నిజం స్పర్శ చవిచూసేదాకా …

Jun 17,2024 02:45 #aksharam

తవ్వకాలు జరగాలి
మెదడు చెదరకుండా
ఎముక విరగకుండా
చూపు చిట్లకుండా
చురుకు చెడకుండా
మెత్తని వేళల్లో సుతిమెత్తని పరికరాలతో
మనసు లోతుల్లో
ఇంకిన ఇష్టాల్లో
పొడిబారిన ప్రేమను తాకేదాకా
కన్నీటి జాలు ఆగిన చోట
కరిగిన కల ఆనవాళ్లు దొరికేదాకా
చెదరిన బతుకు చిరునామా కనిపించేదాకా
నిజం స్పర్శ చవిచూసేదాకా
ఎర్రని వాక్యాలు చేతికి అందేదాకా
మట్టి పొరల్లో మాట చప్పుడు వినిపించేదాకా
పూడిన ముద్రలు పలుకరించేదాకా
అడుగున చేరిన ఆశ నాడిని కనిపెట్టేదాకా
తెగిన ఇష్టపు కొస అందేదాకా

పాత రోజును వెలికి తీస్తూ
కొత్త రోజులతో ముడిని విడదీస్తూ
తవ్వకాలు జరపాలి
తరం ఓడి పోకుండా
మరో తరం చేజారకుండా
నిరంతరం నిజం స్వరం వినిపించేలా
తవ్వకాలు జరగాలి
మనిషి తప్పిదాలు తొలగాలి!
– చందలూరి నారాయణరావు,
97044 37247

➡️