షీరోస్‌ @256

Jan 28,2024 07:43 #book review, #Sneha, #Women
sheroes 256 inspiring women from india book review

షీరోస్‌… ఈ పేరే గూస్‌బమ్స్‌ వచ్చేలా ఉంది. అది పలుకుతుంటే ఒక పులకరింత.. పురుషాధిక్య సమాజంలో హీరో అనడమేగానీ.. షీరో అనడం వాడుకలో లేదు. సినిమాల్లో అయితే హీరోయిన్‌ అనడం అందరికీ తెలిసిందే.. కానీ ఈ షీరో అనే పదం మహిళలందరికీ అందునా వీరోచితంగా, స్ఫూర్తివంతంగా నిలిచిన మహిళలను సంబోధించడం సముచితంగా ఉంది. మొత్తం 256 మంది విద్యార్థినులు.. వివిధ రంగాలలో ప్రముఖులైన 256 మంది పాత్రలను విద్యార్థినులు చక్కగా పోషించారు. వారి వారి రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహించిన మహిళల రూపధారణలను వారే వీరేమోనన్న విధంగా పరకాయ ప్రవేశం చేశారు. వీరందరూ ప్రాంగణంలో కనువిందు చేస్తూ స్ఫూర్తివంతంగా కనిపించారు. ఇదంతా అహల ఆలోచన.. పిల్లల ప్రేమికులు డుండ్రపెల్లి బాబు చిత్రాలు.. జాస్తి శివ కృషి, సీఏ ప్రసాద్‌ కార్యాచరణ.. ఈ కార్యక్రమంలో ఉన్న అందరూ అపురూప ఆవిష్కరణకు ప్రతిరూపాలే. ఇదో అద్భుత, అమోఘమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. పిల్లలంటే ఎంత ప్రేమ లేకపోతే ఇలాంటి బృహత్‌ కార్యక్రమం జరుగుతుంది! దీనికి విచ్చేసిన వారందరూ పిల్లల్ని అమితంగా ప్రేమించేవారే. ఈ కార్యక్రమంపై కొందరు పిల్లల ప్రేమికులే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. వారి అనుభూతులనూ కలగలిపినది ఈ ప్రత్యేక కథనం.

 

పిల్లలు అంటేనే అద్భుతాలు.. అబ్బురాలు.. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు అది ఎంత అక్షర సత్యమో నిరూపించబడుతుంది. పిల్లలంతా ఒక దగ్గర కూడటమే ఒక ఆనందం.. ఆ ఆనందం స్ఫూర్తివంతాన్ని అద్దుకుంటే అపూర్వం. అలాంటి ఈ షీరోస్‌ కార్యక్రమం 256 మంది చిన్నారుల వేషధారణలతో సహా ఆ స్ఫూర్తిమూర్తులను మన కళ్ల ముందుంచడం అద్వితీయం. వెయ్యి మందికి పైగా పిల్లలు వారి తల్లిదండ్రులు ఒకేచోట గుమికూడటం అపురూపమే. వారి పిల్లలకు కొసరి కొసరి ఆ తల్లులు భోజనాలు తినిపించడం.. అవన్నీ ప్రేమపూర్వక దృశ్యాలే.

షీరోస్‌ పుస్తకావిష్కరణ ఈ నెల తొమ్మిదో తేదీన గుంటూరు సమీపాన ఉన్న చౌడవరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్‌లో జరిగింది. ఈ పుస్తకం మన చుట్టూ ఉన్న ఎందరో ధైర్య సాహసాలు, ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన 256 మంది స్త్రీమూర్తుల గురించి రాసినది. ఈ పుస్తక ఆవిష్కరణ అన్నింటి కన్నా ఎంతో విభిన్నంగా జరిగింది. పుస్తకంలో ఉన్న 256 మంది మహిళామణుల వేషధారణలో అనేక పాఠశాలల నుంచి చిన్నారులు వచ్చారు. వారంతా కలిసి ఈ పుస్తకంలోని స్త్రీమూర్తులకు సజీవరూపం తీసుకొచ్చారు.

ఆ చల్లని సాయంత్రం ఐదు గంటలకు ‘షీరోష్‌ 256’ పుస్తక ఆవిష్కరణకు సన్నాహం చేస్తూ.. విచ్చేసినవారిని ఆహ్వానిస్తూ.. ప్రాంగణమంతా కిటకిటలాడిపోయింది. 256 మంది షీరోలని ఒక ప్రాంగణంలోకి చేర్చి, అందరికీ వారి క్యారెక్టర్ల పత్రాలను అందజేసి, ఎనిమిది వరుసల్లో వలయాకారంగా నిలబెట్టారు. ఈ మొత్తాన్ని డ్రోన్‌ కెమెరాతో తీసిన అద్భుతమైన చిత్రీకరణ.. చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచిపోతుంది.

