’ అంటే పోరాడే తెగ కాదంటూ ముద్ర వేయడం అగ్రవర్ణ దురహంకారానికి చారిత్రక సాక్ష్యం.

స్వాతంత్య్రం వచ్చాక కూడా ఎందుకు కుల, మత, వర్ణ, వర్గ విభేదాలను నిర్మూలించ లేకపోయామో అనేది జవాబు లేని, దొరకని ప్రశ్న. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఓటు బాంక్‌ రాజకీయాలు నడిచాయన్నది పరమ సత్యం. కవి వీటిన్నిటి పట్లా తన నిరసన తెలియచేస్తారు.

              ”మీరేవుట్లైనా కానివ్వండి

          ఇంట్లో మీరే ఆహారమైనా తినండి

               ఆకలి కన్నీరు పెడుతుంది

            దాహం కరుణ వేడుకుంటుంది.”

అంటూ మానవ సహజాతాలైన ఆకలి, దాహం; ప్రాథమిక అవసరాలైన తిండీ, నీరు గురించి పాఠకుడిని సెన్సిటైజ్‌ చేయడం కవి టెక్నిక్‌. అవి అందరికీ ఒక్కటే. ఏ ప్రాంతం లోనైనా అవే మానవ సమాజ శాంతికి కీలకం. కానీ, ఈ దేశంలో జరిగిందేమిటి ?

”ఈ దేశం నేలని ఊళ్ళ చివర నిల్చోబెట్టింది.

ఈ దేశం నేలని గుళ్ళోకి రానీయలేదు.

నీళ్ళ తావుల్ని కన్నీళ్ళతో నింపి

నేల కంచంలో దేశం ఎంగిలి ముద్దపడేసింది.”

అంటూ కవి దళితులకు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. ‘వెలివేయడం’లోని అవమానం ఎంత మాయని గాయమో, తరాలు మారినా తరగని మానసిక వ్యధో అనుభవించిన వారికే తెలుస్తుంది.

”కప్పెట్టిన అవశేషాల్లోంచి/ కళ్లు తెరుస్తున్నాను… ఇంక్విలాబ్‌ జిందాబాద్‌/ అని గొంతు చించుకుని నిట్ట నిలువుగా గట్టు తెగిపోతున్నాను./ నేను భీమా నదిని” అని తన తదుపరి లక్ష్యం అన్యాయాన్ని ఎదుర్కోవడమే కాబట్టి, అందుకు విప్లవ మార్గం ఎంచుకున్నట్టు స్పష్టం చేశారు.

”ఈ మౌనాన్ని బద్దలు కొట్టాలి

ఈ వేటాడ్డాన్ని వ్యతిరేకించాలి.

ఏ దేశమైనా దేవుళ్ళది కాదు. కష్టజీవులదని చెప్పాలి”

ఇలా తేట పదాల్లో చెప్పిన కవే,

”నేరం రుజువు కాకుండా మరణించేట్టు

ఛార్జిషీట్‌ తయారవుతుంది

వణుకుతున్న చేతుల్లోంచి ప్రాణం

               నీళ్ళ గ్లాసులా జారిపోతుంది” అంటూ ‘రాజకీయ ఖైదీల’ వెతలు బయటపెడతారు. గిరిజనుల, వెనుక బడిన వర్గాల పక్షాన నిలుచున్న నాయకుడు స్టాన్‌స్వామి. ఆయన అడవి బిడ్డలను పలు రకాల హింసలకు గురిచేసిన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన చట్టాన్ని ప్రశ్నించారు. అదే స్టాన్‌ స్వామి పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతూ గ్లాసుతో నీళ్ళు కూడా లేపలేని స్థితిలో సైతం నిర్బంధంలో ఉంటే ఆ విషయం ప్రధాన వార్తాపత్రికల్లో రాదు. పైగా ఆయనపై దేశద్రోహ నేరం ఆరోపించబడింది.

ఇలా ఈ దేశ శిక్షాస్మ ృతి ఎంత దారుణంగా సాక్ష్యాలను పుట్టించగలదో తెలుసుకుంటే భయం వేస్తుంది. ఎక్కడెక్కడి సాక్ష్యాధారాల్నీ తారుమారు చేసి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం. దీన్ని కవి బట్టబయలు చేస్తారు.

