కారు షికారు

Jan 7,2024 09:22 #Sneha
story

భాస్కర్‌ మూడేళ్ళ క్రితం ఐదు వేల రూపాయలు వామనరావుకి అప్పు ఇచ్చాడు. వామనరావు అప్పు తీర్చలేదు. అడిగితే నీ డబ్బు పువ్వుల్లో పెట్టి తీరుస్తాను అంటాడు. ఇంకా తీర్చలేదు అంటే పువ్వులు దొరకలేదంటూ చెవిలో పువ్వు పెడతాడు. చివరికి ఒకరోజు భాస్కర్‌ గట్టిగా గొడవ చేసేసరికి డబ్బు బదులుగా తన దగ్గర ఉన్న పాత మారుతీకారు ఇచ్చేశాడు. నీకూ నాకూ చెల్లు అన్నాడు. అదిగో భాస్కర్‌కి అసలు కథ అప్పుడు ప్రారంభమయ్యింది.

కారుకి రంగు వేయించి, ఇంటికి తీసుకురాగానే భార్య ఐరావతం పూజ చేసి దిష్టి తీసింది. ఐరావతం తన స్నేహితుల దగ్గరికి, రాజమండ్రిలో ఉన్న అక్క దగ్గరికి కారులో వెళ్ళవచ్చని ఈస్టమన్‌ కలర్‌ కలలు కంది.భాస్కర్‌ కారు ఓనరవ్వడంతో తన స్నేహితుడు నవీన్‌కి ఈర్ష్య కలిగించాలని ఫోన్‌ చేశాడు.’ఒరే నవీన్‌ ఈ ఆదివారం మా ఇంటికి వచ్చెయ్యి. సరదాగా రాజమండ్రికి కారులో వెడదాం.’ ‘కారు కొన్నావా?’ అడిగాడు నవీన్‌.’అవున్రా’ఆదివారం వచ్చింది. నవీన్‌ వచ్చాడు.’కారులో సౌకర్యంగా ఉంటుంది.

పెళ్ళి సంబంధం వాళ్ళని త్వరగా కలుసుకోవచ్చు’ అని నవీన్‌ సంబరపడిపోతున్నాడు. చవకలో కారు పొందినందుకు భాస్కర్‌ పరమానంద భరితుడవుతున్నాడు.కారు కాకినాడనుంచి బయలుదేరింది. భాస్కర్‌ ఉండేది అక్కడే. కారు పది కిలోమీటర్లు వెళ్ళగానే జంక్షన్‌లో ఎద్దులా ఆగిపోయింది. రేడియేటర్‌లో నీళ్ళు పోసి, క్లచ్‌ చెక్‌ చేసి చూశాడు. కానీ కారు కదలలేదు. నవీన్‌కి విసుగు వచ్చింది.

‘ఈ తొక్కలో కారుకి ఎందుకంత బిల్డప్‌? అవతల పెళ్ళి వారు వేరే సంబంధం చెప్తారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, పెళ్ళి, శోభనం, హానీమూన్‌ అన్ని అయిపోతాయి నీ కారు బయలుదేరేసరికి’ అని నవీన్‌ చిరాకు పడి, షేర్‌ ఆటోలో వెళ్ళిపోయాడు.ఐరావతం మొగుడి ప్రయోజకత్వం చూసి, ‘ఎన్ని బ్లాక్‌ బస్టర్‌ కలలు కన్నాను. అన్నీ డిజాస్టరయ్యాయి’ అని సినీ భాషలో వాపోయింది.ఆ తరువాత భాస్కర్‌ మెకానిక్‌ని పిలిపించుకొని, కారు బాగు చేయించుకుని సాయంత్రం ఆరు గంటలకి ఇల్లు చేరాడు.

వామనరావుకి ఫోన్‌ చేస్తే ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది.’వామనరావు షోరూమ్‌ నుండి కారు తీసుకొచ్చి ఇచ్చినట్టు, బ్రహ్మాండమైన కారు అని కారు కూతలు కూసాడు.’ అని వామనరావుని దులిపేసింది!

భాస్కర్‌ వారం రోజులు కారు నడపలేదు. ఆ కారు ప్రత్యేకత ఏమిటంటే హారన్‌ తప్ప మిగిలిన భాగాలన్నీ చప్పుడు చేస్తున్నాయి.

భాస్కర్‌ కొడుకు రవి డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ వెలగబెడుతున్నాడు. రవికో గర్ల్‌ ఫ్రెండ్‌, పేరు రవళి.’మీ నాన్నగారు కారు కొన్నారు కదా, సరదాగా లాంగ్‌ డ్రైవ్‌కి వెడదాం!’ అంది రవళి.’నీ మాట ఎప్పుడు కాదన్నాను డియర్‌ గల గల పారుతున్న గోదారిలా.. అని పాడుకుంటూ వెడదాం!’ అన్నాడు రవి రవళిని హగ్‌ చేసుకుంటూ.

