విలక్షణ పరిశోధన ‘మిత్రసమాసం’

Jun 24,2024 05:41 #Literature, #Telugu Language

మనుషుల్ని నిషేధించినట్లు భాషను నిషేధించరాదు. భాషను స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. (కొలకలూరి మిత్ర సమాసం – పు14)
ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు కవి. కథ, నవల, నాటక రచయిత, అనువాదకుడు. సాహిత్య విమర్శకుడు. సాహిత్య పరిశోధకుడు. ఇది అందికీ తెలిసిన విషయమే. ఆయన భాషా పరిశోధకుడన్న సంగతి అందరికీ తెలీదు. పరిశోధనకులనగానే మనకు భద్రిరాజు కృష్ణమూర్తి, జీవనరెడ్డి, చేరా, బూదరాజు రాధాకృష్ణ, చిలుకూరి నారాయణరావు వంటి వాళ్ళు స్ఫురిస్తారు. సాహిత్య సృజనకారులు పరిశోధకులైతే సాహిత్య పరిశోధకులవుతారు. వాళ్ళు సాధారణంగా భాషా పరిశోధకులు కారు. కొలకలూరి సృజన రచయితే గాక, సాహిత్య పరిశోధకుడే గాక, భాషా పరిశోధకుడు కూడా కావడం అరుదైన అంశం. ఆయన భాషా పరిశోధన గ్రంథమే ‘మిత్ర సమాసం’.
సంప్రదాయ వైయాకరణులు సృష్టించిన ‘వైరిసమాసం’ అనే భావనను తిరస్కరించి, కొలకలూరి ‘మిత్రసమాసం’ అనే భావనను సృష్టించారు. అందుకే ఈ పరిశోధన విలక్షణమైనది. విశిష్టమైనది. ‘వైరి సమాసం” అనే భావన తెలుగుభాష, ఇతర భాషలతో కలిసి ఉండటాన్ని, తానూ వికాసం పొందటాన్ని అరికట్టుతుందని ఆయన భావించారు. ఒక భాషాపదం మరో భాషాపదంతో కలిసి సమాసంగా రూపొందితే దానిని వైరి సమాసమని నిషేధించవలసిన అవసరం లేదంటారు కొలకలూరి. ‘వైరి సమాసాన్ని నిషిద్ధమనే అధికారం ఎవరికీ ఉండరాదు, ఉండదు. వ్యాకర్తలు కొన్ని సమాసాలను దుష్టమనో, వైరి అనో భావించటం అవిచారమూలకం” అంటారాయన.
ఈ పుస్తకంలో ‘వైరి సమాసం’ అనే జొన్నవిత్తంత అంశాన్ని కొలకలూరి భాషకే పరిమితం చేయకుండా, దానిని సామాజీకరించి, వైరి సమాస భావన అభివృద్ధికరమైనది కాదని సిద్ధాంతం చేశారు. అర్థవంతమైన భిన్న భాషల విభిన్న పదాలకు ఏకార్థభావం సాధించాలి. ”సమాజంలో మనుషుల్ని దూరం చేసుకున్నట్లు సాహిత్యంలో సమాసాలను దూరం చేయవద్దు” అని విజ్ఞప్తి చేశారాయన. ప్రపంచంలో ఏ భాషా స్థిర బిందువు కాదనీ, ప్రతి భాషా ఒక చరబిందువని, ప్రతి భాషలోనూ అనేక ఇతర భాషల పదాలు కలవడం సహజమని, ఆ సహజ ప్రక్రియను వైరి సమాసం పేరుతో నిషేధించడం మంచిది కాదని అంటారాయన. ఒక సమాసం వైరి, శత్రువు కావడం ఏమిటి? అన్నది ఆయన ప్రశ్న. వ్యాకరణ శాస్త్రాలు భాష అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలి తప్ప, భాష కుంచించుకుపోవడానికి అవి సహకరించరాదని కొలకలూరి అభిప్రాయం.
ఈ పరిశోధనలో కవి జనాశ్రయం, ఛందో దర్పణం, ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాషా భూషణం, లక్షణసార సంగ్రహం, బాల వ్యాకరణం, బాల కవి శరణ్యం వంటి తెలుగు వ్యాకరణాలు ఉపయోగించిన వైరి సమాసం, వైరి వర్గం, దుష్ట ప్రయోగం, గ్రామ్య పదం, దుష్ట సమాసం, మిశ్ర సమాసం వంటి పదాలను పేర్కొన్నారు. వాటికి వ్యాకర్తలు చెప్పిన నిర్వచనాలలోని సామంజస్యాలను చర్చించారు. వైరి సమాస వ్యవస్థను కొలకలూరి శాస్త్రీయంగా పేర్కొన్నారు. తెలుగు వ్యాకర్తలు తెలుగు వ్యాకరణం రాస్తూ సంస్కృతాధిక్యతను