పిల్లలతో చాలా ఎంజారు చేస్తా…

Dec 17,2023 14:53 #actor, #Sneha
nani interview

చిరంజీవి తర్వాత ఏ అండదండలు లేకుండా స్వయంగా ఎదిగి, పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్‌ని సంపాదించుకున్న హీరో నాని. నటుడు కాకముందు ఆయన ఓ సహాయ దర్శకుడుగా, రేడియో జాకీగా పని చేశారు. విజయాలు, అపజయాలు చూసుకోకుండా కథను మాత్రమే నమ్ముకుని, ముందుకు వెళుతున్న వ్యక్తి. కొత్త దర్శకులను, నిర్మాతలను ప్రోత్సహించడంలో ముందుంటారు. ఆ క్రమంలోనే శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘హారు నాన్న’ సినిమా తీశారు. ఇందులో హీరోగా నాని నటించారు. అందులో తన నటన, ఎమోషన్స్‌తో పేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడిన ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు మీ కోసం…

నానిగా అందరికీ సుపరిచితమైనా.. తన అసలు పేరు నవీన్‌బాబు ఘంటా. తల్లిదండ్రులు రాంబాబు, విజయలక్ష్మి. పుట్టిన ఊరు చల్లపల్లి (కష్ణాజిల్లా). అయితే నాని కుటుంబం అతని చిన్నతనంలోనే హైదరాబాద్‌లో స్థిరపడింది. నానికి ఓ అక్క ఉంది. విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. కాలేజీ వయస్సు నుంచే సినిమాల్లో నటించాలని ఉండేది. నటుడిగా అవకాశాల కోసం ఫోటో ఆల్బమ్స్‌ పట్టుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగారు. చిన్న పాత్రలకు కూడా అవకాశాలు రాకపోవడం, డబ్బులు తీసుకుని మోసపోవడం లాంటి సంఘటనలతో ఆ ప్రయత్నాలు పక్కనబెట్టి, దర్శకత్వ శాఖలో అవకాశాల కోసం ప్రయత్నించసాగారు. మొదట దర్శకుడు బాపు దగ్గర క్లాప్‌ అసిస్టెంట్‌గా చేసి, కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. కొన్నాళ్ళు రేడియో జాకీగా కూడా పనిచేశారు. ‘అష్టా చెమ్మా’ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఆ సినిమాలో రాంబాబు పాత్రకు ఆడిషన్స్‌ జరుపుతుండగా అక్కడి వాళ్ళకి నటన ఎలా చేయాలో చేసి చూపుతున్న నానిని చూసి, అతనికే ఆ పాత్ర అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో నాని జీవితం మారిపోయింది. నటుడిగా తన ప్రతిభ నిరూపించుకునే అవకాశం దక్కింది. తర్వాత ‘రైడ్‌, స్నేహితుడా’ సినిమాలు ఒకే ఏడాది విడుదలై మంచిపేరు తెచ్చిపెట్టాయి. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘ఈగ’ సినిమాతో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన నటనతో నేచురల్‌ స్టార్‌గా పిలువబడుతున్నారు. నాని జీవితంలో మరిచిపోలేని సినిమాగా ‘ఈగ’ చిత్రం నిలిచింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు అపజయాన్ని అందించాయి. 2015లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోరు, కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్‌ మ్యాన్‌, మజ్నూ, నేను లోకల్‌, నిన్ను కోరి, మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ వరకూ వరుసగా ఎనిమిది చిత్రాలు విజయాలను అందుకొని, స్టార్‌ హీరోగా మారిపోయారు.హీరోగానే కాదు.. నాని నిర్మాతగా ‘డీ ఫర్‌ దోపిడీ, అ!, హిట్‌-2’ అనే చిత్రాలను నిర్మించారు. ఓ టీవీలో ప్రసారం అయిన ‘బిగ్‌ బాస్‌-2’ సీజన్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు నాని. అప్పట్లో బిగ్‌బాస్‌లో వివాదాలు జరిగాయి. దాంతో నానిని విమర్శిస్తూ సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ చేశారు. అయినా నాని అవేమీ పట్టించుకోలేదు. హీరో నాగార్జున అక్కినేనితో ‘దేవదాస్‌’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ‘జెర్సీ’ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇందులో కొడుకుతో తనకు ఉన్న అనుబంధం, ప్రేమ వర్ణించలేనిది. ఇదే సినిమాకు మంచి విజయాన్ని అందించింది. మళ్లీ ఓ కూతురుతో ‘హారు నాన్న’ లో నటించారు.’పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ప్రయాణాల్లో కానీ, విమానాశ్రయాల్లో కానీ పిల్లలతో పెద్దవాళ్లు ఇబ్బంది పడుతున్నప్పుడు ”కాసేపు నేను చూసుకోనా?” అని చెప్పి, దగ్గరికి తీసుకుంటుంటా. వాళ్లూ నాతో అంతే సౌకర్యంగా ఉంటారు. ‘జెర్సీ’లోనూ, ‘హారు నాన్న’లోనూ చిన్న పిల్లలతో కలిసి నటించా. చాలా సరదాగా అనిపించింది. మా అబ్బాయి జున్ను నన్ను ‘నాన్న’ అనే పిలుస్తుంటాడు. తను నాతో ఇంగ్లీష్‌ మాట్లాడటానికి ప్రయత్నిస్తే నేను వినను. ఆ తర్వాత వాడే అర్థంచేసుకుని, తెలుగులో మాట్లాడుతుంటాడు’. అని పిల్లలతో ఎంత కంఫర్టబుల్‌గా ఉండేదీ వివరించారు.

➡️