ఆదివారం. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. లాంగ్‌డ్రైవ్‌ కోసం రవి, రవళి బయలుదేరారు. కారు పదిహేను కిలోమీటర్లు వెళ్ళగానే ఆగిపోయింది. పది కిలోమీటర్లు దాటగానే ఆగిపోవాలని ఎవరు చెప్పారో ఆ కారుకి.

‘నాన్నగారు రిపేరు చేయించారు కదా! మళ్ళీ ఏమయ్యింది?”రవళీ కొద్దిగా కారుని తోస్తావా? స్టార్టవుతుందేమో’ అన్నాడు రవళిని బతిమాలుతూ.. రవళి విసుగ్గా కారు దిగి, కారుని తొయ్యడం మొదలుపెట్టింది. కారు ఇంజను కదలనని మొండికేసింది.

అటుగా సైకిల్‌ మీద వెడుతున్న పాల వ్యాపారి వీళ్ళని చూసి ‘అబ్బాయి గారూ ఆ పాతకారుతో ఏం తంటాలు పడతారు? ఎంచక్కా నా సైకిల్‌ మీద అమ్మాయి గారిని తీసుకెళ్ళండి లాంగ్‌ డ్రైవ్‌కి’ అని ఉచిత సలహా పారేశాడు.

‘నీ పాలు, నీళ్ళు వ్యాపారం చూసుకో మూసుకుని’ అన్నాడు రవి కోపంగా.అప్పటికే రవళీ కోపం నషాళానికి అంటింది.’ఈ డొక్కు కారుకా, లాంగ్‌ డ్రైవ్‌ అని ఊరించావు. అనవసరంగా లిప్‌స్టిక్‌ వేసుకుని మరీ తయారయ్యాను. నువ్వు వద్దు, నీ డొక్కు కారూ వద్దు’ అని కారుని నాలుగు తన్ని, ఆటోలో వెళ్ళిపోయింది.

 

‘ఏమిటి నాన్నా, నీ డొక్కుకారుతో నా పరువు పోయింది. గర్ల్‌ ఫ్రెండ్‌ పోయింది.”చాల్లేరా నీకు గర్ల్‌ఫ్రెండ్‌ ఒకర్తీ కాకపోతే ఇంకొకర్తి దొరుకుతుంది. ఫ్రెండ్‌ దగ్గర నా పరువు పోయింది.”ఆ వామనరావు మిమ్మల్ని వెర్రిగొర్రెను చేశాడు’ సాగదీసింది ఐరావతం.

భాస్కర్‌ కారు మెకానిక్‌ని కలిసాడు. మాటిమాటికి ఎందుకు రిపేర్లు వస్తున్నాయని అడిగాడు.మెకానిక్‌ ముకుందం తాపీగా విల్స్‌ వెలిగించుకుని, ‘మీరు జ్వరమని డాక్టర్‌ దగ్గరకు వెడతారు. మళ్ళీ జ్వరం రాదని గ్యారంటీ ఇస్తాడా? ఇదీ అలాంటిదే!”మీరు మళ్ళీ మళ్ళీ రాకపోతే మాకు డబ్బులు ఎలా వస్తాయి?’ అని మనస్సులో అనుకున్నాడు ముకుందం.

జ్వరానికి, కారు రిపేరుకి ఏమి సంబంధమో అర్థం కాలేదు. కారు రిపేరులతో విసిగిన భాస్కర్‌ కారుని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టాడు. ఓఎల్‌ఎక్స్‌ నుండి స్పందన రాలేదు.కారు రిపేరు చేసేవాడు చిన్న స్థలం కొన్నాడు. పాత కారుతో విసిగిపోయి కారును భాస్కర్‌, కోరంగి సమీపంలో పాత ఇంటి దగ్గర వదిలేసి వచ్చాడు.హమ్మయ్య అని ఊపిరి పీల్ఛుకున్నాడు.

వారం రోజుల తర్వాత కోరంగి పోలీస్‌స్టేషన్‌ నుండి భాస్కర్‌కి ఫోన్‌ వచ్చింది. ఎందుకా అని బిక్కుబిక్కుమంటూ స్టేషన్‌లోకి అడుగుపెట్టాడు.అక్కడ ఎస్‌ ఐ నరసింహం పెద్ద పెద్ద మీసాలతో వీరప్పన్‌లా ఉన్నాడు. పక్కన కానిస్టేబుల్‌ కనకారావు ఉన్నాడు. స్టేషన్‌ సింహం ఉన్న గుహలా అనిపించింది భాస్కర్‌కి.’మీ పేరు?’ అడిగాడు నరసింహం.

