స్వేచ్ఛ

Jun 9,2024 08:42 #Stories

నాన్నా, పాప సముద్రపు అలలతో ఆటలాడుతున్నారు.
అది విశాఖ ఆర్‌కె బీచ్‌. ఎండాకాలం ఉదయపు వేళ వాతావరణం హాయి గొలుపుతోంది.
ఆరేళ్ల ఐల నాన్న చేయి పట్టుకొని నీళ్లలో గెంతులేస్తోంది. తడి ఇసుకలో తన చిన్ని చిన్ని పాదాలతో ముద్రికలు వేస్తోంది. అల వచ్చి, వాటిని చెరిపేసి పోతోంది. ఐల బుంగ మూతి పెడుతోంది.
అది చూసి నాన్న మధు .. ‘అరే ఐలా.. ఆ అల నీతో ఆటలాడుతోందిరా. చూడు చూడు.. పారిపోయి మళ్లీ వస్తోంది’ అన్నాడు.
అల మళ్లీ మళ్లీ వచ్చింది. ఐల కిలకిలా నవ్వేసింది.
సరిగ్గా అప్పుడే ఐల గౌనుపై వాలింది ఓ అందాల సీతాకోక చిలుక. బ్లూ, రెడ్‌, పింక్‌ కలగలిసిన నెమలి కన్ను వర్ణంలో భలేగా మెరుస్తోంది. చారెడంత రెక్కలను చకచకా ఆడిస్తోంది. ఐల కళ్ళు పెద్దవి చేసి దానివైపే చూస్తూ.. కదలకుండా జాగ్రత్తగా నిల్చుంది.
‘హే.. బటర్‌ఫ్లై.. భలే ఉందిరా’ అన్నాడు మధు గట్టిగా. ఆ గోలకి అది కాస్తా తుర్రుమని ఎగిరిపోయింది.
‘అంతా నీవల్లే.. హా.. అది పారిపోయిందీ..’ అని ఐల పేచీ అందుకుంది.
‘అదీ.. వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లింది. టిఫిన్‌ తినటానికి. మనం కూడా మన అమ్మ దగ్గరికి వెళ్లిపోదామా. టైమైందిగా..’ అంటూ రెండు చేతులతో ఐలను మురిపెంగా ఎత్తుకొని, పాప కాళ్లకు అంటిన ఇసుక పోయేందుకు, ఒక్కసారి పాప కాళ్ళను నీటిలో ముంచితీసి ముద్దు చేస్తూ.. బైక్‌పై ఎక్కించుకున్నాడు మధు. ఇద్దరూ రరు.. మంటూ ఇంటికి బయల్దేరారు.
బీచ్‌ పక్కనే ఉన్న మహరాణీపేటలో వారి ఇల్లు.
వెళ్తూవెళ్తూ ఒక చోట ఆగి, పాలు, పెరుగు ప్యాకెట్లు కొన్నారు.
‘నాన్నా.. నాన్నా.. చూడు.. అది మళ్లీ వచ్చింది’ అంది ఐల ఉత్సాహంగా. చూశాడు మధు. సీతాకోక చిలుక బైక్‌ అద్దంపై వాలింది.
‘అరే.. ఇదేంటి, ఇంత దూరం మనతో పాటే వచ్చిందా?’ అన్నాడు ఐలతో.
‘హా వచ్చేసింది నాన్నా’ అంది ఐల సంతోషంగా.
పాపను ఇంట్లో దింపి, అట్నుంచటే మధు బార్బర్‌ షాప్‌కి వెళ్లాడు.
అక్కడ జుట్టు సవరించుకుంటుండగా ఆ అద్దంపై వాలింది సీతాకోక చిలుక.
‘ఇదేంటి.. ఇది నాతో పాటే బైక్‌పై ఎక్కి షాప్‌కి కూడా వచ్చేసిందా’ ఆశ్చర్యంగా చూశాడు.
జుట్టు కటింగ్‌ చేయించుకుంటున్నాడు కానీ, దృష్టంతా ఆ సెలూన్‌లో తిరుగుతున్న బటర్‌ఫ్లై పైనే ఉంది. తర్వాత ఇంటికెళ్లి స్నానం చేశాడు.
