అందరికీ ఆరోగ్యం..చర్యలకు ఇదే సమయం..

Dec 11,2023 08:13 #Sneha
డాక్టర్‌ దేశం పి.ఆర్‌. ఎంబిబిఎస్‌, ఎండి, ప్రజారోగ్య నిపుణులు.
డాక్టర్‌ దేశం పి.ఆర్‌. ఎంబిబిఎస్‌, ఎండి, ప్రజారోగ్య నిపుణులు.

మార్క్స్‌ చెప్పినట్టు మనిషి ఒక సంపూర్ణమైన మానవుడిగా ఎదగాలంటే కేవలం బతికుంటే సరిపోదు, బతికున్న కాలం అంతా ఆరోగ్యంగా జీవించాలి. కానీ ఈ ఆరోగ్యానికి అవసరమయ్యే పరిస్థితులు మాత్రం ప్రతీ మనిషికి కల్పించబడట్లేదు. పిండంగా తల్లి గర్భంలో ఉన్న దశ నుండి తాను మరణించే వరకూ రకరకాల ఆరోగ్య సమస్యలు మనిషిని వెంటాడుతుంటాయి. పుట్టిన ప్రాంతం, లింగం, కుటుంబం, కులం బట్టి, అన్నింటికి మించి వర్గం బట్టి తన ఆయుష్షు నిర్ణయించబడుతుంది. జపాన్‌లో పుట్టిన మనిషికి సగటు ఆయుష్షు 85 సంవత్సరాలు ఉంటే, ఆఫ్రికాలో పుట్టిన మనిషికి 65 ఏళ్లు మాత్రమే ఉంటుంది. దేశాల/ రాష్ట్రాల/ ప్రాంతాల అభివృద్ధిని బట్టి మన ఆయుష్షు, పట్టణంలో ఉన్నామా, పల్లెలో ఉన్నామా అనే దానిని బట్టి మన ఆయుష్షు.. గుండె, మెదడు వంటి అవయవాలు మొరాయించినపుడు.. మనం చేరే ఆసుపత్రి (ప్రభుత్వ లేదా ప్రయివేటు) ని బట్టి మన ఆయుష్షు.. మన శేష జీవితం.. నిర్ణయించబడు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా యుహెచ్‌సి కవరేజ్‌ సూచిక 2000 సంవత్సరం నుండి 2021కిి 45 నుండి 68కి పెరిగింది. 2015 వరకు బాగానే (65 వరకు) పెరిగినా, ఆ తర్వాత జరిగిన అభివద్ధి చాలా తక్కువ. ఈ నెల 12 ‘యూనివర్శల్‌ హెల్త్‌ కవరేజ్‌ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం..

             చాలా సార్లు మన ఇళ్లల్లోగాని, మన చుట్టాలు, చుట్టుపక్కలవారు గానీ ఎదుర్కొనే ఒక సందర్భం చూద్దాము – ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య (ఆస్తమా/ న్యూమోనియా/ గుండె జబ్బు/ పక్షవాతం/ ఇతర దీర్ఘకాలిక జబ్బులు) వస్తే వారి కోసం అయ్యే వైద్య ఖర్చులు ఎలా ఉంటాయంటే.. ఆ దెబ్బతో వారు దారిద్య్రరేఖకు దిగువన పడిపోతారు. వారి ఆస్తులను అమ్మేసుకోవాల్సిన పరిస్థితులు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం దాచిన డబ్బులు, వృద్ధాప్యం కోసం వారు చేసుకున్న పొదుపులన్నీ బయటకి తీసి.. వైద్యానికి ఉపయోగించాల్సిన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. ఇలాంటి ఆర్థిక కష్టాల వల్ల దిగువ మధ్యతరగతిలో ఉండే కుటుంబాలు పేద / నిరుపేద కుటుంబాలుగా మారతాయి. ప్రజలను ఇలాంటి పరిస్థితుల్లోకి జారకుండా కాపాడటమే ఈ యుహెచ్‌సి (యూనివర్శల్‌ హెల్త్‌ కవరేజ్‌) (సార్వత్రిక ఆరోగ్య అందుబాటు) లక్ష్యం.

అంటే ఏమిటి ?

ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 12వ తారీఖున ‘యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ డే’ జరుపుకుంటాం. యుహెచ్‌సి అంటే ప్రజలందరికీ అన్ని రకాల ఆరోగ్య సేవలూ, అన్ని సమయాల్లో, అన్ని ప్రాంతాల్లో (ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు) ఏమాత్రం ఆర్థిక పరమైన ఇబ్బంది లేకుండా అందుబాటులోకి తేవడం. మన ఆరోగ్యాన్ని నిరంతరాయంగా పెంపొందించడం దగ్గర నుండి మనకి వచ్చే అన్ని రకాల రోగాలను దశల వారీగా నివారించేవరకు.. అత్యవసర సేవలూ, అన్ని రకాల వైద్య సేవలూ అందుబాటులోకి తేవడం.. బాగా అనారోగ్యం పాలైన వారికి పునరావాసం కల్పించడం.. ఇలాంటివన్నీ ఈ యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ కిందకి వస్తాయి.

పైన పేర్కొన్న సేవలన్నీ ప్రజలకి అందించాలంటే దానికి తగ్గట్టుగా నైపుణ్యం ఉన్న ఆరోగ్య సిబ్బంది ఉండాలి. వారు పల్లెల్లో, పట్టణాల్లో అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండాలి. వైద్యం అందించడానికి కావాల్సిన పరికరాలు అన్నీ వారికి అందుబాటులో ఉండాలి. వారు నివసించడానికి, పని చేయడానికి ఒక మర్యాద పూర్వకమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోగలగాలి.

ఈ సార్వత్రిక ఆరోగ్యం 2030 కల్లా ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి అని.. ఆరోగ్య రంగంలో స్థిరమైన అభివృద్ధిని సాధించాలి అని.. ప్రపంచంలోని దేశాలన్నీ 2015లో లక్ష్యం ఏర్పరుచుకున్నాయి. (ఎస్‌డిజి 3.8) లింగ, వయసు, కులం, జాతి, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ అత్యుత్తమమైన ఆరోగ్యాన్ని అందించడమే సార్వత్రిక ఆరోగ్యం అందుబాటులోని ముఖ్యాంశం.

కొలమానాలు…

ఈ యుహెచ్‌సిని ఎంత వరకు చేరుకున్నామో తెలుసుకోవడానికి ఒక కొలమానం కూడా ఏర్పరుచుకున్నాం. దేశంలో అందిస్తున్న రక రకాల ఆరోగ్యసేవలను బట్టి, ఆ దేశ ప్రజలు వైద్య ఆరోగ్య సంబంధిత విషయాల్లో ఎంత ఆర్థిక భారం అనుభవిస్తున్నారు అనే దాన్నిబట్టి ఆ కొలమానం 1 నుండి 100 వరకు పాయింట్ల రూపంలో ఉంటుంది.

1. మొదట పేర్కొన్న ఆరోగ్య సేవలన్నీ నాలుగు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి – ప్రత్యుత్పత్తి, తల్లి – శిశువు, పిల్లల సంబంధితమైన సేవలు, రెండు – అంటువ్యాధుల ప్రాబల్యం, మూడు – దీర్ఘకాలిక వ్యాధులు, నాలుగు – ఆరోగ్య సేవలు అందరికీ అందించగలిగే సామర్థ్యం.

2. ఆర్థిక భారం విషయానికి వస్తే – దేశ ప్రజలు ఆరోగ్య సమస్యలపైన తమ జేబులో నుండి పెట్టాల్సి వస్తున్న ఖర్చులను బట్టి ఆ దేశ యుహెచ్‌సి కొలమానం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 2015 వరకు ఈ సూచిక బాగానే పెరుగుతూ వచ్చినా, 2015 నుండి 2019 వరకు కేవలం మూడు పాయింట్లు మాత్రమే పెరిగి, తర్వాత ఆగిపోయింది. ప్రస్తుతం 200 కోట్ల మంది ప్రజలు ఆరోగ్యం కోసం ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటుంటే.. 100 కోట్ల మంది విపరీతమైన ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు (కటాస్ట్రోఫిక్‌ హెల్త్‌ ఎక్సపెండిచర్‌). ఒక్క 2019లోనే ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్ల మంది ఆరోగ్యపరమైన ఖర్చుల వల్ల దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారు. 130 కోట్ల మంది పేదవాళ్ళుగా మారారు. ప్రపంచంలో ఉన్న నాలుగో వంతు జనాభాకి ఆరోగ్యపరమైన ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి.