ఆ తరువాత జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉంది. 256 మంది విద్యార్థులకూ ‘షీరోస్‌’ పుస్తకాన్ని ముందుగానే అందించటం విశేషం. మంగాదేవి, కొంతమంది ప్రముఖులు వేదికపై పుస్తకాన్ని ఆవిష్కరించే సమయంలోనే.. కింద ఉన్న 500 మంది చిన్నారులూ పుస్తకాన్ని పట్టుకుని ఒకేసారి ఆవిష్కరణ చేయడం అత్యద్భుత ఘట్టం. ఆద్యంతం విద్యార్థినులలో ఎంతో జోష్‌ కనిపించింది.

ఈ పుస్తక సహ రచయిత అయిన జాస్తి అహల ఏడవ తరగతి చదువుతోంది. ఈ చిన్నారి పద్యాలు రెండు శతకాలు రాసింది. అహలాకి భాష పట్ల ఉన్న పట్టు, ఇష్టం, నిబద్ధతతో కూడిన పనితీరు మెచ్చుకోతగ్గవి. ఇందులో అద్భుతమైన చిత్రాలు బాబు డుండ్రుపల్లి గీశారు. ఆ చిత్రాలు గీయడానికి ఆయన పడ్డ శ్రమ, చేసిన పరిశోధన ఆ బొమ్మల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

చక్కటి ఆలోచన

ఈ కార్యక్రమానికి జడ్జిగా నెల్లూరు నుంచి విచ్చేసిన న్యాయవాది గూడూరు లక్ష్మి మాటల్లో.. ‘256 మందిని విభాగాలుగా చేసి, ఎనిమిది గదులలో ఉంచారు. రూముకి ఇద్దరు ముగ్గురు చొప్పున జడ్జీలను నిర్ణయించారు. భోజన సమయానికల్లా వారి పాత్రల ప్రదర్శన ముగించేలా చక్కటి ఆలోచన చేశారు. కొందరు విద్యార్థినులు కెమెరాకు అప్పజెప్పినట్టుగా ప్రదర్శనలు ఇచ్చారు. మరికొందరు చక్కని హావభావాలతో ప్రదర్శన ఇచ్చారు. ఇంకొందరు జీవించారని చెప్పక తప్పదు. ఇందులో తప్పు పట్టాల్సిన వారైతే ఎక్కడా కనిపించలేదు. కృషి, పట్టుదల, ధైర్యంగా ప్రదర్శించిన తీరు మెచ్చుకొని తీరాల్సిందే. ఈ ప్రదర్శనను స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి ప్రదర్శనలో వారు మెరుగు పరచుకోవాలని చిన్న చిన్న సూచనలు చేశాం.

మా గదిలో ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి, మీరాబెన్‌, రుక్మిణి అరెండేల్‌, నాయకురాలు నాగమ్మ, పర్యావరణ హితం గురించిన పాత్రల్లో విద్యార్థినులు జీవించారు. తర్వాత చిన్న చిన్న లాజిక్కులతో పిల్లల్ని ఉత్సాహపరుస్తూ చక్కటి ప్రశ్నలతో నిర్వాహకులు రెండు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగించారు. ఇందులో పాల్గొన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను’ అన్నారు.

భవిష్యత్తు ‘షీరోస్‌’ ప్రేరణ

‘షీరోస్‌ పద, పుస్తక ఆవిష్కరణ – రచయిత ఆలోచనల ఆవిష్కారానికి అద్దం పట్టింది. మహిళల స్థితిగతుల పరిణామక్రమాన్ని ఆవిష్కరించి, మహిళలు ఎదగడానికి, వారు నడిపిన వాదన – పడిన వేదన- దాటిన ప్రతిబంధకాలను మన ముందుంచటం అందరికీ ప్రేరణగా నిలిచింది. బలీయంగా ఉన్న అరిటాకు భావజాలాన్ని దాటుకొని, సబలలనే ఆత్మవిశ్వాసాన్ని నింపుకొనేలా.. సమభావాన్ని ముందుకు తీసుకువెళ్లవలసింది బాధితులు అవుతున్న బాలికలేనని చూపటం స్ఫూర్తివంతం. దేశాభివృద్ధిలో మానవ వనరుల పాత్ర కీలకమైనది. అలాంటిది సగభాగం సంపూర్తిగా అభివృద్ధి చెందకపోవడం అంటే ఆ దేశ ప్రగతికి ఆటంకమని చెప్పటం. శ్రమ పట్ల గౌరవం, ఆత్మవిశ్వాసం, త్యాగనిరతి, సేవా తత్పరత, పోరాట పటిమ-సమాజాన్ని ముందుకు నడిపిన విలువలుగా – షీరోస్‌ ప్రత్యేకతలుగా మన ముందుంచడమే. ఈ ఆవిష్కరణ పెద్దల హృదయాల్లోనే కాక, పిల్లల మనసుల్లోనూ సజీవరూపం దాల్చాయి. కొంతమంది అయినా భవిష్యత్తులో ‘షీరోస్‌’గా రాణించడానికి చేసిన ఈ ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం!’ అని కర్నూలు నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, రచయిత, ఎం.హరికిషన్‌ అన్నారు.