భార్య దామిని ఇస్త్రీ బట్టలు మంచంపై పెట్టింది.
ఆ డ్రెస్‌పై మళ్లీ కనిపించింది బటర్‌ఫ్లై.
ఈ సారి మధు కళ్లు పెద్దవయ్యాయి.
‘దామినీ.. దామినీ.. ఇటురా.. అర్జంట్‌’ భార్యను పిలిచాడు. తను వచ్చి చూసింది.
‘హే.. భలే అందంగా ఉందే.. మీకు కొత్త బట్టలు వస్తాయోచ్‌. సీతాకోక చిలుక ఎవరి గౌనుపై వాలితే వారికి కొత్త బట్టలు వస్తాయని చిన్నప్పుడు మేం ఆటలాడుకున్నాం తెలుసా?’ అంది దామిని.
‘అది సర్లే. ఇది నన్ను వెంటాడుతోంది. పొద్దున్న బీచ్‌ దగ్గర, పాల దుకాణం దగ్గర, బార్బర్‌ షాప్‌ దగ్గర.. ఇలా..’ మొత్తం చెప్పాడు.
దామిని పకపకా నవ్వింది.
‘మీ మాజీ లవరేమో మరి! అందుకే మిమ్మల్ని వెంటాడుతోంది’ అంది కొంటెగా.
‘హేరు.. కావాలంటే ఐలని అడుగు’ అన్నాడు.
‘ఐల స్కూలికి వెళ్లింది. మధ్యాహ్నం లంచ్‌బాక్సు ఇచ్చినప్పుడు అడుగుతాలే గానీ.. మీరు ఆఫీస్‌కు వెళ్లండి. సీతాకోక చిలుకను చూస్తూ గడిపేయకుండా ..’ అంది నవ్వాపుకుంటూ.
మధు ఆఫీసులోకి కూడా వచ్చేసింది బటర్‌ఫ్లై. లాప్‌టాప్‌పైనా, మౌస్‌పైనా, పుస్తకాల ర్యాకు పైనా.. టీకప్పు పైనా .. అది అలా అలా.. వాలుతూనే ఉంది.. కనిపిస్తూనే ఉంది. మధుకి వింతగా అనిపిస్తోంది. తన పని తాను చేసుకుపోతున్నా అతడి దృష్టంతా దాని మీదే ఉంది.
***********************************
టేబుల్‌పై ఉన్న మొబైల్‌ మోగింది. అటు నుంచి అమ్మ దమయంతి.
‘మధూ.. ఎందుకురా చెల్లిని ఏడిపిస్తావు? దాన్ని కాలేజీ యూత్‌ఫెస్ట్‌లో డ్యాన్స్‌ చెయ్యొద్దన్నావట. అది ఏడుస్తోంది’ అంది.
‘అవును.. అన్నాను. డిగ్రీకి వచ్చాక ఇంకా డ్యాన్సులు, వేషాలూ ఏంటమ్మా? అసలు దాన్ని టెన్త్‌లోనే ఫుల్‌స్టాప్‌ పెట్టమన్నాను. విన్నదా? మొన్న ఆ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ ప్రోగ్రాంలో ఏకంగా పంచెకట్టి, మీసం తగిలించి మగరాయుడు వేషం కట్టింది. ఏం వేషాలివి’ అన్నాడు కోపంగా.
‘అది పేదరైతు వేషంరా.. అన్నయ్యా!’ అంది మహిత ఫోన్‌ స్పీకర్లో అన్నయ్య మాటలు వింటూ
‘అది సర్లే, ఇప్పుడు యూత్‌ ఫెస్ట్‌కదా. క్లాసులో నలుగురు ఆడపిల్లలు కలిసి ప్రిపేరయ్యారట, రేపే ప్రోగ్రాం. ఫ్రెండ్స్‌ అంతా వచ్చి నన్ను బతిమలాడుతున్నారు’ చెప్పింది తల్లి.
‘ఇదిగో అమ్మా.. మహీగానీ యూత్‌ఫెస్ట్‌ స్టేజీపై గెంతిందా? నేను ఊరుకునేది లేదు. అక్కడికీ చెల్లి అడిగింది మనం ఏది కాదన్నాం కనుక. ఈ డ్యాన్స్‌లు అవి మాత్రం వద్దని గట్టిగా చెప్పమ్మా’ అన్నాడు, కాస్త బిగ్గరగా.
