బుజ్జిగాడి సందేహం

Dec 31,2023 09:45 #chirumuvallu, #Sneha

అది 8వ తరగతి. సైన్స్‌ మాస్టారు పాఠం చెప్పి వెళ్లిపోయారు. ‘ఇతర గ్రహాలలో గాలి లేదు. భూమి మీద మాత్రమే ఉంది. అందువల్లే భూమి మీద మాత్రమే జీవుల నివాసం సాధ్యం అయింది. గాలిలో అనేక పదార్థాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది ఆక్సిజన్‌. దీన్నే ప్రాణవాయువు అంటాము. మనం బతకటానికి సాయం చేసేది ఇదే..’ మాస్టారు చెప్పిన పాఠం సారాంశం అంతా ఆ మూడు ముక్కలే.

బుజ్జిగాడికి పాఠం బాగా అర్థం అయింది. వాడు ఏకాగ్రతగా వింటాడు. విన్నది బాగా గుర్తు పెట్టుకుంటాడు. అయితే వాడికి అనేక సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకునేదాకా నిద్రపోడు. వాడి సందేహాలతో తోటి పిల్లలను విసిగించటమే కాకుండా, ఒక్కోసారి టీచర్లను కూడా విసిగించేవాడు. ఎందుకంటే వారు చెప్పే సమాధానాలకు వాడు సంతృప్తి చెందకపోవడమే. దేనికైనా హేతువు (కారణం) ఉంటుందని, హేతువు లేనిదే ఏదీ జరగదని సైన్సు మాస్టారే ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటాడు. అందువల్ల ఆ హేతువు ఏమిటో కనుగొనేవరకూ వాడి మనసు కుదుటపడదు. ఇప్పుడు వాడి సందేహం ఏమిటంటే జీవులు జీవించటానికి కావలసిన గాలి ఎక్కడ నుండి వస్తుంది? అదే విషయం తోటి విద్యార్థులను అడిగాడు. వారికేదో తెలిసినట్టు, వీడికి మాత్రమే తెలియనట్లు ఎగతాళి చేసి వెళ్లిపోయారు. తెల్లారి క్లాసులో మాష్టారును అడిగాడు. ‘ఇదేం ప్రశ్నరా? భూగోళం చుట్టూ గాలి ఆవరించి ఉంటుంది. అది కూడా తెలియదా?’ అని చెప్పి, తప్పించుకున్నాడు మాస్టారు.

‘అదే మాస్టారు! అసలు భూగోళంపైకి గాలి ఎలా వచ్చింది. ఇతర గ్రహాలపైకి ఎందుకు వెళ్లలేదు?’ మళ్లీ అడిగాడు.

మాస్టారుకు విసుగుబుట్టింది. ఆయనకు తెలిసో తెలియదో? తెలిసినా ఎలా చెప్పాలో తెలియకో ‘కూర్చోరా వెధవ! ఎవరికి రాని సందేహాలు నీకే వస్తాయి. అదంతే, ప్రకృతి నియమం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే’ అంటూ వాడి ప్రశ్నను కొట్టిపారేస్తూ పాఠంలోకి వెళ్ళిపోయాడు.

బుజ్జిగాడి సందేహం తీరలేదు. వాడికి పట్టుదల ఎక్కువ. ఎలాగైనా తెలుసుకుకోవాల్సిందే అని మనసులో అనుకుని, తన సందేహాల పుస్తకములో రాసుకున్నాడు. వాడికున్న మంచి అలవాటు వచ్చే సందేహాలను ఓ పుస్తకంలో రాసుకోవడం. కొన్నాళ్ళు గడిచాయి. వాడు తొమ్మిదో తరగతిలోకి వచ్చాడు. ఒకసారి వాళ్ళ పాఠశాలకు సైన్స్‌ ప్రయోగాలు చేసే గెస్ట్‌మాస్టారు వచ్చాడు. అప్పుడు తన సందేహం వెళ్లబుచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు. ‘భూమితో పాటే వాతావరణం పుట్టింది. ఆ వాతవరణంలోనే గాలి ఉంటుంది.

భూమి వేగంగా తిరుగుతుందని మనకు తెలుసు. అలా తిరిగేటప్పుడు వాతావరణం మారుతూ ఉంటుంది. అంటే ఈ వాతావరణంలో ఉన్న గాలి ఒక చోట నుండి మరో చోటుకు కదులుతుందన్నమాట. పీడనం అనేది గాలి దిశను మారుస్తుంది. ఇప్పుడు తెలిసిందా పీడనం (వత్తిడి) లో వచ్చే తేడాల వల్ల గాలి వీస్తుంది అని. భూమి మీద అధికంగాను, అల్పంగా ఒత్తిడి కలిగించే ప్రాంతాలు ఉన్నాయి. నీరు పల్లం వైపుకు ప్రయాణించినట్టుగానే, గాలి కూడా అధిక పీడన ప్రాంతాల నుండి అల్ప పీడన ప్రాంతాల వైపుకు ప్రయాణిస్తుంది. దీన్నే మనం గాలి వీస్తుంది అంటాం. ఈ అవకాశం ఇతర గ్రహాలలో లేదు. అక్కడ వాతవరణమే లేదు’ అని కొన్ని ప్రయోగాలు చేసి చూపించి, బుజ్జిగాడి సందేహం తీర్చాడు.

బుజ్జిగాడికి కొంత అర్థం అయింది. కొంత అర్థం కాలేదు. కొంతవరకు సందేహం తీరింది. అయిన పూర్తిగా సంతృప్తి చెందలేదు. పెద్దయ్యాక ‘గాలి పుట్టుక సంగతి అంతు తేల్చాలి’ అని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు. సందేహాల బుక్‌లో ఉన్న ఆ సందేహాన్ని కొట్టేయకుండా అలాగే ఉంచాడు.

– డా. దార్ల బుజ్జిబాబు92905 04570

➡️