ఉత్తరాంధ్ర ఆర్ద్ర స్వరం భుజంగరావు కవిత్వం

Feb 26,2024 10:03 #sahityam

                  ఉత్తరాంధ్ర వేదన కథల్లో వ్యక్తమైనంత విస్తృతంగా కవిత్వంలో వ్యక్తం కాలేదనే భావనని తొలగించాలనే దఢ సంకల్పం నేడు ఉత్తరాంధ్ర కవుల్లో బలంగా ఉంది. పాయల మురళీకృష్ణ, లండ సాంబమూర్తి, బాల సుధాకర్‌ మౌళి వంటి కవుల కార్ఖానా ఇక్కడ పురుడు పోసుకుంది. రెండు దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ, ఇటీవల ‘నీటి గింజల పంట’ కవితా సంపుటి వెలువరించిన కంచరాన భుజంగరావు కూడా ఈ వరుసలోనే కనిపిస్తారు. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయిందనుకునే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. కానీ, సాంకేతిక, భాషా, సంస్క ృతీ ఆదానాల ప్రభావం వల్ల అన్నీ విధాలుగా గ్రామాలు తుడిచిపెట్టుకుపోతున్నాయని ఆవేదన చెందేవారు అరుదు. అలాంటి స్వరాలకు ప్రతినిధి కంచరాన భుజంగరావు.

”వేళ్ళు నాగళ్లుగా దున్నే తత్వం అతనిది. దేన్నీ దేన్నుంచీ విడదీయకుండా కలగలపి ముద్దజేసి ఇచ్చే తత్వం అతనిది. ఆ పరంపరలో కంచరాన భుజంగరావు కొత్త గొంతుక, తర్ఫీదయిన గొంతుక.” అని ప్రముఖ కవీ, విమర్శకుడూ శివారెడ్డి చెప్పిన మాటలు భుజంగరావు కవిగా ఎదగడానికి, తన చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్య ఎంత సంఘర్షణను అనుభవించాడో తెలియజేస్తాయి. విభిన్న సామాజికాంశాల తోరణంలా ఈ కవితా సంపుటి దర్శనమిస్తుంది. 20కి పైగా వైవిధ్యాంశాల్ని ఇందులో పొందుపరిచాడు కవి. ప్రధానంగా ఉత్తరాంధ్ర దుస్థితి, పల్లెల అస్తిత్వం, రైతుల దయనీయతలతో పాటు కవిత్వ రచనకు తాను పడిన సంఘర్షణ, కవిత్వంతో తన ప్రయాణానికి సంబంధించిన ప్రస్తావన ఈ కవితల్లో ఎక్కువగా దర్శనమిస్తాయి.

ఈ సంపుటి ప్రారంభ కవిత ‘మౌనమే మట్టి రహస్యం.’ పూలు, ఆకులు, నీరు అన్నీ తమ గొప్పతనాన్ని చాటుకునేలా ధ్వనుల్ని చేస్తున్నా అన్నింటికీ మూలమైన మట్టి మాత్రం మౌనంగా తన విధిని కొనసాగిస్తూ ఉంటుందంటాడు కవి.

”మట్టి / మౌనంగా ఒదిగిపోయింది

సష్టికి జీవం పోస్తూ….!”

నిశ్శబ్దంగా సృష్టికి జీవం పోస్తున్న మట్టి గొప్పతనాన్ని గమనించేది కర్మసాక్షి అయిన ఆ సూర్యుడు మాత్రమేనంటాడు. జీవుల మనుగడకు, వికాసానికి ప్రాథమికంగా మట్టే అవశ్యకమని ‘ఊదాహరణనౌతా’ కవితలో.

”జీవనిర్జీవ సంపదల్ని పదిలంగా దాచి ఉంచిన

మట్టి మహాపేటిక రహస్యాలను గాలిస్తాను.

. .. .. .. .. ..

పరిశీలించిన ప్రతి చోటా…. పరిశోధించిన ప్రతిసారీ….

బతుకు భూమిక మట్టేనని గ్రహింపుకొస్తాను

ఏ నాగరికతల వికాస వేదికయినా మన్నేనని

నిరంతరాయంగా ఎలుగెత్తుతాను

తడి స్పర్శకు పులకల మొలకయ్యే తల్లితనానికి

నన్ను నేను ఒక ఉదాహరణగా మలచుకుంటాను.”