సార్వత్రికమైన ఆరోగ్యం అందించ లేకపోవడానికి దేశాల మధ్యలో ఉన్న ఆర్థికపరమైన అసమానతలనే బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఒక్కో దేశం యుహెచ్‌సి సూచికలో ముందుకు వెళ్లినట్టు కనబడినా దేశంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఉన్న అసమానతలు, అంతరాలు.. వారికి అందే వైద్యసేవల్లో తేడాలు అలాగే ఉన్నాయి.

2021లో కోవిడ్‌ కాలంలో 92% దేశాల్లో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. 2022లో 84% దేశాలు వారి ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో విఫలం అయ్యామని ఒప్పుకున్నాయి. ఒక్క 2021లోనే రెండు కోట్ల యాభై లక్షల చిన్నారులకు టీకాలు అందలేదని ఒక అంచనా. కోవిడ్‌ను జయించడానికి శాస్త్రవేత్తలు టీకాలు కనిపెడితే, అభివృద్ధి చెందని ఆఫ్రికాలాంటి దేశాల్లో కేవలం 34% మందికే టీకాలు అందాయి. మన దేశంలో 65% మందికి టీకాలు అందాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఎమర్జెన్సీ సేవలు, వైద్యంలో ఆధునిక పరికరాల వినియోగం అన్నింటికీ ఆటంకం కలిగింది. వీటన్నింటి ప్రభావం మనం ఈ దశాబ్దంలో చూడనున్నాం.

ఎలా అందుకోవాలి ?

సార్వత్రిక ఆరోగ్యాన్ని అందుకోవాలంటే మనకున్నది ఒకే ఒక మార్గం.. అదే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విధానాలను బలంగా అమలు చేయడం. భోర్‌ కమిటీ నివేదిక ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తేనే ప్రతి ఒక్కరికీ సరైన ఆరోగ్యం అందించగలిగే ఆస్కారం ఉంటుంది. తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరికీ సంపూర్ణ మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యం అందించడానికి వీలుంటుంది. వాటిని బలోపేతం చేయగల్గితేనే ప్రతి ఒక్కరికీ వారి వారి నివాసాలకు దగ్గరగానే నాణ్యమైన వైద్య సేవలు అందించే వీలుంటుంది. ఒక అంచనా ప్రకారం కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తే ప్రతి సంవత్సరం ఆరు కోట్ల మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆయుష్షు మూడున్నర సంవత్సరాలు పెంచొచ్చు.

మనిషి అవసరాలు..

ప్రతి మనిషికి రకరకాల తీరని అవసరాలుంటాయి. ఆ అవసరాలు తాగే నీరు దగ్గర నుండి తినే ఆహారం, విద్య, నివాసం, ఉద్యోగం, వైద్యం ఏవైనా ఉండొచ్చు. అయితే వైద్య పరిభాషలో ”తీరని అవసరాల” కు ఒక ప్రత్యేక అర్థం ఉంది. ఎప్పుడైతే ఒక మనిషి రక రకాల కారణాల వల్ల ఆరోగ్య సేవలను అందుకోలేకపోతాడో, ఆ కారణాలు – వైద్య సదుపాయాలు తమకి అందుబాటులో లేకపోవడం దగ్గర నుండి, వైద్యానికి అయ్యే ఖర్చులు పెట్టుకోవడానికి స్థోమత లేకపోవడం.. స్థోమత ఉన్నా అందుబాటులో ఉన్న వైద్యాన్ని ఆమోదించలేకపోవడం (ఆయుర్వేద, యోగా, హోమియోపతీ, యునాని, సిద్ధ వంటి స్థానిక వైద్యాలను / చిట్కా వైద్యాలను/ ఆర్‌.ఏం.పీ లను ఆశ్రయించడం) కూడా కారణం కావచ్చు. కారణం ఏదైనా వారి ఆరోగ్య అవసరాలు తీరడం లేదు. అంటే.. వారిని ”తీరని అవసరాలున్న వర్గం” గా పరిగణించొచ్చు.

