పూట బత్తెం పుల్ల వెలుగు

Jun 27,2024 04:30 #jeevana

భత్యం లేదా బత్తెం అంటే చేసిన పనికి లభించే వేతనం. పూట బత్తెం అంటే ఒక పూటకు వచ్చే కూలి లేదా ఆదాయం. పుల్ల వెలుగు అంటే కొద్ది సేపు మాత్రమే ఉండే వెలుగు. ఒకపూట సంపాదించి రేపటికై దాచుకోకుండా వెంటనే ఖర్చు చేసేవాళ్ళ విషయంలో ‘పూట బత్తెం పుల్ల వెలుగు’ అనే సామెత వాడతారు.
పూర్వం లడ్డ అనే గ్రామంలో వీరేసు కుటుంబం నివసిస్తూ ఉండేది. వీరేసుకి ముగ్గురు కొడుకులు. వీరికి చదువు సంధ్య అబ్బలేదు. చిన్నా చితకా వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదించేవారు. వీరేసుకి విలాసంగా బతకడమంటే చాలా ఇష్టం. ‘తడి తక్కువ, తమాషా ఎక్కువ’ అన్న చందాన వాయిదాల పద్ధతిలో విలాస వస్తువులన్నీ కొనుగోలు చేసేవాడు. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ‘నేను అందరికంటే గొప్పవాడిని, నాకేంటి లోటు, దర్జాగా బతకాలి’ అన్న భావన నరనరాన జీర్ణించుకు పోయినవాడు. బంగారం కానీ, స్వంత ఇల్లు కాని, బ్యాంక్‌లో కనీస నిల్వగాని లేకపోయినా వాయిదాల పద్ధతిలో కారు కొని వారాంతంలో కుటుంబంతో కలిసి పట్నానికి వెళ్లి సంబరాల రాంబాబులా విందు వినోదాలతో గడిపేవాడు.
తండ్రి తానా అంటే పిల్లలు తందానా అంటూ వాళ్లూ అలాగే తయారయ్యారు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేవారు. అప్పులు చేయడంలో వారంతా అందెవేసిన చేయి. అలా ప్రతినెలా రాబడి కంటే మూడురెట్లు అప్పుల వాయిదాలు కట్టవలసి వచ్చేది. ‘అవ్వ అరగదీసిన గంధం తాత వ్రణానికి సరిపోయిందన్నట్లు’, నలుగురు కష్టపడి సంపాదించిన సంపాదన వాయిదాలు కట్టడానికే సరిపోయేది. చేతిలో చిల్లిగవ్వ మిగిలేది కాదు. పండగన్నా పబ్బమన్నా, అనారోగ్యమన్నా అంటే అప్పుకు పరిగెత్తాల్సిందే. ఇలాంటి జాగ్రత్త లేని, ముందు చూపులేని వ్యక్తుల నుద్దేశించి వాడే సామెత ‘పూట బత్తెం పుల్ల వెలుగు’. పూట బత్తాన్ని పుల్ల వెలుగు ఆరే లోగా (తక్కువ సమయంలో) ఖర్చు చేస్తారని ఈ సామెత అర్థం. మన సమాజంలో ఇలాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ‘అయ్యవారుల గారి నట్టిల్లు’ అనే సామెత కూడా ఇదే అర్థంలో వాడతారు.
– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

➡️