మనల్నే అనుకరిస్తారు..

Jan 28,2024 06:45 #Children, #Sneha
parenting

ఫాలో.. ఫాలో.. అన్నట్లు.. పిల్లలు పెద్దల్ని అనుకరిస్తుంటారు. బాల్యంలో వాళ్లు చూసి నేర్చుకునేదే ఎక్కువ. అదీ తమతో నిత్యం ఉండే తల్లిదండ్రులను చూసే ఎక్కువ నేర్చుకుంటారు. పిల్లలు సహజంగా పెద్దవాళ్లు ఏదైనా చేయగానే.. అది ఏదైనా ఇట్టే పట్టేస్తారు. అలాగే అనుకరిస్తారు. అందుకే పెద్దలు.. అదీ ముఖ్యంగా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. అవే పిల్లలూ ఆచరిస్తారు.

మనం పెద్దగా నవ్వామనుకోండి. పిల్లలు కూడా అలాగే పెద్దగా నవ్వుతారు. అదే పనిగా ఆ కొత్తది ప్రదర్శించడానికి తాపత్రయపడతారు. ఏదైనా కొత్త పదం.. అనకూడనిదైనా.. ఆవేశంగా పెద్దలు ఎవరైనా అన్నారో.. అదీ పట్టేస్తారు. వాళ్లూ ఏమాత్రం సంకోచించకుండా అనేస్తారు. వాళ్లకి అనకూడదనే విజ్ఞత తెలీదు. పిల్లలు పసిగడతారనే స్పృహ మనకే ఉండాలి.

తిండి విషయంలో..

పెద్దలే తినేటప్పుడు అది తినను.. ఇది తినను అని ఎంచుతుంటారు. పిల్లలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారన్నది గుర్తుపెట్టుకోవాలి. పోషకాహారాన్ని పంచే ఆహారం తీసుకోవడం ప్రధానం. ఇలా వంకలు పెడుతూ తినడం పిల్లలపైనా ప్రభావం పడుతుంది. వాళ్లు కూడా అలాగే తినను అంటూ పేచీలు పెడతారు. అందుకే పెద్దలుగా మనం ఇలాంటి విషయాల్లో రోల్‌ మోడల్స్‌గా ఉండాలి. అవసరమైతే మన అలవాట్లనూ మార్చుకోవాలి. అలాగే బయట చిరుతిండ్లు తినడం అనేది కూడా ఒక చెడ్డ అలవాటు. రోడ్ల మీద దుమ్మూధూళీ ఈ పదార్థాలపై పడతాయి. అలాంటివి తినడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. అలాగే నూనెలో డీప్‌ ఫ్రై చేసినవి తినడం వల్ల కేన్సర్‌ వంటి ప్రమాదకరమైనవి వచ్చే అవకాశం ఉంది. అందుకే పెద్దలు ఇలాంటి అలవాట్లను మానుకుని, పిల్లలకు ఆదర్శంగా నిలవాలి అంటున్నారు నిపుణులు.

ఆహారం తినే పద్ధతులు కూడా.. టీవీ చూస్తూ తినడం.. తినే పదార్థాలను వేళ్లతో కతుకుతూ తినడం.. ఇలా కొందరు తినే పద్ధతి చూస్తే తినడం మీదే విరక్తి కలుగుతుంది. ఇలాంటి అలవాట్లు చూసి నేర్చుకునే దశలో ఉన్న పిల్లలు అదే ఫాలో అవుతారు. ఒకవేళ మనం సరిగానే ఉన్నా పిల్లలు వేరెక్కడైనా చూసి నేర్చుకునీ ఉండవచ్చు. అందుకే ఇవన్నీ సరిదిద్దుకోవాల్సింది.. సరిదిద్దాల్సిందీ పెద్దలే అనేది నిపుణుల మాట.

వ్యాయామం..

వ్యాయామం చేయాలని నిర్ణయం అయితే తీసుకుంటారు. ఒకరోజో, రెండు రోజులో చేస్తారు కూడా. కానీ కొన్నిరోజులు చేసి మానివేయడం.. కొందరైతే నెలల తరబడి వాయిదాలు వేస్తుంటారు. వాయిదా పద్ధతి టైమ్‌సెన్స్‌ లేకుండా చేస్తుంది. అలాగే ఉదయం లేవకపోవడం అనేది ఒక చెడ్డ అలవాటు. అయితే ఏదైనా పని ఒత్తిడి వల్లనో, ప్రయాణం చేసినప్పుడో పడుకుంటే అర్థం ఉంది. కానీ ప్రతిరోజూ ఆలస్యంగా లేవడం అనేది సరికాదు. పిల్లలు కూడా ‘నాన్న ఇంకా లేవలేదు.. నన్ను మాత్రం లేపేశావు’ అని పేచీలు పెడుతుంటారు. అందుకే పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటున్నారనే స్పృహ పెద్దలకే ఉండి, వేకువనే లేవడం మంచిదంటున్నారు నిపుణులు.

శుభ్రత పాటించడం..

కొందరు ముఖానికి చెమట పడితే వెంటనే టవల్‌కి తుడిచేస్తుంటాం. అలాగే హ్యాండ్‌వాష్‌ చేసుకోకుండా నాప్‌కిన్స్‌కు తుడిచేస్తారు. తీసిన వస్తువులను తీసిన చోట పెట్టరు. ఇల్లంతా పేర్చేస్తుంటారు. స్నానం చేయగానే టవల్‌ ఆరేయకుండా బెడ్‌ మీదో, సోఫా మీదో పడేస్తుంటారు. తిన్న తర్వాత పళ్లెం తీసి సింక్‌లోనో, టబ్‌లోనో పెట్టరు. ఎక్కడ తింటే అక్కడే వదిలేస్తుంటారు. ఇవే పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. అందుకే పెద్దలు ఇలాంటి విషయాల్లో సరిగ్గా వ్యవహరించాలనేది నిపుణుల మాట. చెమట పట్టినప్పుడు కొంచెం సోపుతో ముఖం కడుక్కుని, టవల్‌తో తుడుచుకోవాలి. అలాగే హ్యాండ్‌వాష్‌ చేసుకున్నాకే న్యాప్‌కిన్‌కి తుడుచుకోవాలి. స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవల్‌ బయట ఆరవేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా పెద్దలు వ్యవహరిస్తే పిల్లలూ అలాగే అనుసరిస్తారు. మంచి మంచి అలవాట్లను ఫాలో.. ఫాలో అవుతూ.. చక్కగా ఎదుగుతారు.

➡️