చీకటి లోకంలో.. చదువుల చుక్కలు..

Dec 31,2023 09:05 #Sneha

‘సర్వేంద్ర్రియానాం నయనం ప్రధానం’ అనే నానుడి అందరం విన్నదే. అంటే ఇంద్రియాలన్నింటిలో కన్ను ముఖ్యమైనది అని. మనం ఆ కళ్ళతోనే అందమైన దృశ్యాలను చూసి పరవశించిపోతాం. కరెంటు పోతే నిమిషాల్లోనే అంధకారాన్ని భరించలేక ఇబ్బందిపడతాం. మరి పుట్టుకతోనో, ప్రమాదవశాత్తూనో కళ్ళు కోల్పోయి బతుకు దుర్భరమైతే..! జీవితమే అంధకారమైతే..! అందరూ మాట్లాడుకునే ప్రపంచాన్ని అసలు తెలుసుకోలేకపోతే..! మీకు నేనున్నానని అభయమిచ్చేదే ‘బ్రెయిలీ’. అదెలా అంటే..! దృష్టిలోపం ఉన్న వారు చేతి వేళ్ళతో స్పర్శించి అక్షరాలను, అంకెలను నేర్చుకునేలా అమర్చిన చుక్కల నమూనాతో కూర్చిన చదువే బ్రెయిలీ. ఈ నమూనాలోని చుక్కల అమరికలో అక్షరాలు, సంఖ్యలు, విరామ చిహ్నాలు, ఇతర గుర్తులు ఉంటాయి. వాటిని చేతివేళ్ళ కొసల స్పర్శతో గుర్తిస్తారు. అలాంటి బ్రెయిలీని ఆవిష్కరించింది లూయిస్‌ బ్రెయిలీ అనే అంధుడు. ఈయన 1809, జనవరి 4వ తేదీన ఫ్రాన్స్‌లో జన్మించారు. ఆయన గౌరవార్థం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతి జనవరి 4న నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి 2018లో నిర్ణయించింది. ఆ సందర్భంగానే ఈ ప్రత్యేక కథనం.

ఫ్రాన్స్‌కు చెందిన లూయీస్‌ బ్రెయిలీ ప్రమాదవశాత్తూ చిన్నతనంలోనే అంధుడిగా మారడంతో పదేళ్ల వయస్సులో అంధ పాఠశాలలో చేరాడు. అప్పుడే.. మరింత సులభంగా చదువు నేర్చుకోవాలంటే..! అనే ఆలోచనకు బీజం పడింది అతనికి. అంతే.. వేలికొనల స్పర్శతో చదువు నేర్చుకునేలా చుక్కలతో ఒక ప్రత్యేక కోడ్‌ను రూపొందించాడు. ఆ కోడ్‌ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అంధులకు వెలుగును పంచుతోంది. దానికి ఆయన పేరునే ‘బ్రెయిలీ లిపి’ అని నామకరణం చేశారు.

రూపకల్పన..

బ్రెయిలీ లిపిలో 63 అక్షరాలు, అంకెలు, గుర్తులు ఉంటాయి. వీటిని సెల్స్‌ రూపంలో అమర్చారు. ఒక్కొక్క సెల్‌లో ఒకటి నుండి ఆరు చుక్కలు ఉంటాయి. ఈ ఆరు చుక్కలు 3-బై-2 కాన్ఫిగరేషన్‌లో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్క చుక్క దాని స్థానాన్ని బట్టి ఒక అక్షరంగా.. లేదా అంకెగా గుర్తించాలి. అవే పదాలుగా, సంఖ్యలుగానూ చదివే సౌలభ్యంతో సమకూర్చారు. ప్రతి పంక్తిలో ఆ చుక్కలను ఎడమ నుండి కుడికి చేతితో స్పర్శిస్తూ బ్రెయిలీని చదువుతారు. చుక్కలు ఎత్తుగా ఉండి, ఏ స్థానంలోని చుక్కను ఎలా పలకాలి అనే స్పష్టత ఉంది ఈ లిపి కూర్పులో.

సామాజిక దృష్టి అంధత్వం

దృష్టి అంధత్వం ఉన్న వ్యక్తులు సామాజికంగా నిర్లక్ష్యానికి గురవుతున్నప్పటికీ అనేక రంగాల్లో రాణించిన ఆణిముత్యాలూ ఉన్నారు. ఇది వారి ఆత్మస్థైర్యానికి, నిబద్ధతకు నిదర్శనం. అంతేకాదు.. మాకు కాదు వైకల్యం.. మమ్మల్ని హేళన చేసే మీకే అని సమాజానికి చెంపపెట్టులా నిలిచారని మనం అర్ధం చేసుకోవాలి.

ఆణిముత్యాలు..

