ఎల్ వి గంగాధర శాస్త్రికి ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు

Mar 8,2024 18:31 #Literature

ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా. ఎల్ వి గంగాధర శాస్త్రి – భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు-2023″ ను అందుకున్నారు. సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలను,  స్వీయ సంగీతం లో, తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, లోకార్పణ చేసినందుకు  ‘భారతీయ ప్రధాన సాంప్రదాయ సంగీత విభాగం లో  ఆయనను ఈ అవార్డు తో భారత ప్రభుత్వం గౌరవించింది. ఈ కార్యక్రమం న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్  లో మార్చ్ 6, 2024 న జరిగింది. గౌ II రాష్ట్రపతి తో పాటు  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు శ్రీ జి కిషన్ రెడ్డి, కేంద్ర చట్టము మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, పార్లమెంట్ వ్యవహారాలు మరియు సాంస్కృతిక  శాఖామాత్యులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి సంధ్య పురేచ, కేంద్ర సాంస్కృతిక శాఖ సెక్రటరీ శ్రీ గోవింద్ మోహన్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. కార్యక్రమానంతరం శ్రీ గంగాధర శాస్త్రి పాత్రికేయులతో మాట్లాడుతూ – ” గతం లో  డా ఏ పి జె అబ్దుల్ కలాం గారికి నా భగవద్గీత వినిపించి ప్రశంసలు పొందడం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘కళారత్న’, మధ్యప్రదేశ్ లోని పాణిని యూనివర్సిటీ నుంచి ‘గౌరవ డాక్టరేట్’, ఇప్పుడు భారత రాష్ట్రపతి గౌ II  శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు అందుకోవడం, అందునా నా తల్లితండ్రులు ఆరోగ్యం గా ఉన్నప్పుడే ఈ జాతీయ అవార్డు అందుకోవడం అసలైన  ఆనందాన్నిస్తోంది. ఈ SNA అవార్డు నా ‘గీతా’ పరిశ్రమను గుర్తించి శ్రీ జి కిషన్ రెడ్డి గారు అందించినదిగా భావిస్తాను. జన్మనిచ్చిన తల్లితండ్రులకు, మాతృభూమికి, మాతృదేశానికి ఇంతకంటే తిరిగి ఏమివ్వగలను … ఈ అవార్డులూ ప్రశంసలూ అన్ని  నా భగవద్గీతా మార్గానికే రావడం ఆత్మానందాన్ని కలగజేస్తోంది.

➡️