ఈ పెట్టుబడిదారీ ప్రపంచంలో మనం చూసే ఒక తలక్రిందుల నియమం ఏంటంటే, ఎవరికైతే ఆరోగ్య అవసరాలు, వైద్యపరమైన అవసరాలు ఎక్కువగా ఉంటాయో, వారికే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండవు. ఎవరికైతే ఆ అవసరం ఉండదో, వారికి వైద్య సదుపాయాలన్నీ అమర్చబడతాయి. నిరుపేద వర్గాల ప్రజలకు, దిగువ కులాల వారికి, జన సంచారం నుండి దూరంగా ఉండే గిరిజనులకు, పిల్లలకు, స్త్రీలకు, ముసలివాళ్లకూ వైద్య సదుపాయాలు ఎక్కువగా కావాల్సి ఉంటుంది.. కానీ ఈ సమాజంలో వారికే వైద్యం అందదు. అయితే ఈ తీరని అవసరాల జాబితాలో మనకి ఈ అవసరం ఉందీ అని గుర్తించకుండా వైద్యం చేయించుకోకపోవడం ఒక పార్శ్వ్యం.. అయితే అవసరం ఉందని గుర్తించీ వైద్యం చేయించుకోలేకపోవడం మరో పార్శ్వం. రెండో కోవకి చెందినవారు వారి అవసరాలను ఖాతరు చేయరు. ఈ దుర్భర పరిస్థితి చాలా సందర్భాల్లో ప్రజల దగ్గర సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల జరుగుతుంది. వైద్యం కోసం వెళ్ళడం వల్ల.. రోజు కూలీ నష్టం వారిని వైద్యం కోసం వెళ్లనీయకుండా నివారిస్తుంది. ఉదాహరణకు, ఒక మహిళ – తనకి చదువు / అవగాహన లేని కారణంగా.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునే అవకాశం ఉందని తెలియకపోవడంతో అనేకసార్లు గర్భం దాల్చడం – ఇంకో మహిళ అవగాహన ఉన్నా, ఆర్థిక కారణాల రీత్యా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించు కోలేక పలుమార్లు గర్భం దాల్చడం జరుగుతుంది.

వ్యాధుల రెట్టింపు భారం.. పరిష్కారాలు..

మాతా శిశు సంరక్షణ అంశాన్ని పక్కన పెడితే మనుషులకి వచ్చే జబ్బులన్నింటినీ స్థూలంగా రెండు రకాలుగా విభజించొచ్చు. ఒకటి ఒకరి నుండి మరొకరికి సోకె అంటువ్యాధులు. మరొకటి ఇతరులకు సోకని దీర్ఘకాలిక వ్యాధులు. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే అంటువ్యాధుల నిర్మూలన పారిశ్రామిక విప్లవం జరిగిన కాలం నుండే తగ్గు ముఖం పట్టాయి. ప్రజల ఆయుష్షు పెరిగి, పెద్ద వయసులో వచ్చే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, వాటి వల్లే ఎక్కువగా చనిపోతూ ఉంటారు. మన దేశం లో మాత్రం ఒకరి నుండి మరొకరికి సోకె వ్యాధులు ఇంకా పూర్తిగా తగ్గు ముఖం పట్టకుండానే దీర్ఘకాలిక వ్యాధుల శాతం పెరిగిపోతుంది. దీన్నే రెండు రకాల వ్యాధుల రెట్టింపు భారం అనొచ్చు. అయితే అంటు వ్యాధులను నివారించడానికి పెద్ద పెద్ద సంక్లిష్టమైన వ్యూహాలు అక్కర్లేదు. పరిశుభ్రమైన పరిసరాలు, అంటువ్యాధులు రాకుండా నివారించే టీకాలు, అందరికీ జబ్బుల పట్ల కనీస అవగాహన, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సేవలు – వీటిని సరిగ్గా అమలు చేయగలిగితే అంటువ్యాధులను కట్టడి చేయగలము. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి మాత్రం ఒక సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

పైవాటన్నింటితో పాటు ప్రజల జీవనశైలిలో మార్పులు.. పండించే ఆహారంలో, తినే ఆహారంలో మార్పులు చేపట్టాల్సి ఉంటుంది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ద్వితీయ, తృతీయ వైద్య కేంద్రాలను అనుసంధానం చేయడం వంటివి చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యం చేయలేని పరిస్థితి ఉంటే పైన ఉండే ద్వితీయ/ తృతీయ ఆరోగ్య కేంద్రాలకు (ఆసుపత్రులకు) వెంటనే పంపించే రెఫరల్‌ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. అక్కడ అందే వైద్యం గురించి కింద ఉన్న ప్రాథమిక సెంటర్లకు తిరిగి ఫీడ్‌ బ్యాక్‌ పంపే ఏర్పాటు చేసుకోవాలి.

