అంతర్జాలంలో బాల సాహిత్యం

తెలుగు సాహిత్యానికి వేల సంవత్సరాల చరిత్ర వుంది. జన జాగృతిలో సాహిత్యం పాత్ర ప్రత్యేకమైనది. మహావృక్షమైనా చిన్న విత్తనం నుంచే ఉద్భవిస్తుంది. పిల్లల్లోని సృజనశీలత కూడా బాల్యం నుంచే ఒనగూరుతుంది. పాఠశాల స్థాయి నుంచే ఎందరో బాలసాహితీకారులు పుట్టుకొచ్చారు. ‘బాలల హృదయాలు అక్షరాలతో మమేకం కావాలి’ అంటారు ఒడియా రచయిత సుఖేంద్రమోహన్‌ శ్రీచంద్రసింగ్‌. చిన్నారుల హృదయాలలో అంకురించే ఆలోచనలు వేల విస్ఫోటనాలకు నిలయం. దాన్ని ఒడిసిపట్టగలిగితే నేటి బాల్యం రేపటి సాహిత్యానికి బలమైనా పునాదిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘పిల్లలు ఊహాజనితులు’ అంటారు పంజాబీ రచయిత సత్‌పాల్‌ బికి. పిల్లల ఊహాల్లోంచి పుట్టుకొచ్చిన భావాన్ని ఒడిసిపట్టి కథగానో, కవితగానో మార్చగలిగే నేర్పును వారికి నేర్పించాలి. పిల్లల్లోని ఆసక్తిని, సృజనాత్మకతను గుర్తించి, ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తే… సమాజానికి గొప్ప సాహితీవేత్తలను అందించినవారమౌతాం.

ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. సైన్స్‌, కమ్యూనికేషన్‌ రంగాల అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోంది. పాతికేళ్ల వయసులో రేడియో, టీవీలు చూసిన తరానికి, .. పుట్టిన కొద్ది నెలలకే టీవీ, స్మార్ట్‌ఫోన్లను చూస్తున్న నేటి తరానికి.. ఆలోచనల్లోనూ, సృజనలోనూ చాలా వ్యత్యాసం వుంది. జంతువులు, పక్షులు, పాములు వంటి వాటిని కథల పుస్తకాల్లో చూసిన నిన్నటి తరానికి, యానిమల్‌ ప్లానెట్‌, డిస్కవరీ చానెల్స్‌, యూట్యూబ్‌ చానెల్స్‌లో వాటి జీవన విధానాన్ని స్పష్టంగా చూడగలుగుతున్న నేటి తరం పిల్లల ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ‘చదవటం అనేది కేవలం నేర్చుకోవటమే కాదు, అది జీవితకాలం నిలిచిపోయే ఆనందంగా మారవచ్చు’ అంటారు పిల్లల డాక్టర్‌ సంగీతా సుబుద్ధి. బాలసాహిత్యంలో జానపద కథలకు ఒక ప్రత్యేక స్థానం వుంది. హాస్యం, వినోదం, సరదా, సాహసం, అద్భుత కథలు పిల్లలతో చదివించాలి. ధారాళంగా, భావయుక్తంగా చదవడం నేర్పించాలి. చదివిన కొద్దీ… వీరిలో ఊహాశక్తి పెరుగుతుంది. ఆ ఊహలకు అక్షరాలను కూర్చగలిగే నేర్పును పిల్లలకు నేర్పించగలగాలి. పిల్లల ఊహలకు రెక్కలు తొడగాలి. ‘జ్ఞానం కంటే ఊహాశక్తి చాలా గొప్పది’ అంటాడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. ఎందుకంటే సాధారణంగా పిల్లలో తమకిష్టమైన పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. అనుభూతికి లోనవుతారు. అదే సందర్భంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. తద్వారా వారి ఆలోచనా శక్తి, ప్రశ్నించేతత్వం పెరుగుతుంది. సమాధానాలకోసం మరింత చదవడం, అర్థమైన, ఆకళింపు చేసుకున్న విషయాన్ని ఇతరులతో పంచుకోవడం లేదా తన భావాలను పేపర్‌పై పెట్టడం. తమ భావాలను ఇతరులతో పంచుకోడానికి పుస్తకాలతో పాటు… ఆన్‌లైన్‌ కూడా అనేక టూల్స్‌ లభ్యమౌతున్నాయి.
అందుబాటులో వున్న సాంకేతికతకు తమ ఊహలను జోడించి, సరికొత్త ఊహాప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు పిల్లలు. ఇంటర్నెట్‌లో పిల్లల కోసం అనేక వెబ్‌సైట్స్‌, యాప్స్‌, యూట్యూబ్‌ చానెల్స్‌ పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కూడా పిల్లల కోసం నిర్వహించేవి, పిల్లలకే ప్రధాన భూమికను పోషించేవి వున్నాయి. వాటిలో https://manchipustakam.in/ ఒకటి. పిల్లల పుస్తకాలకు చిరునామా ఈ వెబ్‌సైట్‌. అలాగే ‘స్టోరీ వీవర్‌’ అనేది పిల్లల ఉచిత ఆన్‌లైన్‌ పుస్తకాలతో పాటు రాయడం, చదవడం, అనువదించడం పట్ల ఆసక్తి వున్న వారికి సహకరించే వేదిక.
యూట్యూబ్‌లోనూ పిల్లల కథల వీడియోలు చాలానే వున్నాయి. Geethanjali Kids – Telugu వాటిలో ఒకటి. https://www.youtube.com/@geethanjalikids-telugu/ఈ లింక్‌లో 375 వీడియోలు వున్నాయి. ఇవన్నీ రకరకాల ప్రక్రియల్లో చెప్పబడిన కథలు. https://www.youtube.com/@MinnuandMintuTeluguRhymes లోను 178 కథల వీడియోలు దొరుకుతాయి. అలాగే, ప్రజాశక్తిలో ‘చిరుమువ్వలు’, https://prajasakti.com/category/sneha/chirumuvalu ‘చిన్నారి’, సాక్షిలో ‘కిడ్స్‌-స్టోరీస్‌’, ఈనాడులో ‘కిడ్స్‌-స్టోరీస్‌’ https://www.eenadu.net/kids-stories పేరుతో తెలుగు న్యూస్‌ వెబ్‌సైట్స్‌లోనూ పిల్లల కథల శీర్షికలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌లో పిల్లలు నిర్వహించే వీడియోలు కూడా వున్నాయి. ‘పిల్లల కంటెంట్‌’ అనే ప్రత్యేకమైన ఆప్షన్‌ కూడా యూట్యూబ్‌లో వుంది. పిల్లలు తమతమ ఊహలకు కొంత సాంకేతికతను జోడిస్తే… అద్భుతమైన కథల వీడియోలతో వారే ఒక చానెల్‌ నిర్వహించవచ్చు. ఇప్పుడు ఏఐ టూల్స్‌ కూడా అందుబాటులోకి రావడంతో రకరకాల యానిమేషన్‌ థీమ్స్‌తో కథలను క్రియేట్‌ చేసేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలాంటి వీడియోలు యూట్యూబ్‌లో చాలానే వున్నాయి. వీడియోలు ఎలా క్రియేట్‌ చేయాలో తెలిపే ట్యుటోరియల్స్‌ కూడా వున్నాయి. ఎవరు ఏ అంశంపై వీడియోలు చేయాలన్నా, వినాలన్నా, నేర్చుకోవాలన్నా…. యూట్యూబ్‌లోని సెర్చ్‌ ఆప్షన్‌ ద్వారా వాటిని పొందవచ్చు.
అదే సమయంలో పిల్లలు తమ చదువును పక్కన పెట్టడం, అదేపనిగా స్మార్ట్‌ఫోన్‌ వాడుతుండటం వల్ల చదువు పాడుచేసుకోవడంతో పాటు, కళ్లు అలసిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు సాయంగా వుండి, పిల్లల జీవనశైలిని సరైన పద్ధతిలో తీర్చిదిద్దాలి.

– రాజాబాబు కంచర్ల
9490099231

➡️