పిల్లల భవిష్యత్తు

Nov 26,2023 09:58 #Sneha
children future

నేతాజీ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. బాలల దినోత్సవం సందర్భంగా బడిలో జరిగే పోటీలో పాల్గొనాలని అనుకున్నాడు. టౌన్‌ బస్సు కోసం ఎదురు చూడసాగాడు. ఒక గంట గడిచినా బస్సు రాలేదు. ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లి తండ్రితో చెప్పగానే, స్కూటర్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు.’పోటీలు ముగిసే సమయానికైనా వచ్చావు. ఇప్పుడు నీవే ప్రసంగించాలి. ఆ తరువాత దేశభక్తి పాటల పోటీలు మొదలవుతుంది.’ అన్నాడు హెడ్‌ మాష్టారు. మైక్‌ ముందు నిలబడ్డాడు నేతాజీ. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.’అందరికీ నమస్కారం! ఈ బాలల దినోత్సవం సందర్భముగా నెహ్రూ మామయ్య ఇప్పుడు వచ్చారంటే ఏం చెబుతారు అన్న అంశం మీద రెండు నిమిషాలు ప్రసంగించాలి అని చెప్పారు. నెహ్రూ మామయ్యకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల భవిష్యత్తుకు కృషి చేయాలని ఎప్పుడూ చెబుతుంటారు. అందులో భాగంగా నేను ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను. ఒక ఇంటిలో రెండవ తరగతి చదివే అబ్బాయి, మూడు సంవత్సరాల వయసున్న చిట్టిపాప వున్నారు. ఆ ఇంటికి నెహ్రు మామయ్య వచ్చారు. ముద్దు మాటలతో చిట్టిపాప మాట్లాడటం చూసి, మురిసిపోయారు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులతో ఇలా మాట్లాడారు. ‘మీరు మీ పిల్లలను ప్రేమిస్తున్నారు. కానీ వారి ఆరోగ్యం పైన అవగాహన లేదు. మీ ఇంటిలో దోమల సమస్య కోసం మీరు దోమల బత్తీ వాడటం మంచిది కాదు. మీరు వాడుతున్న ఒక దోమల బత్తీ పొగ నూరు సిగరెట్ల పొగకు సమానం. అన్ని సిగరెట్ల పొగను పీల్చే ఆ చిన్నారుల ఆరోగ్యానికి ఆపద కలిగిస్తుంది. అనారోగ్యం వలన వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. వాటిని వాడకండి’ అని నెహ్రూ మామయ్య సలహా చెప్పారు” అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు నేతాజీ.ఆ ప్రసంగం ముగియగానే విద్యాధికారి దగ్గర కెళ్ళి క్షమాపణ చెప్పుకొంటూ తన నిర్ణయాన్ని తెలిపాడు హెడ్మాష్టర్‌. హెడ్మాష్టర్‌ మైక్‌ ముందు నిలబడి ‘ఈ హాలు ఎప్పుడూ మూసి వుంచడం వల్ల ఇందులో దోమలు ఎక్కువగా ఉన్నాయి. అతిథులకు దోమలు కుట్టకుండా టేబుల్‌ కింద, కొన్ని మూలల్లో దోమలబత్తీ వెలిగించాము. నేతాజీ మాట్లాడిన మాటలలోని నిజాన్ని గ్రహించాము. ఇప్పుడే వాటినన్నిటినీ తీసివేస్తున్నాము. మన కార్యక్రమం బయట మైదానంలో చెట్ల కింద ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ వరుసలో వెళ్లి చెట్లు కింద కూర్చోండి’ అన్నారు హెడ్మాష్టర్‌. చెట్టు కిందకు మైక్‌ ఏర్పాట్లు చేయసాగారు. పోటీ ఫలితాలు రాకున్నా నేతాజీకి తప్పకుండా బహుమతి వస్తుందని అందరూ అనుకున్నారు.

– ఓట్ర ప్రకాష్‌ రావు, 09787446026

➡️