ప్రస్తుతం మన దేశంలో అన్ని రకాల ఆరోగ్య సేవలు ప్రభుత్వ సంస్థల్లో అందుబాటులో ఉన్నా, ఇచ్చే సేవల్లో నాణ్యత లేకపోవడంతో ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులపైన నమ్మకం సన్నగిల్లింది. అవి కేవలం పేద / నిరుపేద వర్గాలకు చెందిన ఆసుపత్రులుగా మారాయి.ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలన్నీ పై నుండి కిందకి నడిచేవేగానీ ఎక్కడా వికేంద్రీకరణ జరగలేదు. పై నుండి అమలు చేసే కార్యక్రమాలన్నీ మలేరియా, కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్లా విఫలమవుతాయని తెలిసినా, కొత్త వాటిని ప్రవేశ పెట్టడం, వాటికి బడ్జెట్‌ కేటాయించడం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఈ తరహా ఒక్కో జబ్బుకు ఒక్కో కార్యక్రమం (కంటిచూపు, టీబీ, మలేరియా, షుగర్‌, బీపీ, డయాలసిస్‌ సెంటర్లు, క్యాన్సర్‌ సెంటర్లు, మానసిక సెంటర్లు అని వేర్వేరు కార్యక్రమాలు) పెట్టే ఆలోచన మానుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం సాధించే దిశలో ఒక సమగ్రమైన వ్యూహం చేస్తే కొంతైనా ఉపయోగం ఉంటుంది.

ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఉపకేంద్రాలను పునరుద్ధరించి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చాలని చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమైంది. దాన్ని అలాగే కొనసాగించి, అక్కడ వైద్య సిబ్బందిని పెంచి, ప్రాథమిక వైద్యానికి సంబంధించిన పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజల ఆర్థిక భారానికి కారణమవుతున్న మందుల రేట్లను అదుపు చేసి, నాణ్యమైన మందులను అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చే బాధ్యత ప్రభుత్వాలదే. వైద్యాన్ని మొత్తం ప్రయివేటు పరం చేసి, ఇన్స్యూరెన్సు, మందుల కంపెనీలకు ప్రజల ఆరోగ్యాన్ని అమ్మే కార్యక్రమాలు నిలిపేయాలి.

గ్రామాల్లో సేవలు అందిస్తున్న ఆశాలకు, అంగన్వాడీ వర్కర్లకు పర్మినెంటు ఉద్యోగాలు కల్పించాలి. వారికి సరైన వైద్య శిక్షణ ఇవ్వాలి. డాక్టర్లకు, నర్సులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, వారి సేవలను ఉపయోగించుకోవాలి. మనిషి ఆరోగ్యానికి సంబంధం ఉన్న వివిధ రంగాలను – విద్య, ఉపాధి, పారిశుధ్యం, నివాసం, ఆహారోత్పత్తి, వాతావరణం మొదలగు రంగాలన్నింటినీ సమగ్రంగా పునరుద్ధరించుకోవాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. దాంతో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రయత్నాలు జరగాలి.

మన దేశం ఏ స్థానంలో..

దేశం యొక్క ఆరోగ్య సూచికలు, దేశ ప్రజల యొక్క ఆయుష్షు, ఆ దేశం తమ ప్రజల ఆరోగ్యానికి ఎంత జీ.డీ.పీ కేటాయిస్తుందనే అంశంపైన ఆధారపడుతుంది. అమెరికా దేశం దీనికి మినహాయింపు. అక్కడ పెరిగిపోయిన నూతన ఆర్థిక విధానాలు, వైద్య సేవలను ప్రయివేటుపరం చేసి అందరికీ ఇన్స్యూరెన్సు అమ్మే ప్రభుత్వం., మందుల కంపెనీల డొల్లతనం.. తీవ్రమైన ఆర్థిక అసమానతల వల్ల ఆరోగ్య రంగానికి అన్ని దేశాలకు కంటే ఎక్కువ – 16 % జీ.డీ.పీ కేటాయించినా కూడా మెరుగైన ఆరోగ్య సూచికలు అందుకోలేకపోతుంది.

అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలు ఆరోగ్యానికి తమ జీ.డీ.పీ లో కనీసం ఐదు శాతానికి తక్కువగా కేటాయించట్లేదు. మన దేశం మాత్రం గత మూడు సంవత్సరాల్లో 2021, 2022, 2023 లో 1.6 %, 2.2 %, 2.1 % మాత్రమే కేటాయించింది.

సార్వత్రిక ఆరోగ్యం అందించడంలో 2000 లో 30 నుండి 2021లో 63 స్థానానికి చేరుకుంది. మనిషి యొక్క సగటు ఆయుష్షు 70 సంవత్సరాల వరకు పెరిగింది. వైద్య విద్య, బయోటెక్నాలజీ, మందులు, వ్యాక్సిన్ల తయారీలో మన దేశం ముందంజలో ఉంది. నవ జాత శిశ మరణాల సంఖ్య (వెయ్యి జననాలకు) 28కి తగ్గింది. మాతృత్వ మరణాల సంఖ్య లక్ష జననాలకు 97కి తగ్గింది.

అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 2000 నుండి పది లోపే ఉంది. మహిళల్లో, పిల్లల్లో పోషకాహార లోపం, రక్త హీనత ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు పోషక విలువలు లేని ఆహార పదార్థాలు విరివిగా తక్కువ ధరకు అందుబాటులోకి రావడం వల్ల అనారోగ్యకర ఆహారపు అలవాట్లు పెరిగిపోతున్నాయి. ప్యాకెట్స్‌లో వచ్చే బిస్కెట్లు, చిప్స్‌, శీతల పానీయాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుకున్నాయి. ఏ గ్రామంలో ఏ చిన్నారి చేతుల్లో చూసినా బిస్కెట్లు, చాక్లెట్లు, న్యూడిల్స్‌ ప్యాకెట్లు, శీతల పానీయాల బాటిళ్లే కనబడుతున్నాయి.. అంతేగానీ ఎక్కడా పండ్లు తింటున్న, పాలు తాగుతున్న దాఖలాలు లేవు. పండ్లు, కూరగాయలు, పాలు వంటివన్నీ కొనే స్థోమత ఎగువ తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలకే ఉంటుంది.

దిగజారిన ఆర్థిక పరిస్థితులు..

కోవిడ్‌ కాలానికి ముందే ప్రపంచంలోని ప్రజలు వారికి తలకు మించిన ఖర్చులతో సతమతమయ్యేవారు. కోవిడ్‌ తర్వాత ఆ పరిస్థితి మరింత దిగజారింది. వైద్యానికి చేసే ఖర్చులు ఎక్కువయ్యి ప్రపంచంలో కొన్ని కోట్ల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఆరోగ్యం కోసం మనం ఖర్చు పెట్టాల్సిన వ్యయం 10% కంటే మించుతుంది. అంటే, అది తలకు మించిన ఆర్థిక భారం కిందే లెక్కేయాలి. తీవ్రమైన ఆర్థిక భారం అంటే ఆరోగ్యం కోసం చేసే ఖర్చుల వల్ల ప్రజలు వారి మనుగడకు అవసరమైన వ్యవహారాల్లో – తినే ఆహరం, నివాసం, బట్టలు, విద్యపైన పెట్టే ఖర్చులు తగ్గిస్తారు. అలాంటి కుటుంబాల శాతం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. 2000లో అలా ఆర్థిక భారం ఉన్న కుటుంబాలు తొమ్మిది శాతం ఉంటే, ఇప్పుడు అది 14 శాతానికి పెరిగింది. 2020లో ప్రపంచంలో ప్రతిరోజూ 800 మంది మహిళలు నివారించదగ్గ గర్భం, ప్రసవ సంబంధిత వ్యాధులతో చనిపోయారు. అంటే, ప్రతి రెండు నిమిషాలకు ఒక తల్లిని ఈ ప్రపంచం కోల్పోయింది.

ఆరోగ్య హక్కు చట్టం..

అన్నింటికీ మించి ‘ఆరోగ్య హక్కు చట్టం’ అత్యవసరం. ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే అందుకు వైద్యం చేయించుకోవడం అనేది హక్కుగా ఉండాలి. ఎలాంటి అసమానతలు లేకుండా అందరికీ ఒకేవిధమైన వైద్యం అందాలి. ఆ విధంగా ఒక చట్టం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని ప్రజారోగ్య వేదిక ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఇన్సూరెన్స్‌లు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఖర్చుపెట్టేకన్నా.. ఆ మొత్తాన్ని ప్రజలందరికీ సమయానికి వైద్యం అందేలా చూడాలి. అది ప్రతి పౌరుని హక్కుగా ఉండాలి.

యుహెచ్‌సి డే 2023 థీమ్‌

అందరికీ ఆరోగ్యం.. చర్యలు తీసుకోవడానికి ఇదే సమయం. ప్రపంచ దేశాలన్నీ ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలని మరోసారి నిర్ణయించుకున్న సందర్భంగా, ఆ దిశలో తిరిగి ప్రయాణించడానికి తక్షణ మరియు స్పష్టమైన అడుగులు వేయడానికి ఇదే సమయం.

➡️