”ఆ పదహారు మంది గురించే కాదు

ఈ దేశపు నల్లగౌను ముందు

తమ కేసు తామే వాదించుకోలేని

అనేకానేక వర్ణాల ఇంద్ర ధనువులున్నాయి.

నిరక్షరాస్యత ఉంది, ఫీజులు కట్టలేని నిస్సహాయత ఉంది.”

అంటారు. కవి అధికారుల ద్వంద్వ వైఖరిని వ్యతిరేకిస్తూ,

”చరిత్ర/ సంపద శయ్యపై పడుకుని

నిరుపేద నేల చెలమల్లోకి తొంగి చూడలేదు” అంటారు.

5వ ఖండిక అంతా చరిత్ర రాసే పద్ధతి మీద ఎక్కుపెట్టిన అస్త్రం. కవి పుస్తకాలకు పరిమితమైన చరిత్రను, అందులో బోలుతనాన్ని సూచించేందుకు వాడిని ప్రతీకలు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఉదాహరణకు.

”చరిత్ర నిర్లక్ష్యాన్ని రాసేందుకే

ఒక్క వర్ణమాల చాలడం లేదు

చరిత్ర చుక్కల్లేని ఆకాశమై విస్తరించింది

నిస్సార వృక్ష ఛాయగా పరుచుకున్నది.

చరిత్రది ఒట్టి బానిస పోలిక

పరాధీన సౌందర్యం” అంటారు. సమాజం కొన్ని వర్గాల ప్రజలను అణచిపెట్టి, చరిత్రను రికార్డు చేసే క్రమంలో నిజాలను తొక్కేస్తారని కవి సూచ్యంగా చెప్పారు.

ఇక భీమా నది, ఒక నిర్దిష్టమైన ఆశయం కోసం నిలబెట్టిన కోరేగావ్‌ స్థూపాన్ని తన బిడ్డల విజయ కేతనంగా పదిలంగా ఒడ్డున మోసింది. మరి, ఆ స్థూపాన్ని కూల్చేయాలని చూడటం ఎంతటి దురదృష్టకరమైన వైఖరి?

           ”కన్నీళ్ళతో యుగయుగాల దూరాన్ని దాటుతున్నాను. … బరువెక్కిన జ్ఞాపకాల్ని తొలిచి

రసజ్ఞుడెవరో/ ఒక కవిత్వ శిల్పాన్ని నిలబెడతాడు.

నేలరాలిన నక్షత్రాలను పొదిగి నగిషీలు చెక్కుతాడు”

ఆ నదీ, భూమీ ఎదురుచూసిన వ్యక్తి ఎవరో కాదు.ఈ కవే! అందుకే ప్రతి వాక్యంలో నది బిడ్డగా కవి మాట్లాడుతూ ఉంటారు. కవి ప్రతీకాత్మక కవిత్వం సృష్టిస్తూనే వాస్తవాన్ని మనం గ్రహించేట్టు చేస్తున్నాడు.

          ”ఈ దేశపు స్వేచ్ఛాయుత

నీలి గగనం బోనులో నిలబడింది.

2018 జనవరి ఒకటి

ఫ్యూడల్‌ కన్నులపై నిద్రలేని రాత్రయ్యింది”

అంటూ అన్యాయం జరిగిన తేదీ, సంవత్సరంతో సహా నమోదు చేస్తాడు.

”తనని తాను పొగొట్టు కోవడం,

మళ్ళీ పురుడు పోసుకోవడం

ఒక్క విప్లవానికే చెందిన రసవిద్య. నదీమ తల్లిని చెబుతున్నాను

మొప్పల అలికిడిలో పిడికిళ్ళ కేరింతలు విన్నాను.”

             ఎంత బుల్లి చేపల మొప్పల అలికిడిలో ఎంతటి గట్టి పిడికిళ్ళ సంకల్పం దర్శించాడో ఈ కవి! ఇలా సూక్ష్మ దృష్టితో కవిత్వీకరించడం పలుచోట్ల గమనిస్తాం. విచారణ ఖైదీల దుస్థితిని అక్షరీకరించడంలో శ్రీరామ్‌ పంక్తులు మాటిమాటికీ పాఠకుని కళ్ళను ఊట బావులుగా మారుస్తాయి.