అంటాడు ఈ కవి. మట్టే నాగరికత వికాసాన్ని పరిఢవిల్లేలా చేస్తుందని వివరిస్తాడు. బిడ్డ మరణాన్ని చూసి ఆగిన తల్లి గుండెలాగా చెట్టు చనిపోయిన వెంటనే మట్టి కూడా మరణిస్తుందని తెలిపిన కవిత ‘మట్టీ… చెట్టూ’. చెట్టు మరణిస్తూ తన స్థానం భర్తీ చేయడానికి వేరొక మొక్కకు జీవం పోయమని మట్టితో చెప్పాలనుకుంది. ఆ మాటలు చెవిన పడకముందే మట్టి కూడా తనువు చాలించిందని వర్ణించటం మట్టికి చెట్టుకి ఉన్న ఆవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుంది.ఉత్తరాంధ్ర దయనీయ స్థితి భుజంగరావు కవిత్వంలో కళ్ళకి కడుతుంది. ఎన్నో ప్రకతి వైపరీత్యాల నడుమ నలిగిపోతున్న ప్రాంతం ఇది. కవితా సంపుటి శీర్షికయిన ‘నీటి గింజల పంట’ కవిత ఈ దుస్థితికి అద్దం పడుతుంది.

”బబుల్‌ ర్యాపర్లో చుట్టినా

పగిలిపోదనే భరోసా లేని

గాజు వస్తువు కొరియర్‌ పార్శిల్లాంటిదే

మా బతుకుల్ని కూల్చే

తుపాను కర్మాగారపు అలలపోటు-

మేతకొచ్చే మేఘాలే తప్ప

కురిసిపోయేవేవీ ఇటు చూడని

చినుకు భ్రమల వరదగుడి!” (పుట. 36)

వర్షాధారిత వ్యవసాయాన్ని నమ్ముకుని పంటలు ఎండిపోయి నష్టపోతున్న దౌర్భాగ్యం వల్ల, కొద్దో గొప్పో పంట చేతికి అందొచ్చే వేళ తుపాన్లు దానిని తినిపోతుంటే నిస్సహాయత వల్ల ఇక్కడి రైతులు నేలకొరుగుతున్నారు. తమతో ప్రకృతి కూడా ఆటలాడుకుంటుందని వాపోతాడు కవి.

ఆర్థికంగా, కళల పరంగా అత్యుత్తమ దశని చూసిన ఉద్దానం ప్రాంతం నేడు కన్నీటి నేల అయింది. ఈ కష్టాన్ని కవి ‘నవ్వు మరచిన నేల’ కవితలో చెప్పిన తీరు హృదయాలను ద్రవింపజేస్తుంది.

”నేటికి ముప్పయ్యేళ్లు పైనే కావస్తోంది

పమిడి నిద్ధానం, పసిడి ఉద్దానం కళ తప్పింది

ప్రతి పల్లె పీనుగుల పెంటయ్యింది

.. .. .. ..

ఈ నేల ఇప్పుడొక నిస్సారమైన చోటు

దూల పురుగు కమ్మేసిన

పూతలేని మునగచెట్టు

.. .. .. ..

పాలకులారా! అధికారులారా!

మీ రాజ్యాలను మీరేలండి!

మా కర్మానికి మమ్ము ఒగ్గీసిందానికి మీరేలండీ!” అంటాడు ఈ కవితలో.

అంతుపట్టని కారణంతో కిడ్నీ వ్యాధి మహమ్మారి ఉద్దానం ప్రాంతన్నంతా తుడచిపెట్టేస్తోంది. ప్రభుత్వాలకి వీరి వ్యధ పట్టదు. అందుకే కవి మీ రాజ్యాలను మీరు పరిపాలించండి. మాపాటికి మమ్మల్ని వదిలే దానికి మీరు మాకు ఎందుకండీ? అని చివర్లో సుతిమెత్తని చురకంటించాడు. ఈ ప్రాంతంలో బతకలేక వేరే ప్రాంతాలకు వలసపోతూ ఓడల్లో పనిచేస్తున్న యువత జీవితాన్ని ‘పడవ కాసిన ఎన్నెల మా యవ్వనం!’ అనే ఏకవ్యాక ప్రయోగంతో ఏకరువు పెట్టాడు కవి.

ఉత్తరాంధ్రలో వేల ఎకరాల మెట్ట, బంజరు భూములే కనిపిస్తాయి. విత్తడానికి చేసిన అప్పుకి, చేతికొచ్చిన పంటకి మధ్య అంతరం సన్నకారు రైతు మెడకి ఉరి బిగిస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో తరుగుతున్న వ్యవసాయం, భూములు అమ్మినా తీరని బాధ్యతలు వంటి ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ ఈ కవి ”నాగలి జెండా పట్టుకొని” కవితలో నిక్షిప్తం చేశాడు.

