నవ సమాజ నిర్మాణానికి కవులు కృషి చేయాలి : ఇన్‌ఛార్జ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎఎండి ఇంతియాజ్‌

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయని, వాటిని కవులు తమ కవితలు, గానం ద్వారా పారద్రోలి నవ సమాజం నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎపి ఇన్‌ఛార్జ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎఎండి ఇంతియాజ్‌ అన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ‘భారత రాజ్యాంగం – లౌకిక విలువలు’ అనే అంశంపై లౌకిక కవనం పేరుతో కవి గాయక సమ్మేళనం శుక్రవారం విజయవాడలోని ఎంబి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం మనకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కడా వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా లౌకిక సర్వసత్తాక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని చెప్పారు. అయితే, అక్కడక్కడా కొన్ని సమస్యలు, రుగ్మతులు ఉన్నాయని.. వాటిని నిర్మూలించి మంచి సమాజం కోసం కృషి చేయాలని కవులకు సూచించారు. ప్రముఖ విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ నేడు సమాజంలో కులం, మతం ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. దేశంలో ఉండాలంటే హిందూ సంప్రదాయాలు, హిందూ దేవుళ్లను గౌరవించాలని నేటి పాలకులు అనధికార శాసనాలను చేస్తున్నారని తెలిపారు. దీంతో ఇతర మతస్తులు కొంత ఆందోళన చెందుతున్నారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా లౌకిక విలువలు గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకర మని పేర్కొన్నారు. దేశాన్ని సమానత్వం దిశగా పయనింపజేసే దిశలో ప్రోగ్రెసివ్‌, ప్రగతిశీల, సెక్యులర్‌ శక్తులు వైఫల్యం చెందాయన్నారు. సాహిత్యం ద్వారా కవులు, రచయితలు కాయకల్ప చికిత్స చేసి పాలకులను మార్చాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి బాధ్యులు వొర ప్రసాద్‌ అధ్యక్షత వహించగా, ప్రముఖ కవయిత్రి మందరపు హైమావతి, ఎంబివికె విజ్ఞాన కేంద్రం బాధ్యులు బిఆర్‌.తులసీరావు, నగర ప్రముకులు గోళ్ల నారాయణరావు, కార్యక్రమ నిర్వహణా బాధ్యులు సత్యాజీ, శాంతిశ్రీ, గుండు నారాయణ, సత్యరంజన్‌, కెంగార మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️