భయం వద్దు

May 26,2024 09:55 #balala katha, #Sneha

రాత్రి ఏడుగంటలు కావస్తోంది. చీరాల రైల్వేస్టేషన్లో, తెనాలికి టిక్కెట్‌ తీసుకుని ట్రైన్‌ కోసం బయటే కుర్చీలో కూర్చున్నాను. ఒక అమ్మయి హడావుడిగా వచ్చి, నా పక్కనే కూర్చుంది. బహుశా తన వయసు 20 నుండి 22 లోపు ఉంటాయి. ‘ఆంటీ మీరు ఎక్కడికిదాకా వెళ్ళాలి?’ అని అడిగింది. ‘తెనాలి’ అని చెప్పాను. ‘అయితే మీరు విజయవాడ వైపు వెళతారు కదా ఆంటీ!’ అంది ఆ అమ్మాయి.
‘అవును మా.. నువ్వు ఎక్కడిదాకా?’ అన్నాను నేను. ‘నెల్లూరు అవతల’ అంటూ తడబడుతూ ఏదో ఊరి పేరు చెప్పింది. నాకైతే అర్థంకాలేదు ‘ఓహో’ అన్నట్లు తలూపాను.
‘నా ట్రైన్‌ మూడు గంటలు లేటు, లేకుంటే నేను ఎప్పుడో ఇంటికి కూడా చేరేదాన్ని, చాలా సేపటి నుండి నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు. నాకు చాలా భయమేస్తోంది ఆంటీ!’ అని చెబుతుండగానే.. ఎక్కడి నుంచి వచ్చాడో ఆ సైకో, ఆ పిల్ల మీద పడబోయి, మరలా దూరంగా జరిగాడు. మా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. చూడడానికి పిచ్చివాడిలా ఉన్నాడు. ఆ పిల్ల వంక అదో రకమైన చూపులు చూస్తూ.. కంటితో అసహ్యమైన సైగలు చేస్తున్నాడు.
‘ఆంటీ చూస్తున్నారా వాడి చేష్టలు’ అంది తను.
‘నువ్వు అటువైపు చూడకమ్మా!’ అన్నాను. మా పక్కనే ఒక అయిదుగురు మగవాళ్ళు కూర్చున్నారు. రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు.
‘అంకుల్‌ వాడు నన్ను ఫాలో అవుతున్నాడు నాకు చాలా భయమేస్తోంది’ అని ఎదురుగా కూర్చుని ఉన్న సైకోని చూపించింది వాళ్ళకు. అక్కడున్న మగవాళ్ళు ఆ అమ్మాయితో మాట్లాడారు. కానీ, అవి ధైర్యాన్ని నింపే మాటలైతే కావు. ‘ఒక్కదానివే ఎందుకు ఉన్నావు ఇక్కడీ’ అని అడిగారు వారిలో ఒకరు. ‘ఎగ్జామ్‌ రాయడం కోసం ఉదయం వచ్చాను అంకుల్‌’ అని చెప్పింది.
‘అయినా వాడేం చేస్తాడులే.. నీ మెడలో ఉన్న గొలుసు కోసం కావచ్చు’ అన్నాడు మరో అతను. ఆ మాటకు నాకు నవ్వొచ్చింది. అంతకు మించిన బంగారం నా మెడలో కూడా ఉంది కదా!? వాళ్ళు అలా ఎలా ఆలోచించారా!? అని. ఆ పిల్లకు వచ్చిన సమస్యను వదిలేసి, వాళ్ళల్లో వాళ్లే ‘అయినా గోల్డ్‌ రేటు బాగా పెరిగింది.. ఇక ఇలాంటివి మామూలే.. ఇంట్లోవాళ్ళు ఆడపిల్లను ఒంటరిగా పంపకూడదు!’ అని ఇలా ఏవేవో మాట్లాడుకుంటున్నారు.
ఆ అమ్మాయి వంక చూశాను. పాపం తన కళ్ళల్లో బిత్తరచూపులు, చేతులు వణుకుతూ కనిపించాయి నాకు.
‘చాలా సేపటి నుండి వాడు నిన్ను ఫాలో అవుతుంటే మనమే టిక్కెట్‌ కౌంటర్‌ దగ్గర కంప్లైంట్‌ ఇవ్వాలి’ అన్నాను. ‘ఇందాక చెప్పాను ఆంటీ! వాళ్ళు అరిచి బయటకు పంపారు. మరలా వాడు లోపలికే వచ్చేశాడు’ అంది. నాక్కూడా ఇక ఇలా లాభం లేదని అర్థమయ్యింది.
