పునాది ప్రధానం..

Jan 21,2024 07:37 #Children, #Sneha
children good habits

పిల్లల వ్యక్తిత్వం తీర్చబడేది బాల్యంలోనే.. బాలల భవిష్యత్తు బంగారం కావాలంటే పునాది పడాలి. అది బాల్యంలోనే సాధ్యమవుతుంది. పిల్లలకు తొలి ఐదేళ్లు వారిలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. అలాగే వ్యక్తిత్వం కూడా తీర్చిదిద్దబడుతుంది. రోగ నిరోధకశక్తికి మంచి ఆహారం కారణమైతే.. వ్యక్తిత్వానికి వారిపై ప్రభావం చూపే అంశాలు కీలకమైనవి. ఆహారం సరిగా అందివ్వకపోతే పిల్లలు ఎలా రోగాలబారిన పడతారో.. అలాగే సరైన వాతావరణం వారి చుట్టూ ఉండకపోతే వారు పెరిగి, పెద్దయ్యాక పర్యవసానాలు మరోలా ఉంటాయి. అందుకే వారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లలు వికసించాల్సిన మొగ్గలు.. ఆ మొగ్గల్ని వసివాడిపోకుండా సహజంగా వికసించేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండేందుకు మనం మంచి ఆహారం ఇస్తుంటాం. అయితే చుట్టూ ఉన్న పర్యావరణ ప్రభావం వారిపై తప్పక పడుతుంది. నేడు పర్యావరణ కాలుష్యం పెరిగిపోయాక అనేకరకాల కొత్త రోగాలకు గురవుతున్నాం. ప్రధానంగా పిల్లలు అలాంటి ప్రభావాల వల్ల మరణిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. అందుకే కనురెప్పల్లా పిల్లల్ని కాపాడుకోవాల్సి ఉంది. అలాగే ఈ రోజు అనేక భావజాలాలు మన చుట్టూ ఉన్నాయి. ఏది మంచో, ఏది చెడో తెలియని ఒక మభ్య ప్రపంచంలో మనం ఉన్నాం.

కుటుంబమే కీలకం..

పిల్లలు పెరిగే క్రమంలో కుటుంబ వాతావరణం అత్యంత కీలకం. పెద్ద వాళ్లను పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. పెద్దవాళ్ల నడవడిక, మాటతీరు మంచిగా ఉంటే పిల్లలకు కూడా మంచి వ్యక్తిత్వం అలవడుతుంది. తమకన్నా పెద్దవాళ్లని ఎదిరించి మాట్లాడుతుంటే.. వాళ్లూ దాన్నే పాటిస్తారు. మిమ్మల్ని గౌరవించడం లేదని తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు. అబద్ధాలు చెప్పడం వంటివి కూడా పెద్దవాళ్లు చాలా తేలికగా పిల్లల ముందే చెప్పేస్తుంటారు. ఒకోసారి పిల్లలతో పెద్దలే అబద్ధాలు చెప్పిస్తుంటారు. దీంతో అబద్ధాలు చెప్పడం తప్పుకాదని వారనుకుంటారు. అందుకే కుటుంబంలో తల్లిదండ్రులు, ఇంకెవరైనా పెద్దవాళ్లు పిల్లల గురించి అప్రమత్తంగా వ్యవహరించాలి. తమని తాము సరిజేసుకుంటూ, జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు ఏదైనా కొత్త విషయం పట్ల ఆసక్తిని కనబరుస్తుంటారు. అలాంటప్పుడు వారి సందేహాలను సముచితంగా తీర్చే బాధ్యత పెద్దవారిదే.

పరిసరాలు ప్రధానం..

పిల్లలపై పరిసరాల ప్రభావం చాలా ఉంటుంది. మనం ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు పాటించి, మంచి విషయాలు నేర్పినా.. పిల్లలు ఇరుగు పొరుగు పిల్లలతో, కుటుంబాలతో కలిసినప్పుడు అన్నీ గమనిస్తూ ఉంటారు. పిల్లల నుంచి పిల్లలకు త్వరగా కొన్ని చెడ్డ అలవాట్లు అలవడుతుంటాయి. అందుకే పిల్లల్ని.. వారు ఎవరెవరితో ఉంటున్నారు. ఆ పిల్లలు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తూండాలి. పిల్లలు ఏదైనా చెడ్డ పనులు నేర్చుకుని వచ్చి, అలాగే వ్యవహరిస్తుంటే.. వెంటనే సరిచేయాలి. అది సున్నితంగా ఉండాలే కానీ   దండించకూడదు. వారికి మంచీ చెడూ విడమర్చి చెప్తుంటే అర్థం చేసుకుంటారు.

ప్రేమించండి.. ప్రేమించనివ్వండి..

పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తే అంత ఆరోగ్యకరంగా ఎదుగుతారు. వారూ ప్రేమనే పంచాలనే విజ్ఞతను ప్రదర్శిస్తారు. అలాగని అసలు కోపతాపాలే రావొద్దని కాదు. కోపం ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించేలా వారికి విచక్షణ నేర్పాల్సింది తల్లిదండ్రులే. ఇంట్లో ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉంటే, పిల్లలు అదే నేర్చుకుంటారు. అలాకాకుండా ప్రతి విషయాన్నీ సమస్యగా చేసుకుంటే వారూ అదే అలవరచుకుటారు. వారి మనసు కఠినంగా మారుతుంది. వారి మాటే నెగ్గాలని మొండిగా తయారవుతారు అంటున్నారు నిపుణులు.

దొంగతనాలు..

పిల్లలు దొంగతనాలకు పాల్పడటానికి పెద్దవారే కారణం. కొందరు పెద్దలే వీరిని అలాంటి పనులకు పురికొల్పుతుంటారు. అందుకే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అసలు వారికి అలాంటి ఆలోచనే రాకుండా మనది కాని దానికోసం ఎప్పుడూ ఆశ పడకూడదని చిన్నప్పటినుంచీ వారికి తెలియచేయాలి.

ఆరోగ్యమే మహాభాగ్యం..

పిల్లలను ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచడం ఎంతో ముఖ్యం. మంచి ఆరోగ్య అలవాట్లు అలవర్చుకోవాలి. ఉదయాన్నే లేవటం దగ్గరనుంచి ఇంటి ఆహారం మాత్రమే తీసుకునేలా అలవాటు చేయాలి. ఏఏ పదార్ధాలు మనకు ఎలా ఉపయోగ పడతాయనే విషయాలు వారికి తెలియ చెప్పాలి. వ్యాయామం, ఆటలు ఎంత అవసరమో.. దానికి తగిన ఆహారం తీసుకోవటం అంతే అవసరమని నేర్పాలి. వీటన్నింటికీ బాల్యంలోనే బీజం పడాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ, పండ్లు, కాయలు, ఆకుపచ్చని ఆకుకూరలు తినడానికి ఇంట్లో పెద్దవాళ్లు అలవాటుపడితే, పిల్లలూ అవే తింటుంటారు అనేది నిపుణులు చెప్తున్న మాట.

➡️