ఆమెను ప్రేమించు

Mar 3,2024 10:36 #Poetry, #Sneha, #Women's Day

ఆమె మనసు బాధ పడితే

పువ్వులు వాడిపోతాయి

పక్షులు పారిపోతాయి

నదులూ వెన్నెలా వేకువా చిన్నబోతాయి

 

ఆమెను ప్రేమించు

ఉల్లిపొర లాంటి జీవితం మీద

ఒక్కో అవయవాన్ని ఒక్కో రంగుతో అద్ది

నిత్యమూ మరో కొత్త జీవితాన్ని ముద్రించే

అద్భుత చిత్రకారిణి ఆమె-

అర విరిసిన నేత్రాల్లాంటి ఆమె

అన్ని అవయవాల సాక్షిగా

 

కోటి చేతులతో ఆమెను కౌగిలించుకో

ఒక్క పరిష్వంగం చాలు

శత సహస్ర మంచు పర్వతాలు

మరిగి కరిగి విరిగి పెరిగి

కిలకిలల కల్హారాల అలల మీద

ఇక ఒక అమరలోక ప్రయాణమే-

 

ఆమె మనసు దుఃఖపడితే

చిన్నపిల్లలూ చినుకులూ

చెట్లతో కలిసి నీడల్ని

మూటలు మూటలుగా మోసుకుంటూ

సముద్రాలను వెంటేసుకుని

పర్వతాలను పట్టుకుని

ఏ కృష్ణబిలాల్లోకో

కనుమరుగైపోతారు

 

ఆమెను ప్రేమించు

అనంత లోయల నుంచి దిగంతాల దాకా

విస్తరించిన ఇంద్రధనుస్సు లాంటి

వర్ణ వర్ణాల ఒక్క చిరునవ్వుతో

నిన్నూ నన్నూ ప్రపంచాన్నీ

పసిపాపలుగా మార్చి జోల పాడుతుంది

ఆమె కనురెప్పల వెనుక కదిలే

కలహంసల వెనక తిరిగే

వెలుగు గోళాల వెనక కురిసే

కలల పూల ప్రేమ సంగీతం

విని తరించి మరణించి

మరో జీవితాన్ని కొత్తగా ప్రారంభించు

నవజాత శిశువులాంటి

ఆమె అధరం మీద

ఒక్క నవ్వు పూయించు

అదే ఒక మహాద్భుత కావ్యం!

 

ఆమె ప్రేమిస్తే వెన్నెల-ద్వేషిస్తే

శతకోటి అగ్నిగోళాల జల్‌ జలా!

  • డా. ప్రసాదమూర్తి8, 4998 66699

 

➡️