‘నువ్వు ఏమాత్రం భయపడొద్దు.. నువ్వు సేఫ్‌ అనుకున్నాకే నేను ఇక్కడి నుండి వెళతాను సరేనా!’ అన్నాను. ‘సరే ఆంటీ’ అన్నది తను. కానీ తనలో భయం పోలేదని నాకు తెలుస్తోంది. నాకు ట్రైన్‌ వచ్చే టైమవుతుంది. నేను వెళ్ళిపోయాక ఆ పిల్ల ఇంకా అరగంట ఇక్కడే ఉండాలి. అప్పుడే తను ఎక్కే ట్రైన్‌ వస్తుంది. బాగా ఆలోచించి, ఎదురుగా కూర్చున్న సైకోగాడి ఫోటో నా సెల్‌ఫోన్లో తీసుకుని, టిక్కెట్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్ళాను. ‘నమస్తే సార్‌… అక్కడ కూర్చున్న అమ్మాయి వెంటపడుతున్నాడు ఇతను’ అని ఫోటో చూపించాను. ‘ఇందాక అరిచి పంపేశాము మేము’ అన్నాడు కౌంటర్లో అతను. ‘మరలా వచ్చాడు సార్‌! అన్నాను.
‘ఆ అమ్మాయికి తెలిసినవాళ్ళేమో?’ అన్నాడు కౌటర్లో అతను. ‘లేదు సార్‌! ఆ పిల్ల ఇక్కడ ఎగ్జామ్‌ రాయడానికి వచ్చింది. మరికాసేపట్లో నా ట్రైన్‌ వస్తోంది, నేను వెళ్ళిపోయాక ఇక్కడ ఆ పిల్ల భద్రత ఏంటీ సార్‌?’ అన్నాను. వెంటనే కౌంటర్‌ అతను రైల్వే పోలీస్‌ వాళ్ళకు ఫోన్‌ చేశారు. వెంటనే పోలీస్‌ వాళ్ళు వచ్చేశారు.
‘ఏంటి మేడం… ఏం జరిగింది?’ అని అడిగారు నన్ను. విషయాన్ని వివరంగా చెప్పి, వాడి ఫోటో చూపించాను.
ఆ పిల్ల అక్కడ నుంచి నా వంకే చూస్తోంది.. ఇలా రా అంటూ చేయి ఊపాను. తను నా దగ్గరకు వచ్చి నిలబడింది. ‘ఇక మనం ఫ్లాట్‌ఫారమ్‌ మీదకు వెళ్లిపోవచ్చు’ అన్నాను.
ఆ సైకోగాడిని పోలీస్‌ వాళ్ళు రెండు దెబ్బలు కొట్టడం మా కళ్ళతో చూసి అక్కడ నుండి కదిలాము. ‘లిఫ్ట్‌ వద్దులే ఆంటీ! మెట్ల మీదగా వెళదాము’ అంది ఆ పిల్ల. లిఫ్ట్‌లోకి కూడా సైకో వస్తాడు, మెట్ల మీద అయితే జనం ఉన్నారని అనుకుంటా.
‘భయం లేదు నేనున్నాను కదా’ అన్నాను. మేము లిఫ్ట్‌ నుండి బయటకు వచ్చేసరికి మా ఎదురుగా మరో రైల్వే పోలీస్‌ నిలబడి ఉన్నాడు. నాకు అర్థమయ్యింది ఆ పిల్లకు సెక్యూరిటీ కల్పించారని. ‘ఈ పిల్లకి ట్రైన్‌ ఎక్కడానికి ఇంకా టైమ్‌ ఉంది సార్‌! అన్నాను. నా సందేహం పోలీస్‌కి అర్థమైంది కాబోలు.
‘ఏం ఫర్వాలేదమ్మా, ఈ అమ్మాయిని నేను దగ్గర ఉండి ట్రైన్‌ ఎక్కిస్తాను’ అన్నాడు.
‘మీ పోలీస్‌ డిపార్ట్మెంట్‌ వాళ్లకు థాంక్స్‌’ అన్నాను. ఆ పిల్లకు కాస్త ధైర్యం చెప్పి, నేను నా ఫ్లాట్‌ఫారమ్‌కి కదులుతుంటే.. ‘ఆంటీ!’ అని పిలిచింది ఆ అమ్మాయి.
కృతజ్ఞతాభావంతో తన కంట్లో సుడులు తిరుగుతూ… ‘చాలా డేర్‌ చేశారు ఆంటీ!’ అన్నది. ‘ఇక మీదట నువ్వు కూడా అంతే ధైర్యంగా ఉండాలి’ అంటూ.. గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆనందంగా అక్కడి నుండి కదిలాను.

పద్మజా రామకృష్ణ. పి
94918 30278

➡️