పెప్పర్‌తో పడిశం మాయం..

Dec 24,2023 12:30 #Sneha

చలికాలం ప్రారంభమైతే, దగ్గు, జలుబు వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కొందరిలో ఇవి చాలాకాలం సతాయిస్తాయి. వాతావరణంలో చల్లటి గాలి ప్రభావంతో దగ్గు, గొంతునొప్పి, జలుబు ఇబ్బంది పెడతాయి. అయితే మందులు వాడినా, కొద్దిరోజుల్లో మళ్లీ అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి జలుబు, దగ్గుకు దూరంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. చలికాలంలో మనం తీసుకునే ఆహారంలోనే మన ఆరోగ్య రహస్యం దాగి ఉంది. రోజూ తీసుకునే ఆహారంలో నల్ల మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల ఈ సీజనల్‌ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. నల్ల మిరియాలను నల్ల బంగారం అని కూడా అంటారు. నల్ల మిరియాలలో చాలా ఆరోగ్యకరమైన అంశాలు ఉన్నాయి. అందుకే ఇవి విలువైనవిగా పరిగణింపబడతాయి. ఆయుర్వేదంలో వీటిని విశిష్టంగా వాడతారు.

నల్ల మిరియాలు కొవ్వు కణాలను కరిగించే లక్షణాలను కలిగి ఉంటాయి. బరువు తగ్గడానికీ ఇవి దోహదపడతాయి. శరీర నిర్విషీకరణ (డీకాక్సిఫికేషన్‌), అలెర్జీల వంటి సమస్యలు ఉంటే, ఇవి ఎంతగానో సహాయపడతాయి. నల్ల మిరియాలు నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయాలను శుభ్రపరచడానికి దారితీస్తుంది. క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కూడా వీటిలో మెండుగా ఉన్నాయి. రెగ్యులర్‌గా వాడటం వల్ల అనేక రకాల క్యాన్సర్‌ కణాలు శరీర అవయవాలపై ప్రభావం చూపకుండా నిరోధిస్తుంది. ఆహారంలో నల్లమిరియాలు జోడించడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. కొన్ని ఆహారాలు అజీర్తిని కలిగిస్తాయి. దీనిని నివారించడానికి, నల్ల మిరియాలు ఉపయోగించడమే ఉత్తమం.

జుట్టు రాలకుండా ఆపడానికి నల్ల మిరియాలు ఒక ఔషధంలా పనిచేస్తాయి. నల్ల మిరియాల పొడిని, త్రిఫల పొడిని కలిపి జుట్టు రాలే ప్రాంతంలో అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. త్రిఫల పొడి మూడు ఫలాల మిశ్రమం. కఫ, వాత, పిత్త లక్షణాలను తొలగించడంలో సహాయపడుతుంది. మన రక్తానికి సరైన మొత్తంలో చక్కెర స్థాయి అవసరం. ఆహారంలో హెచ్చుతగ్గులున్నప్పుడు ఈ చక్కెర శాతం తగ్గవచ్చు, పెరగవచ్చు. కానీ బ్లాక్‌ పెప్పర్‌ గ్లూకోజ్‌ మెటబాలిజంను బ్యాలెన్స్‌ చేస్తుంది. వారసత్వంగా మధుమేహం ఉన్నవారు నల్ల మిరియాలు కలిపిన ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. నల్ల మిరియాలు చర్మ రక్షణకు సహాయపడతాయి. మొటిమలు, ముడతలు వంటి చర్మ సంబంధిత సమస్యలకు ఇవి పరిష్కారం చూపు తాయి. నల్ల మిరియాలు అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందికి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయి. అలాంటప్పుడు వైద్యుల్ని సంప్రదించడం మంచిది.

➡️