అమ్మ నుంచి ఫోను తీసుకొంది మహిత.
‘అన్నయ్యా .. అందరం ప్రిపేరయ్యాం. ప్లీజ్‌ రా. నేను వేయకపోతే మా టీం మొత్తం ఆగిపోతుంది. మెయిన్‌ పార్టిసిపెంట్‌ని నేనే. ప్లీజ్‌ అన్నయ్యా. మంచి టాపిక్‌రా’ బతిమలాడుతోంది.
మధుకి కోపం వచ్చింది.
‘చూడు మహీ. ముందు నా మాట వినటం నేర్చుకో. వద్దని ముందే చెప్పానుగా, అయినా ఎందుకు ప్రిపేరయ్యావు? మాటంటే లెక్క లేదా, నీకు? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. స్టేజి మీద గెంతులు వద్దంటే వద్దు’ అని విసురుగా ఫోను కట్‌ చేశాడు.
సరిగ్గా అప్పుడే మధు చేతి మీద వాలింది బటర్‌ఫ్లై. చాలా సేపు అలాగే నిల్చుంది.
‘ఇదేంటిది? చాలా ఆశ్చర్యంగా ఉందే! నిజంగానే ఇది నన్ను ఫాలో అవుతుందా? ఈగ సినిమాలో నానిలా దీంట్లో ఏదైనా ఆత్మ దూరలేదు కదా..’ అనుకుంటూ చేయి దగ్గరకు తెచ్చుకొని చూశాడు. అవే రంగులా? అదే సీతాకోక చిలుకా? మరొకటా? మధు దాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. ఇంతలో కొలీగ్‌ రావడంతో అటుచూశాడు. అది తుర్రుమంది.
***********************************
ఆ తర్వాతి రోజు.. కళా ప్రదర్శన ఇస్తున్న మహిత నిలువెత్తు ఫొటో స్థానిక పత్రికలో వచ్చింది. ‘కళాభారతిలో జరిగిన యూత్‌ ఫెస్ట్‌లో యువతీ యువకుల కేరింత, అబ్బురపరచి, ఆలోచింపజేసిన ప్రదర్శనలు’ అని రాశారు అందులో. దామిని ఆ ఫొటోను చూసి మురిసిపోయి- మధుకి, ఐలకు చూపించింది.
‘హే హే అత్త ఫొటో.. భలే భలే’ అని ఐల గెంతులేస్తోంది.
మధుకు మాత్రం ఆ ఫొటో చూసిి కోపం బాగా చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అమ్మకు ఫోన్‌ చేశాడు.
‘నా మాట లెక్కలేదా మీకు. మన కుటుంబం గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్న జ్ఞానం ఉందా? ఇప్పుడే వస్తానుండు. అది ఉందా ఇంట్లో..’ ఫోన్లో అరిచాడు.
‘నేనే పాల్గొనమని చెప్పాను మధూ, మహిని ఏమీ అనకు’ అని తల్లి అంటున్నా, వినిపించుకోలేదు.
కాల్‌ కట్‌ చేసేశాడు.
***********************************
‘అమ్మా.. అన్నయ్య ఏమన్నాడు? నా ఫొటో చూశాడా మెచ్చుకున్నాడా?’ అంటూ మహి అమ్మ వెనుక నిలబడి ఆమె చుట్టూ చేతులు వేసింది మురిపెంగా అడిగింది.
‘హ..అవునురా.. చూశాడు. నువ్వు త్వరగా కాలేజీకి.. వెళ్లు’ అని తొందర పెట్టింది దమయంతి.
‘ఈరోజు కాలేజీ లేదమ్మా. నిన్న యూత్‌ ఫెస్ట్‌ కదా. అందుకని ఈరోజు సెలవ్‌’ అంది.
‘అలాగా.. అయితే మీ ఫ్రెండ్‌ రాధ ఇంటికి బయల్దేరు. వెంటనే వెళ్లు..’ అంది అమ్మ
‘ఏమైందమ్మా.. ఎందుకంత కంగారూ?’ అంది మహి.