‘బద్దం భాస్కర్‌”అబద్ధం భాస్కరా?”కాదండి, బద్దం భాస్కర్‌”మీకు కారు ఉందా?”లేదండి”అందుకే నిన్ను అబద్ధం భాస్కర్‌ అన్నారు. నీ కారు నెంబర్‌ ఎపి9ఎక్స్‌420 కదా!”నీ గుణానికి తగ్గట్టే నీకు కారు నెంబర్‌ వచ్చింది.’ నరసింహం చెప్పింది భాస్కర్‌కి అర్థంకాలేదు. కనకారావు కేసి చూశాడు.’అదే మీ కారు నెంబర్‌ చివరి మూడు అంకెలు 420 కదా, దాని గురించి చెప్తున్నారు!’ అని మసాలా కలిపాడు.

ఎస్‌ ఐ తనను 420 అంటున్నాడని భాస్కర్‌ గ్రహించాడు.’నువ్వు కారుని వదిలేసావు! అందులో అబ్దుల్‌ అనే వ్యక్తి శవం దాచి”శవమా?!’ భాస్కర్‌కి చెమటలు పట్టాయి.పాత కారుతో తను పడ్డ పాట్లన్నీ చెప్పాడు. ‘చూడు రైటర్‌! మనోడు కతలు చెబ్తున్నాడు.’ అన్నాడు నరసింహం నవ్వి, పెద్దకుండ లాంటి బొజ్జను కదుపుతూ!’చూడు భాస్కర్‌ నిజం చెప్పడం నీకే మంచిది. లేకపోతే థర్డ్‌ డిగ్రీ, ఫోర్త్‌ డిగ్రీ ప్రయోగించాల్సి ఉంటుంది.”డిగ్రీలు స్టేషన్‌లో ఇస్తారా? యూనివర్సిటీలలో ఇవ్వరా?’ అన్నాడు భాస్కర్‌ అమాయకంగా. ‘నీకు లోకజ్ఞానం తక్కువలా ఉంది ప్రాక్టికల్‌గా చూపిస్తా!”లాఠీ వీపు మీద పడితే థర్డ్‌ డిగ్రీ, అదే సీరియల్‌ కంట్లో పడితే ఫోర్త్‌ డిగ్రీ’భాస్కర్‌కి అర్థం కాలేదు.

‘నిన్ను కుర్చీకి కట్టి, విరామం లేకుండా తెలుగు సీరియల్స్‌ (ఈటీవీ, మా, జెమిని, జీ, మరియు ఫ్లష్‌ ఛానల్స్‌), ఖతర్నాక్‌ వాంతి, శాంతి హాస్య కార్యక్రమాలు చూపిస్తే, మధ్యలో కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో నీళ్ళు కొట్టి మరీ చూపిస్తే మెదడు దొబ్బి, మొత్తం నిజం కక్కుతావు. ఇది ఫోర్త్‌ డిగ్రీ!’భాస్కర్‌ ఫోర్త్‌ డిగ్రీ తలుచుకొని వణికిపోయాడు. ‘కళ్ళ ముందు మోదుగుపవ్వు, ఆ రోజా, ఎన్నో జన్మల కాజా, మనసంతా మసి’ తలుచుకొని మరీ వణికిపోయాడు.

సరిగ్గా అదే సమయంలో స్టేషన్‌లోకి అడుగుపెట్టాడు వామనరావు. వామనరావు నరసింహానికి వాస్తు సిద్ధాంతి. వామనరావుని చూడగానే భాస్కర్‌కి ఆవేశం కట్టలు తెంచుకుంది.’ఒరే నిన్ను పొడిచెయ్యాలి’ అని వామనరావు కాలర్‌ పట్టుకున్నాడు.’చూశారా, పొడిచెయ్యాలి అంటున్నాడు. దీన్నిబట్టి మనకు అర్థమవుతోంది కదా ఇతనికి నేర చరిత్ర ఉందని’ అని కనకారావు మళ్ళీ మసాలా కలిపాడు.’నరసింహం గారు భాస్కర్‌ నా బెస్ట్‌ఫ్రెండ్‌. ఈసారికి వదిలెయ్యండి. పాత కారు ఫ్రస్టేషన్‌లో అలా చేశాడు. అతనికి పూచీకత్తు నేను ఇస్తున్నా!’ అన్నాడు.’సాయంత్రం మీ ఇంటికి వచ్చి,వాస్తు సెట్‌ చేస్తాగా!’వామనరావు గారి మాట విని, విడిచి పెడుతున్నా. తేడా వస్తే ఫోర్త్‌ డిగ్రీ’ అన్నాడు నరసింహం భాస్కర్‌ని విడిచిపెడుతూ.బతుకు జీవుడా అని భాస్కర్‌ బయటపడ్డాడు.

తరువాత భాస్కర్‌ పాతకారుని స్క్రాప్‌గా పదివేలకు అమ్ముకున్నాడు! అలా కారు కథ ముగిసింది.

  • వీరేశ్వర రావు మూల, 9494746228
➡️