చిక్కుళ్లు..చవి చూద్దాం..

Nov 26,2023 11:03 #ruchi, #Sneha

చిక్కుడు కాయల సీజన్‌ వచ్చేసింది. అందరూ ఇష్టంగా తినే పోషకాహారం. చిక్కుడు ఫాబేసి కుటుంబానికి చెందినది. గోరు చిక్కుడు, సోయా చిక్కుడు, పందిరి చిక్కుడు, అనపకాయ / అనుములు / కణుపు చిక్కుడు అన్నీ ఈ కుటుంబానికి చెందినవే. వీటిల్లో ఫైబర్‌, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పందిరి చిక్కుడు, కణుపు చిక్కుడు పూర్వం నుంచి ఇతర కూరగాయలతో కలిపి వండుకోవడం మామూలే. ముదిరిన కాయల గింజలను నానబెట్టి, ఉడికించి చిరుతిండిగా తీసుకోవడం మనకు ఇష్టమైనదే. అయితే కాలానుగుణంగా చిక్కుళ్లతో మరిన్ని కొత్త రుచులు పోషకాలు పోకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కొబ్బరి పాలతో..

కావలసినవి : చిక్కుడు కాయలు – 1/4 కేజీ, కొబ్బరి పాలు – 100 మి. లీ., ఉప్పు – తగినంత, పసుపు – 1/4 స్పూను, కారం / పచ్చిమిర్చి పేస్ట్‌ – స్పూను, పల్లీ, నువ్వుల పొడి – 2 స్పూన్లు, నూనె – గరిటె, ఆవాలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర – స్పూను చొప్పున

తయారీ : ముందుగా బాండీలో నూనె వేడి చేసి, తాలింపు దినుసులు వేయాలి. ఇవి దోరగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి, సన్న సెగపై మగ్గనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసి, పావుగంట ఉడికించాలి. కూర గుజ్జుగా ఉండగానే కారం, పల్లీలు, నువ్వుల పొడి వేయాలి. గరిటెతో మొత్తం కలిసేలా తిప్పి, మూత పెట్టి ఒక నిమిషం ఉడకనివ్వాలి. తర్వాత పైన కొత్తిమీర తరుగు చల్లాలి. అంతే కొబ్బరిపాలతో చిక్కుడుకాయ కూర రెడీ.

ఆనియన్స్‌తో ఫ్రై..

కావలసినవి : చిక్కుడు కాయలు – 1/4 కేజీ, ఉల్లిపాయ – ఒకటి, పసుపు – 1/4 స్పూను, ఉప్పు – తగినంత, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- స్పూను, పచ్చిమిర్చి -3, ఎండుకొబ్బరి తురుము – 2 స్పూన్లు, కారం – స్పూను, రసం పొడి/సాంబారు పొడి- 2 స్పూన్లుతాలింపు దినుసులు : నూనె – 2 గరిటెలు, (మినప్పప్పు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు- 1/2 స్పూను చొప్పున) ఎండుమిర్చి -2, కరివేపాకు రెబ్బలు -2

తయారీ : శుభ్రం చేసుకున్న చిక్కుడు కాయలను ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిపాయను నిలువుగా కట్‌ చేసుకుని, బాండీలో నూనె వేడిచేసి బ్రౌన్‌ కలర్‌లోకి వచ్చేంత వరకూ వేయించుకుని పక్కనుంచుకోవాలి. అదే నూనెలో తాలింపు దినుసులు వేసి, అవి వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి, ఒకసారి తిప్పి మూతపెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత పసుపు, ఉప్పు వేసి మధ్య మధ్యలో తిప్పుతూ మరో ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఎండుకొబ్బరి తురుము, ముందుగా వేయించుకున్న బ్రౌన్‌ ఆనియన్స్‌, కారం, రసం పొడి వేసి, కూరంతా తిప్పుతూ రెండు నిమిషాలు వేయించాలి. అంతే ఘుమఘుమలాడే చిక్కుడుకాయలతో వెరైటీ ఫ్రై రెడీ.

గింజలతో..

కావలసినవి : చిక్కుడు గింజలు – 1/4 కేజీ, నూనె – 2 గరిటెలు, ఉల్లిపాయ – ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – స్పూను, ఉప్పు – తగినంత, కారం – 11/2 స్పూను , పసుపు – 1/4 స్పూను,తాలింపు దినుసులు: ఆవాలు-1/2 స్పూను, జీలకర్ర -1/2 స్పూను, ఎండుమిర్చి -2, నువ్వులు – స్పూను తయారీ : బాండీలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు వేసి తాలింపు పెట్టాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, తాలింపులో కలిసేలా గరిటెతో తిప్పాలి. తర్వాత చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి నిమిషం వేయించి, చిక్కుడు గింజలు వేయాలి. ఒక నిమిషం తిప్పుతూ ఉడికించాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మరో నిమిషం ఉడికించాలి. తర్వాత టమోటా ముక్కలు, చిన్న గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి. కూర దగ్గరకు వచ్చాక, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేయాలి. ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దింపేయాలి. అంతే రుచికరమైన చిక్కుడు గింజల కూర రెడీ.

➡️