‘ఏం లేదురా.. అన్నయ్యకు నువ్వు స్టేజి ఎక్కడం నచ్చలేదు కదా. నీ ఫొటో పేపర్లో రావడం చూసి చాలా కోప్పడ్డాడట. వాడు ఈ విషయంలో మొండిగా తయారయ్యాడు. ఇప్పుడే అక్కడ బయలు దేరాడట, నీమీద అరవడానికి. వదిన ఫోన్‌చేసి చెప్పింది. ‘చాలా కోపంగా ఉన్నాడు. మహిని కంట పడనివ్వకండి’ అని
మహిత ఉత్సాహమంతా నీరు కారిపోయింది.
‘నువ్వు చెప్పమ్మా.. ఓ మంచి టాపిక్‌పై స్క్రిట్‌ చెయ్యడం తప్పా? అన్నయ్య ఎప్పుడూ ఇంతే! ఆటల్లో పాల్గోనివ్వడు. పాటలు పాడనివ్వడు. స్టేజ్‌ ఎక్కొద్దంటాడు. ఫ్రెండ్స్‌తో ఎక్కడికీ వెళ్లనివ్వడు. చదువొక్కటే చదవాలట. అక్కడికీ చదువులోనూ నాకు అన్నీ మంచి మార్కులే కదా! అన్నీ భయపడుతూ వాడికి తెలీకుండా చెయ్యాలా?’ అంది కంటతడి పెట్టుకుంటూ.
‘నీ తప్పేం లేదమ్మా! నా బంగారుతల్లి తప్పెందుకు చేస్తుంది? అన్నింటా ముందుంటుంది. అది నాకు చాలా ఆనందం’ అని కూతుర్ని ముద్దాడింది దమయంతి.
‘మరి అన్నయ్యకు అర్థమయ్యేలా చెప్పొచ్చుగా నువ్వు..’ అంది మహీ.
‘మీ నాన్న చనిపోయాక అన్నీ వాడే చూసుకుంటున్నాడు. నువ్వంటే అతిజాగ్రత్త. ఆడపిల్లల విషయంలో ఆంక్షలు, చాదస్తాలు ఎక్కువ కదా వాడికి. మీరిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరిగారు. నిన్ను ఎవరైనా కామెంట్‌ చేస్తారేమోనని వాడి భయం. అంతే!’ అంది అమ్మ.
మధు వచ్చేశాడు. ఇంటి వాకిట్లో బైకు పార్కు చేసి, రావడం కనిపించింది. మహి భయంతో బెడ్‌రూంలోకి పారిపోయి, తలుపు గడియ వేసుకుంది.
‘నేను పిలిచే వరకు తలుపు తియ్యొద్దు మహీ..’ అంది అమ్మ.
‘అమ్మా.. అమ్మా..’ అరుస్తూ వచ్చాడు మధు.
‘ఏమైందిరా.. ఏంటీ కేకలు?’ దమయంతి అడ్డుపడింది
‘అదేదీ? మహీ… మహీ…’ మళ్లీ అరిచాడు చుట్టూ చూస్తూ.
‘మహిత రాదురా… నువ్వు అరవకు. దానికి చిన్నప్పట్నుంచీ డ్యాన్స్‌ నేర్పించి మురిసిపోయింది మనమే కదా. ఇప్పుడు తిట్టిపోస్తామా? అయినా తనేం తప్పు చేసింది. కాలేజీ ఈవెంట్స్‌, ఫెస్ట్‌లో చిన్న నాటిక వేసింది. అందులో మధ్యలో డాన్స్‌ చేసింది. తప్పేంటి?’ అంది.
తల్లిపై మధు అంతెత్తున లేచాడు.
‘నీకేం.. నువ్వు బాగానే చెబుతావు. బయట వాతావరణం ఎలా ఉందో నీకు తెలుసా? ఇలా వేషాలు కట్టి పేపర్లో పడితే దాన్ని ఎవరు పెళ్లాడతారు?’ అంటూ కోపం వెళ్లగక్కాడు.
మహి ఉన్న బెడ్‌ రూం వద్దకు వెళ్లి.. తలుపును ధబీధబీమని బాదడం మొదలుపెట్టాడు మధు.
