మన సంరక్షకులు

Jun 16,2024 08:27 #Poetry, #Sneha, #special children

అనగనగా ఒక రోజు
నిద్రలేచే బుజ్జి రాజు
తను నాటిన మొక్క పైకి
ఎదుగుట గమనించె

లేత పచ్చ ఆకులన్ని
రాజు తడిమి చూచినాడు
రక్షించగ గొడుగుపట్టి
రాజు పూనుకొన్నాడు!

నీరుపోసి ఎరువువేసి
మొక్కను కాపాడినాడు
మొక్క వలే తనుకూడా
పెరిగి పెద్దయైనాడు!

నీడికింద సేదదీరు
ఫలాలనే పంచుచుండు
ప్రాణవాయువును పీల్చగ
చెట్టు క్రింద చేరు చుండు!

”ఓహౌ ఈ చెట్టు చూడు
ఉపకారం చేయగోరు
దోసెడు నీటిని పోస్తే
గంపెడు పండ్లీయగోరు!

పిల్లలు తోడుండలేరు
బంధువులే దరికిరారు
వృద్ధాప్యం వెంటాడగ
మూడోకాలైనది గద!

ఆకులతో వచ్చు రుతువు
కొమ్మలు కోకిలల కొలువు
పరులకొరకు బ్రతుకు తనువు
పురుగూ, పుట్రకు నెలవు

అపకారపు మానవులు
ఉపకారము చేయబోరు
అణువణువూ ఇచ్చుతరువు
అయినా పది నాటబోరు!

విషవాయు పీల్చు చెట్టు
ప్రాణవాయువును పెట్టు
అయినా ఈమానవుడు
తరువుకు గొడ్డలి పెట్టు!

బంధాలను పోషించడు
బాధ్యతలను నెరవేర్చడు
కదలని ఈ వృక్ష విధులు
కలనైనా చేయబోడు!”

అనుచు రాజు తలపోయుచు
గతమంతా నెమరు వేసె
మనవళ్ళకు మొక్కలిచ్చి
తలా ఒకటి నాటించెను!

– కిలపర్తి దాలినాయుడు
94917 63261

➡️