ఎవరెస్ట్‌.. సమున్నత శిఖరం

May 26,2024 11:20 #Sneha, #Stories

జీవితంలో సాహసం చేయడం అంటే ప్రాణాలకు ముప్పు అని తెలిసి ముందుకు అడుగు వేయడం. అలాంటి వారు చరిత్రలో సాహస వీరులుగా నిలుస్తారు. అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కడం అంత సులువైనది కాదు. అడుగడుగునా ఆపదలు పొంచి ఉంటాయి. మంచు తుపానులు వస్తాయి. ఈదురుగాలులు వీస్తాయి. నిరంతరం ప్రకృతి మారుతూ ఉంటుంది. పైకి వెళ్లేకొద్దీ ఆక్సిజన్‌ ఉండదు. రక్తం గడ్డకట్టే విపరీతమైన చలి. శరీరం మొద్దుబారి, కదలలేని స్థితి. అయినా షెర్పా నార్గే, హిల్లరీ పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో అవరోధాలు ఎదుర్కొని, ఎవరెస్ట్‌ శిఖరారోహణ చేశారు. వారి ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చే సాహసాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది మే 29న ‘అంతర్జాతీయ ఎవరెస్ట్‌ దినోత్సవం’ జరుపుకుంటాం.
ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

మనిషి కన్నా ప్రకృతి బలమైనది. అది విసిరే సవాళ్లను ఎదుర్కోవాలంటే ముందు మానసికంగా సిద్ధపడాలి. అందుకు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వస్తే వెనుకాడకూడదు. దానివల్ల వచ్చే పరిణామాలు కూడా ధైర్యంగా స్వీకరించాలి. అటువంటిదే పర్వాతాన్ని అధిరోహించడం అంటే.
స్ఫూర్తినిచ్చే సాహసం..
జాన్‌హంట్‌ నాయకత్వంలోని పర్వతారోహకులు, బ్రిటీష్‌ అధికారుల బృందం 1953, మే 26వ తేదీ.. ఎవరెస్ట్‌ శిఖరారోహణ చేస్తూ, శిఖరానికి 1000 మీటర్ల దిగువన శిఖర దక్షిణభాగం వైపు తమ గుడారాలలో ఉన్నారు. వారిలో బౌర్డిల్లాన్‌, ఎవాన్స్‌ అనే పర్వతారోహకులు మరికొంత ఎత్తుకు వెళ్లి, సాధ్యమయ్యే పక్షంలో శిఖరారోహణ చేసేందుకు అన్ని ఏర్పాట్లతో వెళ్లారు. మిగిలిన బృందం వారి కొరకు ఎదురుచూస్తూ ఉంది. మధ్యాహ్నా సమయానికి వెళ్లిన ఇద్దరూ వెనుదిరిగి వచ్చారు. వారిలో ఇవాన్స్‌ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఎవరెస్ట్‌ దక్షిణ భాగంలో ఉన్న కొసమీదకు వెళ్లి వచ్చామని, అంతకంటే ముందుకు వెళ్లలేక పోయామని వగరుస్తూ చెప్పారు వాళ్లు. ఇప్పటివరకూ ఎవరూ వెళ్లలేకపోయిన ప్రదేశమది. అక్కడి నుంచి మరో 800 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్‌ కొనభాగం ఉంది.
మరుసటి రోజు.. హంట్‌ సూచనలో ఎడ్మండ్‌ హిల్లరీ, టెన్జింగ్‌ నార్గే శిఖరారోహణకు సిద్ధమయ్యారు. కానీ, విపరీతమైన ఈదురుగాలులు, మంచు కురుస్తుండడంతో మే 28న దక్షిణ కొసమీదకు చేరుకుని, మరుసటి రోజు (మే29న) న శిఖరాగ్రానికి పయనమయ్యారు. వారి ఆత్మ విశ్వాసానికి ప్రకృతి సహకారం కూడా కలిసింది. మెత్తటి మంచు నిలువుగా జారిపోతున్న స్థితిలో కూడా పట్టుదల వీడని హిల్లరీ, నార్గేలు ఎవరెస్ట్‌ శిఖరారోహణ చేశారు. ప్రపంచంలో అప్పటికి ఎవరికీ సాధ్యం కాదనుకున్న సాహసాన్ని ప్రదర్శించి చూపి, అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నారు. వీరిరువురిలో ఎడ్మండ్‌ హిల్లరీ న్యూజిలాండ్‌ జాతీయుడు కాగా, టెన్జింగ్‌ నార్గే ఒక షెర్పా. అంటే టిబెట్‌ మూలాలున్న నేపాల్‌ దేశీయుడు. వాస్తవానికి షెర్పాలు పర్వతారోహకులకు సహాయకులుగా మాత్రమే ఉండి వారిని అనుసరిస్తూ ఉంటారు. అయితే పర్వత అధిరోహణలో వీరికుండే నైపుణ్యం అపారం. అలాంటి షెర్పాలలో టెన్జింగ్‌ నార్గే ఆణిముత్యంలాంటి వ్యక్తి. ‘చోమోలుంగ్మా’ గా పిలవబడే ఎవరెస్ట్‌ అంటే షెర్పాలకు ఆరాధనతో కూడిన భక్తి.
టెన్జింగ్‌ నార్గే చిన్నప్పట్నించీ ఎవరెస్ట్‌ అధిరోహించాలని కలలు కనేవాడు. ఇక ఎడ్మండ్‌ హిల్లరీ బ్రిటీష్‌ సైన్యంలో వివిధహోదాల్లో పనిచేస్తూ, పర్వతారోహణపై అమిత ఆసక్తి ఉన్న అధికారి. వీరిద్దరూ కలిసి సృష్టించిన చరిత్ర ప్రపంచ మానవాళికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. 8850 మీటర్ల ఎత్తులో సమున్నతంగా నిలిచిన ఎవరెస్ట్‌ పైకి ఎక్కడం దుస్సాధ్యం అని అందరూ గట్టిగా నమ్మిన క్రమంలో వృత్తి జీవితం నుంచి తప్పుకున్నాక హిల్లరీ హిమాలయన్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి షెర్పాల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేశాడు. అలాగే టెన్జింగ్‌ నార్గే ఔత్సాహిక పర్వతారోహకులకు శిక్షణ నివ్వడమేగాక, షెర్పాల సంక్షేమం కొరకు కృషి చేశాడు. 2008లో హిల్లరీ చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం మే 29న ‘అంతర్జాతీయ ఎవరెస్ట్‌ దినోత్సవం’ జరపడం ప్రారంభమైంది.