ఆమోదించడం ఎంత గౌరవం!” అని ఆశ్చర్యపోయారు. తెలుగు సంస్కృత పదాలు కలిసుండే సంస్కృతంతో చేరిన తెలుగు అనడం తప్పని, తెలుగులో చేరిన సంస్కృతం అనడం ఒప్పని ఆయన పేర్కొన్నారు. సమాసంలోని పూర్వ పర శబ్దాలు సంస్కృత పదాలే అయితే తప్పు లేదు. అవి రెండూ తెలుగు పదాలో, తత్సమ పదాలో అయినా ఫరవాలేదు, కానీ, ఒక సంస్కృత పదమో, తత్సవ పదమో ఉండి తర్వాత తెలుగు పదం ఉంటే దానిని వైరి సమాసం అన్నారు. మొదట తెలుగు పదం, తర్వాత సంస్కృత – తత్సవ పదం ఉంటే మిశ్రమ సమాసం అన్నారు. ఈ పేర్లు ఆ పదాల కలయికను నిరోధించేవిగా ఉన్నాయని కొలకలూరి అభిప్రాయం. వైరి సమాసం అనే మాట సంస్కృత భాషాభిమానంతో పుట్టిందంటారాయన. ”ఆదానంతోనే భాషాభివృద్ధి ఉంటుంది” అని కొలకలూరి పేర్కొన్నారు. అంటే ఇతర భాషా పదాలను కలుపుకోవడం ద్వారానే ఏ భాషైనా వృద్ధి చెందుతుందని, ఇందుకు ఆయన ఆంగ్లభాషనే ఉదహరించారు. ”ఆంగ్లభాష ఎంత? జానెడంత. ఇప్పుడెంత? బారెడంత. ప్రపంచ భాషలన్నింటినీ తనలో ఇముడ్చుకొని ప్రపంచ భాష అయింది”. తెలుగు వ్యాకర్తల తలకిందుల ఆలోచననూ వ్యాఖ్యానిస్తూ ”వ్యాకర్తలు, లాక్షణికులు తన తల్లి తెలుగును గూర్చి మాట్లాడుతూ, సంస్కృత మాత సౌందర్యానికి అబ్బురపడే అర్భకులు” అంటూ- వాళ్లే ఈ వైరి సమాస వ్యవస్థను సృష్టించారన్నారు. కొలకలూరి ఈ సందర్భంగా భాషకు సంబంధించిన విధి నిషేధాలు పనికిరావన్నారు.
వ్యాకర్తలు వైరిసమాసం అని వ్యతిరేకంగా పేరు పెట్టినా శాసన కర్తలు, ప్రాచీన కవుల నుంచి నేటి వ్యాపార ప్రకటన కర్తల వరకూ వైరి సమాసాలు ఉపయోగించిన తీరును కొలకలూరి విస్తృతంగా అధ్యయనం చేసి సోదాహరణంగా నిరూపించారు. ఈ అధ్యయనం ఆ పరిశోధన గాఢతకు నిదర్శనం. ”తిరస్కారం పురస్కారంతో నిమిత్తం లేకుండా వైరి సమాసం పెరుగుతూ వచ్చింది” అన్నది ఆయన పరిశోధనల ఫలితం. పాల్కురికి సోమనాధుడు ప్రయోగ శీలి. ఆయన వైరి సమాసాలు ప్రజల వ్యవహారంలో ఉన్న వాటిని విస్తృతంగా ఉపయోగించారని వివరించారు. కొలకలూరి వారి నిజాయితీకి నిదర్శనం… పూర్వ కవుల వైరి సమాసాలను తాను గుర్తించడమే కాక, ఇతర విద్వాంసులు గుర్తించిన వాటిని వాళ్లు గుర్తించినట్లు గానే చెప్పడం కనిపిస్తుంది. ”వైరి సమాసాలను గ్రహించడం, గుర్తించడం, నిర్మించడం, ప్రయోగించడం సాహిత్యానికి, జీవితానికి అత్యవసరం” అని ప్రాచీన తెలుగు కవుల వైరి సమాస చర్యల సారాంశం. కొలకలూరి వృత్తి పదకోశాల నుంచి, నామవాచకాల నుంచి, సినిమాల నుంచి, సైన్‌బోర్డుల నుంచి, వ్యాపార ప్రకటనల నుంచి వైరి సమాసాలను ఏరి, కుప్ప చేసి వాటిని సమర్ధించారు.
భాషకు మిశ్రమ గుణం సహజమని, ఇతర భాషాపదాలను ప్రతిభాషా అనివార్యంగా తనలో ఇముడ్చుకుంటుందని, అలా చేర్చుకుంటే ఆ భాష సజీవంగా ఉంటుందని, లేకుంటే మృతభాష అవుతుందని కొలకలూరి అభిప్రాయం. వ్యాకర్తల విధి నిషేధాల ప్రకారం కవులు, ప్రజలు నడుచుకోరని ఆయన పరిశోధనలోని ధ్వని.
”నేటి తెలుగు కవులు ఈ సమాస వ్యవస్థను సాహిత్య సౌందర్యం కోసం ప్రయోగించారు. కవులు ప్రయోగశీలురు కదా”
– (కొలకలూరి ఈ గ్రంధం.. పు 14)
– రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

➡️