బాలసాహిత్యంలో సప్తవర్ణాల పుస్తకం..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కందుకూరి రాము మనోగతం ఏమంటే.. ‘బాలసాహిత్యంలో ఇదొక ప్రత్యేకమైన.. కళ్ళు మిరుమిట్లుగొలిపే.. సప్తవర్ణాల పుస్తకం. కట్టు, బొట్టుల విభిన్నతతో ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క వస్త్రధారణతో కన్నులకు విందు భోజనంతో అచ్చెరువొందిస్తాయి. పెన్సిల్‌తో వేసిన గాప్‌ ఫిల్లర్స్‌ అద్భుతం. ఇలా కలగన్న శివ జాస్తి గారికి, దాన్ని కళ్ళ ముందుకు తెచ్చిన చిత్రకారుడు డుండ్రపెల్లి బాబు గారికి శుభాభివందనాలు’ అని ముగించారు.

అనిర్వచనీయమైన అనుభూతి

గుంటూరుకు చెందిన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ సుధారాణి తన అనుభూతులను పంచుకుంటూ.. ‘అరుదైన అతివల వివరాలతో.. ముద్రించిన పుస్తకం అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చింది. ఆ స్ఫూర్తిమంతులు చిన్నతనంలో ఇలాగే ఉండేవారా.? అనే విధంగా ఉన్నారు. శివ ఎన్‌ఆర్‌ఐగా ఉండి కూడా ”LEARN and HELP” పేరుతో పాఠశాలలకు లైబ్రరీ పుస్తకాలను అందిస్తూ ఉన్నారు. ఆయన మరో అడుగు ముందుకేసి హీరోస్‌ కేవలం మగవారు మాత్రమే కాదు.. ఆడవాళ్లలో కూడా హీరోస్‌ ఉన్నారు. వారిని అందరికీ పరిచయం చేయాలని ఈ షీరోస్‌ పుస్తకానికి శ్రీకారం చుట్టారు. ఎప్పటి నుంచో బాబు గారి బొమ్మలకు నేను అభిమానిని. కేవలం రెండే రెండు గీతలతో కళ్ళు, నోరు గీయడం ఈయన ప్రత్యేకత. ఆ రెండు గీతలతోనే ఎన్నో భావాలు పలికేలా గీయడం వీరికి మాత్రమే సాధ్యం. ఈ కార్యక్రమం జరిగిన శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్‌ నడిపించే 85 ఏళ్ల మంగాదేవి గారు ఒక షీరో. స్కూల్‌ మొత్తం ఎన్నో రకాల చెట్లను పెంచుతున్నారు. చిన్న చిన్న పర్ణశాలలుగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉంది. వారి ఆతిథ్యం మరువలేనిది’ అన్నారు.

దీటైన పదానికి పురుడు

‘ముందుగా తరతరాలుగా నడుస్తున్న మాట హీరోకు ధీటుగా షీరోస్‌ పదానికి పురుడు పోయడం అభినందనీయం. ఇక జడ్జిగా నేను గమనించిన వాటిల్లో.. ఏదైనా నేర్చుకొని, ప్రదర్శించాలంటే తామెపుడూ ముందేననీ.. తామెపుడూ ఫెయిల్‌ కామనీ.. అయితే గియితే తమ ప్రతిభను ప్రదర్శించనీయని టీచర్లూ, పేరెంట్స్‌ ఫెయిల్‌ అవుతారని నిరూపించారు పిల్లలు. పిల్లలతో ఆ ప్రాంగణమంతా కలువలై పూసాయి. నేను ఆ మరునాడు అమరావతి బాలోత్సవ్‌ వాలంటీర్ల అభినందన సభలో మాట్లాడుతూ ”శివగారు మీ అందరి కోసం, మనందరి కోసం షీరోస్‌ పదం సృష్టించారు. మీరంతా షీరోస్‌’ అని చెప్పినప్పుడు అక్కడున్న సభికులంతా ఆ పదాన్ని హర్షాతిరేకంతో, చప్పట్లతో ఆస్వాదించారు’ అని విజయవాడ నుంచి హాజరైన టీచర్‌, రచయిత్రి, మనోజ తన అనుభూతుల్ని పంచుకున్నారు.

జీవన విజయాల సంక్షిప్త సంగ్రహణ సంకలనం!

పాయకరావు పేటకు చెందిన విజయభాను కోటే తన అనుభూతుల్ని పంచుకుంటూ.. ‘ఇదో అద్భుతమైన కార్యక్రమం. 256.. అంతమంది మహిళల మూర్తిమత్వాన్ని వివరిస్తూనే, వారి చిత్రాన్ని ఒక పుటలో నిక్షిప్తం చేయడం ఒక మహత్తర యజ్ఞం. అందుకు పూనుకున్న బాబు మేధకు, శివ గారికి అభినందనలు. ఇంటికి వచ్చాక మా అన్నయ్య పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకుని, ‘అబ్బా! పుస్తకం ఎంత గొప్పగా ఉందమ్మా! పేజీలు ఎంత బావున్నాయో.. చదవాలి వెంటనే” అన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన అందరికీ అభినందనలు!’ అన్నారు.

ఈ పుస్తకం కోసం : 9490175160

 

  • శాంతిశ్రీ, 8333818985
➡️