ఊహల ఉయ్యాల

Jan 7,2024 07:18 #Poetry, #Sneha
imagination poetry

 

గాలిలో పక్షిలాగ

కలలుగన్న సౌధాలకు.. యథేచ్ఛగా

తెగిన గాలిపటంలా నింగిలోన

సయ్యాటకు విహారంగా

ఎగిరిపోతే ఎంత బాగుండు..!

సమస్యల పొగనంతా చిమ్నీతో

వొదులుకుంటూ రాకెట్‌లా

గగనానికి వేగంగా తలంలోని

తరంగాలను ఛేదిస్తూ అవలీలగా

ఎగిరిపోతే ఎంత బాగుండు..!

హంసతల్పంపై ఆదిశేషులా

పవళిస్తూ పరవశంగా

పొగమంచుల సోయగాల్ని

ఆస్వాదిస్తూ.. హాయిగా

ఎగిరిపోతే ఎంత బాగుండు..!

పర్వతాల సొగసుల్ని..

హస్తాలతో ముద్దాడుతూ..

కొండల్ని, గుట్టల్ని..

కోతిలాగ గెంతుకుంటూ

వరుస పక్షులతో పోటీపడుతూ

ఎగిరిపోతే ఎంత బాగుండు..!

ఏడేడు సంద్రాలను.. ముల్లోక పీఠాలను

ఎత్తైన ద్వారాలను.. ఏలుబడులను

నిశితంగా గమనిస్తూ..

నింగినంత పరికిస్తూ..

ఎగిరిపోతే ఎంత బాగుండు..!

ఎన్నెన్నో గుహలు.. మరెన్నో జీవరాశులు..

విధ్వంసాల విచిత్రాలను..

సృష్టిలోని వింతలను

అచ్చెరువుతో తిలకిస్తూ.. తిన్నగా సాగిపోతూ

ప్రకృతిని పలకరిస్తూ.. ప్రపంచం చుట్టిరాను..

ఎగిరిపోతే ఎంత బాగుండు..!

 

  • ఎన్‌ నారాయణ – 9550833490
➡️