”బుక్కెడు బువ్వకు / హామీ పడలేనపుడు

ఎటూ పాలుపోక / వలస చితి మీద

సగం కాలి పైకి లేచిన / జీవశ్చవం కడనాడుల్లో

పరుగాపని నెత్తుటి బొట్టు / మా దినం కూలికి ఆఖరి మెట్టు” అంటూ వలస బతుకుల హృదయ విదారక పరిస్థితిని వివరించాడు. ఉత్తరాంధ్ర పల్లె దు:ఖాన్ని కూడా ప్రత్యేక కవితల ద్వారా ఉటంకించటం ఈ కవితా సంపుటిలో కనిపించే మరొక విశేషం.

భుజంగరావు కవి నుంచి రైతుగా పరిణామం చెందాడా? రైతు నుంచి కవిగా రూపాంతరం చెందాడా? అనే అనుమానం కలుగుతుంది రైతుల కష్టాన్ని అతడు వర్ణించిన తీరు చూస్తే. కొన్ని కవితల్లో అతడు రైతు కవిగా దర్శనమిస్తే, కొన్ని కవితల్లో కవితా సేద్యంలో తలమునకలయిన రైతుగా కనిపిస్తాడు.

”నాగలి వెంట నడిచేకవి” కవితలో

”ఓ కవిగారు / ఏ కవితలో చూసినా

ఒకే విషయాన్ని వలపోస్తుంటారు

.. .. .. .. .. ..

చివుళ్ళు పచ్చగా ఉన్నా

చేవ చచ్చిన మొదళ్ల రూపాన్ని

అక్షరాల అద్దంలో చూపుతారు

.. .. .. .. .. ..

మట్టి మడతల్లో గుబాళింపులున్నా

దూక్కిలో రాలే

కన్నీటి చుక్కల కథ ఏమిటో వివరిస్తారు

/ ఈ కవిగారికి ఒకసారి

తాను తినే అన్నం మెతుకు మీద

నాగలి కనిపెట్టినవాడి

అస్థిపంజరం కనిపించిందట

అప్పటి నుండి అతడు

నాగలి వెంటే నడుస్తున్నాడు” అంటూ చెప్పటంలో కవి లోకం చూపుని కాదని తనదైన దృష్టితో విషయావగాహనకి వచ్చినట్టు తెలుస్తుంది. కవులకి రైతులు ఎక్కడెక్కడో కనిపిస్తే, భుజంగరావుకి మాత్రం తాను తినే మెతుకు మీద అస్థిపంజరంగా కనిపించటం బహుశా ఇంకెవరూ దర్శించలేని ప్రదేశమే!

దేశం ఆకలి తీర్చే రైతన్న కష్టానికి చీకటి చట్టాల బరువు మరింత కుంగుబాటుని కలిగిస్తుందని బాధ్యతగాల పౌరులుగా మనమంతా ప్రశ్నించవలసిన అవశ్యకతని ఎలుగెత్తుతాడు ”విత్తు దీపాలు వెలిగించేవాడి కోసం” అనే కవితలో. రైతు చట్టాల అన్యాయాన్ని ఎదిరించడానికి దేశ రాజధాని నడిబొడ్డులో పోరుబాట పట్టిన రైతుల ధీరత్వాన్ని తలచుకుంటూ ”కెరటం చూపిన దారిలో” కవితను అల్లాడు.

అపురూప అనుబంధాల్ని, మధురానుభూతుల్ని మేళవిస్తూ కవి తన కూతురిని గురించి రాసిన ”మా మిఠాయి పంట”, తన తండ్రి గురించి రాసిన ”చెమట పూల చెట్టు”. ”పెరట్లో చింత చెట్టు” కవితలు సంపుటికి మెరుపునందించాయి. కవిత్వ రచనకు తాను చేసిన యుద్ధం, మార్క్స్‌ ఆలోచనలు, పెట్టుబడిదారీ విధాన వ్యతిరేకత, స్త్రీవాదం, యుద్ధ నిరసన, మాతృభాషపై ప్రేమ, జనసామాన్యుల దృష్టికోణంలో అమృతోత్సవ్‌, సాంకేతిక చెరసాలల్లో చిక్కిన బాల్యం, కరోనా విజృంభణ, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, పర్యావరణం, నాయకుల భాష … ఇలా ఎన్నో వైవిధ్య అంశాల సమాహారంగా మొలకెత్తిన ఉత్తరాంధ్ర ఆర్ద్ర స్వరమే కంచరాన భుజంగరావు ”నీటి గింజల పంట”. అందరూ చదివి హత్తుకోవాల్సిన మానవీయ కవిత్వం!

– డా. కె.ఉదయ్ కిరణ్‌, డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం,94941 88200

➡️