అప్పుడు తలుపు తడుతున్న అతడి చేతిపై వాలింది సీతాకోకచిలుక.
చేయి కదులుతుంటే – అది ఎగిరిపోయి, మళ్లీ మళ్లీ వాలుతోంది. ఆశ్చర్యం మొదలైంది మధులో.
‘ఏంటీ ఇది నా చేతికి అడ్డు పడుతోందా?’ అని ఆలోచనలో పడ్డాడు. తలుపు బాదడం ఆపేసి, అలాగే నిలబడిపోయాడు. అప్పుడది తలుపు వద్ద డోర్‌ కర్టెన్‌పై వాలి రెక్కలు మెల్లగా అల్లార్చుతోంది. మధు దానికి దగ్గరగా ముఖం పెట్టి చూశాడు.
‘మధూ.. ఏంట్రా అలా చూస్తూ నిలబడిపోయావు? ముందు ఇలా వచ్చి కూర్చో’ అమ్మ పిలిచింది. డైనింగ్‌ టేబుల్‌పై ఉన్న పూరీలను ప్లేట్లో పెట్టింది. తినరా నీకిష్టం కదా’ అంది.
మధు తింటున్నాడు.
‘చూడు మధు.. ఆ ఫొటో చూసి నువ్వు సంతోషపడతావని, ‘అమ్మా.. అన్నయ్య ఏమన్నాడమ్మా..’ అని ఎన్నిసార్లు అడిగిందో చెల్లి. తను నీ మెప్పు కోరుకుంటోంది రా. అయినా, చెల్లి ఏమంత తప్పు చేసిందని దాన్ని ఇలా బెదరగొడుతున్నావు. నిజానికి ఆడపిల్లలపై ఎవరైనా తప్పుడు కామెంట్లు చేస్తే వాళ్ల చెంప ఛెళ్ళు మనిపించాలిగానీ.. ఎవరో ఏదో అంటారని ఆడపిల్లల స్వేచ్ఛను హరించేస్తామా చెప్పు? చెల్లిని ఇలాగేనా చూసుకునేది?’ తల్లి లాలనగా కొడుక్కి నచ్చ చెబుతోంది.
ఆమె మాట్లాడినంత సేపు ఆమె భుజంపై వాలుతూ, రెక్కలూ ఆడిస్తోంది బటర్‌ఫ్లై. దానినే గమనిస్తూ అమ్మ మాటలు వింటున్న మధుకు ‘ఆ సీతాకోక చిలుకే నాతో ఇవ్వన్నీ చెబుతోందా’ అనిపిస్తోంది మనసులో.
‘అమ్మా.. నేను సాయంత్రం వస్తాను..’ అంటూ హడావుడిగా లేచి, బండి స్టార్ట్‌ చేసి ఇంటికి వెళ్లిపోయాడు.
వెళ్లీ వెళ్ళగానే ‘దామినీ.. దామినీ.. ఇటురా..’ భార్యను హడావుడిగా పిలిచాడు.
బటర్‌ఫ్లై మళ్లీమళ్లీ తన వెంటపడుతున్న విషయం చెప్పాడు. దామినికి మళ్లీ నవ్వు ఆగలేదు. ‘అదంతా మీ భ్రమ. సీజన్‌ కదా బోల్డన్ని బటర్‌ఫ్లైస్‌ తిరుగుతుంటాయి’ అని నవ్వుతూ రీడింగు రూంలోకి వెళ్లిపోయింది.
‘అవునా?’ అని ఆలోచనలో పడ్డాడు మధు.
***********************************
సాయంత్రం స్నానం చేసి బెడ్‌రూంలో మంచంపై ఒంటరిగా చేరబడ్డాడు మధు.
నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు.
అప్పుడే.. అక్కడున్న గోడపై వాలింది బటర్‌ఫ్లై.
మధు నెమ్మది నెమ్మదిగా దాని దగ్గరకు నడిచి వెళ్ళాడు.
‘ఎవరు నువ్వు? చెప్పవూ’ అని మనసులో అనుకున్నట్టే అనుకొని బయటికి అడిగాడు.
‘నేను సీతాకోక చిలుకను’ అంది బటర్‌ఫ్లై వెంటనే.