యువ సిఇవో.. పర్యావరణ సహిత కాగిత ఉత్పత్తి కంపెనీ నిర్మాతగా వెలుగొందుతున్న ఆంధ్రప్రదేశ్‌, మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్‌ బొల్లా. ఈయన జీవితం ఆధారంగా బాలీవుడ్‌ సినిమా తెరకెక్కనుంది. ఇండియన్‌ ఐడల్‌గా గణతికెక్కిన మేనుక పౌడల్‌.. రేడియో జాకీగా గళమెత్తిన ఢిల్లీకి చెందిన రేషమ్‌ తల్వార్‌.. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌లో అడుగిడిన చెన్నైకు చెందిన జెఫిన్‌.. ఐఎఎస్‌ అధికారిణిగా రాణించిన మహారాష్ట్రకు చెందిన ప్రాంజల్‌ పాటిల్‌.. 68 ఏళ్ల సీనియర్‌ న్యాయవాది సంతోష్‌కుమార్‌ రుంగ్తా.. అమెరికాకు చెందిన జస్టిస్‌ బెర్న్‌స్టెయిన్‌ మిచిగాన్‌ విశ్వవిద్యాలయం నుండి ఫై బీటా కప్పా గ్రాడ్యుయేట్‌.. నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ లా.. న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ను పొందిన ఘనులు. హెలెన్‌ ఆడమ్స్‌ కెల్లర్‌ (జూన్‌ 27, 1880 – జూన్‌ 1, 1968): హెలెన్‌ ఆడమ్స్‌ కెల్లర్‌ ఒక అమెరికన్‌ రచయిత్రి, కార్యకర్త. వీరంతా అంధత్వాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలందుకున్నవారే.

గాయనిగా మేనుక పౌడల్‌..

మేనుక పౌడల్‌ ఒక నేపాలీ గాయని. పుట్టుకతోనే అంధురాలు. ఆమె చిన్నప్పటి నుంచే సంగీతం అంటే మక్కువ చూపేది. తల్లిదండ్రులు కూడా ఆమె ఆసక్తిని గుర్తించి, శాంతాక్రూజ్‌లోని సురేష్‌ వాడ్కర్‌.. అజీవసన్‌ మ్యూజిక్‌ అకాడమీలో సంగీత శిక్షణ ఇప్పించారు. తనకున్న వైకల్యాన్ని అధిగమించి మేటిగా నిలిచింది. దానికి ఆమె కుటుంబ సహకారం ఉంది. మేనుక 2018లో నేపాల్‌ రియాలిటీ షోలో పాల్గొని, పలువురి ప్రశంసలు అందుకుంది. భారతీయ సింగింగ్‌ రియాలిటీ షో ‘సా రే గా మా పా’కీ ఎంపికైంది.మన దేశంలో సంగీత పరంగా అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ టీవీ షో.. ఇండియన్‌ ఐడల్‌. మేనుక 14వ సీజన్‌కి ఎంపికయి, ఇండియన్‌ ఐడల్‌గా గోల్డెన్‌ మైక్‌నందుకుంది.

చేర్పులు, వైవిధ్యంతో సాధికారత!

ఇదే ఈ సంవత్సరం థీమ్‌. టెక్నాలజీ పరంగా వచ్చిన కొత్త చేర్పులు.. మూసతనం నుంచి వైవిధ్యమైన మార్పులతో కూడిన బ్రెయిలీ లిపి నవ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నది ఈ ఏడాది థీమ్‌ ఉద్దేశ్యం. ఐక్యరాజ్యసమితి 2018లో ఈ రోజు ప్రాముఖ్యతను ప్రకటిస్తే, అధికారికంగా మొదటి వేడుక 2019లో జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.దృష్టి లోపం ఉన్న వ్యక్తుల్లో బ్రెయిలీ అక్షరాస్యతను ప్రోత్సహించడం, సమాచార సేకరణ, చదువు, సంస్కృతులను ఇతరులతో సమానంగా వారూ పొందగలిగే హక్కును నొక్కి చెప్పడమే ఈ సంవత్సర థీమ్‌ లక్ష్యం.

తెలియజేయాలి..

బ్రెయిలీ గురించి, అది ఎందుకు ముఖ్యము అనే విషయాలను ప్రజలకు తెలియచెప్పాలి. ప్రచారానికి వీలైనంతగా సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని, ప్రజల అవగాహనకు తీసుకు రావచ్చు. ఇది అంధులకు ఎలా సహాయపడుతుందో సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాల ద్వారా తెలియచేయాలి.

కిం కర్తవ్యం..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. అలాగే బ్రెయిలీలోనూ ఆధునికత చోటుచేసుకుంది. కానీ అది అవసరార్థులకు అందుబాటులోకి తీసుకురావలసిన బాధ్యత పాలకులదే. ఇవాళ అంధ విద్యార్థులకు ఎలక్ట్రానిక్‌ మీడియాలో యాప్స్‌ ఉన్నా, వారికి చేరడం లేదు. అందుకని వాటిపై ఆధారపడటం కంటే బ్రెయిలీలో చదవడమే మంచిదని నిపుణుల సలహా.