ప్రత్యేకత ఏంటంటే..
భూమిపై ఎన్నో పర్వతాలు ఉండగా ఎవరెస్ట్‌ శిఖరానికి ఇంత ప్రాధాన్యత దేనికి? అంటే.. ఎవరెస్ట్‌ ఈ భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం. ఇది 8850 మీటర్లు (29,000 అడుగులు) ఎత్తున్న పర్వతరాజం. మంచు పొరలతో ఈ పర్వత ఆరోహణ ఏమాత్రం సులభతరం కాదు. అడుగడుగునా ఆపదలు పొంచి ఉంటాయి. 8000 మీటర్లు ఎత్తు దాటాక ఆక్సిజన్‌ పలచబడిపోవడం, చలి ప్రభావంతో శరీర అవయవాలు మొద్దుబారి శాశ్వితంగా నిర్జీవమైపోవడం (ఫాస్ట్‌ బైట్‌),గాలి పీడనం మూడవ వంతుకు పడిపోవడంతో హై ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ (ఎత్తు ప్రదేశాలలో వచ్చేజబ్బు)కు గురికావడం.. ఇలా ఎన్నో ఇబ్బందులతో ఈ ప్రయాణం కూడి ఉంది.

ఇప్పటి వరకూ సుమారుగా 300 మందికి పైనే ఎవరెస్ట్‌ ఎక్కే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. 1924లో ఎవరెస్ట్‌ను ఇంకో వైపు నుంచి జార్జ్‌మలోరీ, ఆండ్రూ ఇర్విన్‌ అధిరోహించి ఉండవచ్చని అందరి నమ్మిక. కానీ, వారు మళ్లీ శిఖరం నుంచి క్రిందకు రాలేదు. అందరూ నమ్మినట్లే 1999లో మలోరీ శరీరం ఎవరెస్ట్‌ పర్వతారోహకులకు లభించింది. ఎవరెస్ట్‌ను అధిరోహించడంలో ఏ చిన్న తప్పిదం చోటుచేసుకున్నా, కోలుకోలేని ఫలితం ఎదురవుతుంది. నేపాల్‌లో ఎవరెస్ట్‌ను ‘సాగర్‌ మాత’ అని పిలుస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు పేర్లతో పిలవబడుతున్నా.. బ్రిటీష్‌ సర్వేయర్‌ జనరల్‌ ‘సర్‌ జార్జి ఎవరెస్ట్‌’ పేరు మీద ‘ఎవరెస్ట్‌’ గా స్థిరపడిపోయింది. జార్జి ఎవరెస్ట్‌ ఈ శిఖరం ఎత్తును కొలిచి, భౌగోళిక శాస్త్రంలో పొందుపరిచినందుకు ఈ గౌరవం లభించింది.