అదిరి పడ్డాడు. మధు తేరుకునే లోపు అదే మళ్లీ మాట్లాడింది.
‘ఓ మనస్సున్న నేస్తమా! నేను నీలా మనిషినైతే నా భావం నీకు అర్థమయ్యేలా నా చేతులూ జోడించి నీకు నమస్కరించి, చెప్పేదాన్ని’ అంది బటర్‌ ఫ్లై.
మధు గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆశ్చర్యంగా చూస్తూ
‘ఏం చెప్పేదానివి’ చిన్నగా అడిగాడు.
‘అసలు నేనెవరినో తెలుసా నేస్తం ? సరిగ్గా మూడు నెలల కిందట నీ ఇంటి చూరుకు పట్టిన చిన్న బూజులో తలదాచుకున్న ముళ్ల గొంగళి పురుగును. ‘అప్పుడు నీ భార్య నన్ను చీపురుతో గట్టిగా లాగి పడేయబోతే నువ్వే అడ్డుకొని నన్ను కాపాడావు. నీ పాప ‘చీచీ.. గొంగళిపురుగు… నాకు ఇష్టంలేదు డాడీ. అమ్మా తుడిచేరు..’ అని అంటుంటే నువ్వే వారించావు. గుర్తుందా?’
‘హా’ తల ఊపుతూ ఊకొట్టాడు.
‘నిజానికి.. అప్పుడు నాకూ ఆ గొంగళి రూపం నచ్చలేదు. ఏడ్చేదాన్ని. కానీ, నీ మాటలే నాకు ఊరటను, భవిష్యత్తుపై ఆశను కలిగించాయి. అసలు అప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా?’
‘ఏమన్నాను?’
‘అది ఇప్పుడు ముళ్ల గొంగళిపురుగే కావొచ్చు. కానీ, దాని భవిష్యత్తు ఎంతో అందమైనది. ఆహ్లాదకరమైనది. ఈ గొంగళి పురుగు నెమ్మదిగా రెక్కలు తొడుక్కొని మరికొద్ది రోజుల్లో కొత్త రూపం ధరిస్తుంది. అందాల సీతాకోక చిలుకగా ఉద్భవిస్తుంది. స్వేచ్ఛగా, ఎల్లలు లేకుండా ఆకాశంలో ఎగురుతోంది. అందరినీ అబ్బురపరుస్తుంది. ఇప్పుడు ‘చీచీ’ అన్న మనచేతే అప్పుడు భలే, భళా అనిపించుకుంటుంది. ఆ రూపం ఎంతో అపురూపం. దాన్ని స్వేచ్ఛగా ఎదగనివ్వాలి మనం’ అన్నావు. ఆ మాటలే నాలో కొత్త ఊపిరిలూదాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఈ అందమైన జీవితం నీ పుణ్యమే నేస్తం. థ్యాంక్యూ. థ్యాంక్యూ సోమచ్‌’ అంది బటర్‌ఫ్లై.
‘నిజమా? ఆ గొంగళిపురుగు, ఇప్పుడు ఇంత అందమైన రెక్కలతో, రంగుల హంగులతో ఎగురుతోందా’ మధు మనసులో వింతగా ఉంది. నమ్మలేకపోతున్నాడు. అమితానందంతో, ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయాడు.
‘కానీ మిత్రమా’ అన్నది బటర్‌ఫ్లై
‘కానీ ఆ. ఏమైంది’ అన్నట్లు కళ్లు చిట్లించి చూశాడు’ మధు.
‘ఓ నేస్తం!
చిన్ని ప్రాణినైన నన్ను అంత చక్కగా రెక్కలు విచ్చుకొని ఎదగనిచ్చావు, ఎగరనిచ్చావు. మరి, నీ చిన్నారి చెల్లి రెక్కలను, స్వేచ్ఛను ఎందుకు తుంచేస్తావు? తనకు నచ్చిన పనిని, నలుగురూ మెచ్చిన పనిని ఎందుకు చెయ్యనివ్వవు? ఎంతో విశాలత నిండిన నీ హృదయం నీ చెల్లి విషయంలో ఎందుకు కుంచించుకుపోయింది. ఆమె ఆసక్తిని, అభిరుచిని ఎందుకు చూడలేకపోతోంది? నీ చక్కని మెచ్చుకోలు మనసు ఆమె అభిలాషను, ఆమె నిలువెత్తు ధైర్యాన్నీ ఎందుకు మెచ్చుకోలేకపోతోంది? ఆమె ఆత్మాభిమానాన్ని, చదువును, వయస్సును ఎందుకు గౌరవించలేకపోతోంది? రేపు నీ పాప గతీ ఇంతేనా? ఆలోచించు. జవాబు చెప్పు నేస్తం? అని ప్రశ్నించింది.