కంప్యూటరీకరణ..

బ్రెయిలీ కోడ్‌.. పుట్టి రెండొందల సంవత్సరాలైతే, భిన్న భాషలతో కూడిన మనదేశంలోనూ భారతీ బ్రెయిలీ.. తయారై డెబ్భై సంవత్సరాలైంది.

అన్నింటిలో చోటుచేసుకున్న టెక్నాలజీ బ్రెయిలీలో రాకుంటే ఆధునిక బ్రెయిన్‌ ఊరుకుంటుందా! ఆ ఫలితమే బ్రెయిలీ కంప్యూటరైజ్డ్‌ అయింది. అంటే కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపించే అక్షరాలను బ్రెయిలీలోకి మార్చడానికి ఎలక్ట్రానిక్‌ పిన్‌లను కదుపుతూంటే బ్రెయిలీ కాన్ఫిగరేషన్‌ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.

మే 1972లో గాలార్నో ‘కన్వర్టో-బ్రెయిలీ’ అభివృద్ధి జరిగింది. ఇది ఇంట్లో తయారుచేసిన ఎలక్ట్రో మెకానికల్‌ కంప్యూటర్‌ టెలిటైప్‌ మెషీన్‌తో అనుసంధానించబడింది. ఇది నిమిషానికి 100 పదాల చొప్పున టెక్స్ట్‌లను స్కాన్‌ చేసి, బ్రెయిలీలోకి అనువదించగల కెపాసిటీని కలిగి ఉంది.

ఎల్‌ బ్రెయిలీ 14- పోర్టబుల్‌ బ్రెయిలీ. అత్యాధునిక బ్రెయిలీ నోట్‌టేకర్‌ సొల్యూషన్‌గా వచ్చింది. స్లేట్‌, స్టైలస్‌, బ్రెయిలీ రైటర్‌, ఎలక్ట్రానిక్‌ బ్రెయిలీ నోట్‌టేకర్‌, బ్రెయిలీ ఎంబాసర్స్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసి, బ్రెయిలీని రాయవచ్చు.

మరింత స్మార్ట్‌ బ్రెయిలీ డిస్‌ప్లే ‘బ్రెయిలీ మి’. అంటే కొత్తగా రిఫ్రెష్‌ చేయగల బ్రెయిలీ. దీనిలో డిస్‌ప్లే 6-డాట్‌, 20-సెల్‌ డిస్‌ప్లే, పెర్కిన్స్‌ స్టైల్‌ కీబోర్డ్‌తో ఉంటుంది. దీనిలో మైక్రో USB, SD కార్డ్‌ స్లాట్‌, DC జాక్‌ ఉంటాయి.

సహకారం.. సాకారం..

ఏ కాపీరైట్‌తో సంబంధం లేకుండా, బ్రెయిలీ, ఆడియో, పెద్ద ముద్రణలు, ఎలక్ట్రానిక్‌ టెక్స్ట్‌ వంటివి అంధులకు, పాక్షికంగా దృష్టిలోపం ఉన్న వారికి అందుబాటులో ఉండాలి. ఈ ఫార్మాట్స్‌లో పబ్లిక్‌ డొమైన్‌లోని మొత్తం సమాచారం ఉండాలి. అదనపు ఖర్చు లేకుండా, సకాలంలో అందేలా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ గొంతెమ్మ కోరికలేమీ కాదు. వారి చట్టపరమైన హక్కులే. ఆసుపత్రులు, పబ్లిక్‌, ప్రభుత్వ విభాగాలు, బ్యాంకుల సేవలు, పబ్లిక్‌ సర్వీసుల నుండి అన్నిరకాల సమాచారం అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ప్రభుత్వాలు పూనుకుంటే సునాయాసంగా సాధ్యమవుతాయి.పాఠ్యపుస్తకాలతో పాటు సాహిత్యం, కథలు, గ్రంథాలు, పురాణాలు తదితర పుస్తకాలన్నీ బ్రెయిలీలో అందుబాటులో ఉంటే.. వారికిష్టమైనవి చదువుకునే స్వేచ్ఛ ఉంటుందనీ, ఆత్మ విశ్వాసం పెరుగుతుందనీ అంటున్నారు నిపుణులు. ఇప్పటికీ బ్రెయిలీ అక్షరాస్యత సరిగా లేకపోవడంపై పాలకులు దృష్టిపెడతారని కోరుకుందాం. అప్పుడే మరెన్నో మాణిక్యాలు వెలుగులోకి వస్తారని ఆశిద్దాం.

టి. టాన్యా7095858888

 

➡️