             ”ఒకే ఒక్క పాయఖానా

బయట ఒకరి తర్వాత మరొకరు వేచి ఉంటారు.

చిమిడి పోయిన అన్నమూ,

పప్పు నీళ్ళతో పాత జలింసేరు

పొట్టలన్నీ కుళ్ళిపోతాయి

…… సిప్పర్‌ లేకుండా నీళ్ళు తాగలేని పెదవులు,

పెద్ద పేగుల్లో జీర్ణం కాని హింస”

               ఇవి కేవలం పదచిత్రాలు కావు. మన కళ్ళముందు అక్షరాలతో ఆవిష్కరించిన సజీవ చిత్రాలు. కవిత్వంలో మార్మికత ఎంత ఉండాలో విప్పిచెప్పే స్పష్టత కూడా అంతే ఉండాలి. అందుకే తిన్నగా,

”అండర్‌ ట్రయల్‌ గాళ్ళకి

భారత శిక్షా స్మృతిలో మిల్లీమీటర్‌ చోటుండదు

…. నేను భీమానదిని !

మార్చురీ గదుల్లాంటి ఈ దేశపు జైళ్ళ ముందు

సహచరుల కోసం / గడ్డ గట్టుకు పోతున్నాను.” అంటూ కవి తానున్న చోటుకి మనల్నందర్నీ ఒక్కొక్కరుగా, సమూహాలుగా, ముందు దిగ్బ్రమతో, తరువాత మెలకువతో నిజానిజాలు చర్చించుకుంటూ రండిరా! అని సూచిస్తున్నారు.

”ఈ దేశపు సర్వసత్తాహక న్యాయ దేవతకు

పెండింగ్‌ కేసుల వేయి చేతులెత్తి, నమస్కరిస్తున్నాను”

అంటూ కోర్టు వాకిళ్ళలో పడిగాపులు పడుతూ, నేరం మోపబడిన ‘రాజకీయ ఖైదీల’ వెతలను అర్థం చేసుకొమ్మని వేడుకుంటున్నారు.

”నేను భీమా నదిని

నిజ్జంగా తెలియకే అడుగుతున్నాను.

తల్లీ, ఈ బిడ్డలకు మరణం కన్నా ముందు

బెయిలెందుకు రావట్లేదు ?”

ఇది న్యాయవాదులను సైతం కలవరపరిచే ప్రశ్న. ఇంత కవిత్వం రాశాక, తన డిమాండ్స్‌ను కూడా విస్పష్టంగా రాసి, ఏం జరుగుతుందో ఏమోనన్న భయం, మొహమాటం తనకు లేవని కవి ప్రకటించారు.

”నేను భీమానదిని/ ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను.

సాయిబాబాని విడిచిపెట్టు

నా ప్రియాతి ప్రియమైన కవి వరవరరావును కూడా.

స్టాన్‌ స్వామి సమాధి వద్ద పుష్ప గుఛ్ఛం ఉంచు

నీ గుండెలవిసిపోయే లోవు

దాహం తీర్చుకోవే ఇండియా ! కాస్త తెరిపిన పడు.”

తన ధర్మాగ్రహంతో స్వదేశీ పాలనలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోమంటూ శ్రీరాం ఈ కవిత్వ సంపుటిలో ఆక్రోశించారు. అక్కడక్కడా కొన్ని ఇబ్బందికర పోలికలున్నాయి. అలాగే భీమా కోరేగావ్‌ చారిత్రక నేపథ్యాన్ని తెలిపే వివరాలను aఅఅవఞబతీవగా ఇస్తే బాగుండేది. మొత్తంమీద ఇది యువకవులకు సవాలు. సమకాలీన కవిత్వాన్ని నేల మీద నడవమని, వాస్తవాలను చూపించే అగ్నికణికగా మారమనే సవాల్‌. శ్రీరాం కవిత్వం చదివాక ఒక ఉద్దీపన, ఒక స్ఫూర్తి, నమ్మిన సిద్ధాంతం కోసం నిటారుగా నిలబడే ప్రేరణ మనలో నిండుతాయి.

– కాళ్ళకూరి శైలజ98854 01882

➡️