 


ఈ రోజు మనమేం చేయాలి..
* ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా హిల్లరీ, నార్గే సాహసాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు. పర్వతారోహణలో ప్రాణాలు కోల్పోయిన సాహసికులకు నివాళులు అర్పించవచ్చు.
– పర్వతారోహకులను సత్కరించి, పర్వతారోహణపై సమావేశాలు, సెమినార్లు, కార్యశాలలు ఏర్పాటు చేసి, నిపుణులచే సూచనలు, సలహాలు ఇప్పించవచ్చు.
– పర్వతారోహణకు సంబంధించిన డాక్యుమెంటరీలు, లఘుచిత్రాలను ప్రదర్శించి, ప్రజలకు ఈ సాహాసక్రీడ పట్ల ఆసక్తిని రేకెత్తించవచ్చు.
– దగ్గరలో ఉన్న కొండలు లేదా తిప్పలపైకి మరికొందరిని కలుపుకుని ట్రెక్కింగ్‌కు వెళ్లవచ్చు. ఇది పర్వతారోహకులకు నిజమైన నివాళి అవుతుంది.
– పాఠశాలలు, విద్యాసంస్థల్లో భౌగోళిక శాస్త్రం, పర్వతారోహణ, ఎవరెస్ట్‌లకు సంబంధించిన ప్రాజెక్ట్‌ పనులు, క్విజ్‌లు, వ్యాసరచన లాంటి పోటీలు నిర్వహించవచ్చు.(సాధారణంగా మే 29వ తేదీన పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి. పాఠశాలలు తెరిచాక ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు.)
– పర్వతారోహణకు సంబంధంచిన ఫొటోలు, లఘుచిత్రాలు, వీడియోలు, కథలు.. మొదలైన వాటిని సామాజిక మాధ్యమాలలో ఎంచుకోవచ్చు.
ఈ కార్యక్రమాలన్నీ ఎవరెస్ట్‌ను అధిరోహించి మానవుడి ఆత్మవిశ్వాసాన్ని నలుదిశలా చాటిన పర్వతారోహకులకు మనమిచ్చే ఘనమైన నివాళి మాత్రమే గాక, సాహస స్ఫూర్తిని వ్యాప్తి చేసేందుకు దోహదపడతాయి.
మనిషి కంటే ప్రకృతి ఎన్నో రెట్లు బలమైనది. ఎవరెస్ట్‌ అధిరోహణ ప్రకృతిపై మనిషి సాధించిన పైచేయి అని చెప్పుకోలేము. కానీ, ప్రకృతి విసిరే సవాళ్లను మనిషి తన ఆత్మబలంతో ఎదుర్కోగలడనడానికి ఓ మంచి తార్కాణం.

కొన్ని వాస్తవాలు..
* సముద్ర మట్టం నుంచి అత్యధిక ఎత్తున్న పర్వతం ఎవరెస్టే! దీని ఎత్తు 8848.86 మీటర్లు (29031.7 అడుగులు)
* భౌగోళిక చర్యలు.. అంటే టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికల వలన ఎవరెస్ట్‌ ఎత్తు మారుతూ ఉంటుంది.
* 8000 మీటర్ల కంటే పైనున్న భాగాన్ని ‘మృత్యు విభాగం’గా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్‌ శాతం అత్యల్పంగా ఉండి విపరీతమైన చలి, ఈదురుగాలులతో నిండి ఉంటుంది. ఆక్సిజన్‌ సిలిండర్ల సహాయం లేకుండా మనుగడ సాగించడం కష్టం.
* ఎవరెస్ట్‌కు వాణిజ్యయాత్రలు పెరగడం వలన, జనసందోహం పెరిగి ‘బేస్‌క్యాంప్‌’ వద్ద విపరీతమైన చెత్త పేరుకుపోయి పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
* 2017లో స్పెయిన్‌ పర్వతారోహకుడు ‘కిలియన్‌ జోర్నెట్‌’ 26 గంటల్లో ఎవరెస్ట్‌ ఎక్కి తిరిగి వచ్చిన ఘటన వేగవంతమైన అధిరోహణగా నమోదయ్యింది.
* బేస్‌క్యాంప్‌ దగ్గర్లో ఉన్న ‘కుంబు’ ప్రాంతం నిరంతరం జారిపోతున్న మంచుతో అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది.

➡️