మధుకు నోట మాట రాలేదు.
‘నేస్తం.. నాలాగే నీ చెల్లినీ, పాపనూ తప్పక ఎదగనిస్తావు కదూ, ఎగరనిస్తావు కదూ. నీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ ఆ సీతాకోకచిలుక మధు పాదాలపై వాలింది. చేతులపై వాలింది. చెంపలపై వాలింది. నుదుటిపై వాలింది.
మనస్సును కమ్మిన పొరలేవో వదులుతున్నట్లు వింత బాధతో మధు గుండె బరువెక్కింది.
అతడి కళ్లల్లో సుడులు తిరిగిన కన్నీరు, చెక్కిళ్ల మీదుగా చెవిలోకి జారింది.
అంతే..! ఉలిక్కిపడి నిద్ర లేచాడు మధు. చెమ్మగిల్లిన కళ్లను, చెవిని తుడుచుకున్నాడు.
కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయాడు. టేబుల్‌పై ఉన్న వాటర్‌ బాటిల్‌ అందుకొని గటగటా రెండు గుక్కలు నీళ్లు తాగాడు. బటర్‌ఫ్లై మాటలు చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి. బరువెక్కిన అతడి మనస్సు నెమ్మదిగా ఎంతో విశాలంగా విచ్చుకుంటోంది.
మంచం దిగి హాల్లోకి నడిచాడు. అక్కడ టీపారుపైన ఉన్న పత్రికను చేతుల్లోకి తీసుకున్నాడు. మహిత నిలువెత్తు ఫొటోను పరికించి చూశాడు. అది ఎంతో అందంగా కనిపించింది. ఆత్మవిశ్వాసం నిండిన ఆమె కళ్లు తన ప్రశంస కోసమే అమాయకంగా ఎదురు చూస్తున్నట్టు అనిపించింది.
వెంటనే అమ్మకు ఫోన్‌ చేశాడు.
‘చెల్లి ఫొటో చాలా బాగుందమ్మా’ అన్నాడు.
అమ్మ ఆనందంతో ఉప్పొంగింది.
‘ఇదిగో .. ఆ మాట మహీకే చెప్పు’ అంది తల్లి సంతోషంగా.
‘కంగ్రాచ్యులేషన్స్‌ రా, మహీ. గుడ్‌, కీప్‌ ఇట్‌ అప్‌’ అన్నాడు చెల్లితో.
అది విని మహిత ఇంటిపై కప్పు ఎగిరిపోయేలా ‘థ్యాంక్యూ అన్నయ్యా, థ్యాంక్యూ సోమచ్‌రా. మా మంచి అన్నయ్య’ అంటూ అరిచి గోలగోల చేసింది.
మధు గుండె ఆనందంతోనూ, బాధ్యతతోనూ, హుందాతనంతోనూ ఉప్పొంగింది?
అప్పుడే కిటికీ ఊచపై వాలిన బటర్‌ఫ్లై నెమ్మదిగా బయటకు ఎగిరింది. అది చూసి మధు అటు పరుగెత్తాడు. కిటికీలోంచి తొంగి చూశాడు. బయట పెరటి తోటలో బోలెడన్ని బటర్‌ప్లైస్‌ ఎగురుతూ స్వేచ్ఛగా ఆడుకుంటున్నాయి.
అందులో కలలో తనను మేల్కొల్పిన ఆ బటర్‌ఫ్లై ఏదా అనుకుంటూ… వెతుకులాడుతూ.. చేయి ఊపుతూ బైబై చెప్పాడు మధు.

– ఎల్‌. శాంతి
7680086787

 

➡️