ఇవి నేర్పిస్తున్నారా?!

Feb 4,2024 09:30 #Children, #Sneha
parenting children education

పిల్లలు పిడుగులు.. అదే సందర్భంలో.. వాళ్లని మనం ఎలా మలిస్తే అలా తీర్చిదిద్దబడతారు.. ముద్దు ముద్దు మాటలు చెప్తుంటే మురిసిపోతాం.. అదే సందర్భంలో కొన్ని అనకూడని మాటలు.. చేయకూడని పనులు చేస్తుంటారు. అలాంటప్పుడు తప్పని చెప్పాల్సింది తల్లిదండ్రులే. పిల్లలు కొన్ని అలవాట్లు చిన్నప్పుడే అలవర్చుకుంటారు. అందుకు కొంచెం శ్రద్ధ పెట్టాల్సింది మాత్రం తల్లిదండ్రులే.. పిల్లలు వెన్న ముద్దలు.. సుతిమెత్తని భావాలకు స్పష్టత వచ్చేలా చేయాల్సింది తల్లిదండ్రులే. పెద్దల పట్ల గౌరవం వ్యక్తం చేయడం దగ్గర నుంచి వస్తువుల విలువ తెలిసేలా చేయడం వరకూ అన్నీ నేర్పుకుంటేనే నేరుస్తారు అంటున్నారు నిపుణులు.

పిల్లలు రేపటి భావి పౌరులు.. మంచి పౌరులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. వాళ్లని మంచి విషయాల్లో ప్రోత్సహిస్తే, చక్కగా తయారవుతారు. అలాకాకుండా పట్టనట్లు ఉంటే ఆ తర్వాత చింతించాల్సింది మొదట తల్లిదండ్రులే. ఆనక సమాజం మీదా ప్రభావం పడుతుంది. అందుకే అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పకనే చెప్తున్నారు నిపుణులు.

విష్‌ చేయడం..

గతంలో పిల్లలు పెద్దల్ని చూడగానే నమస్కరించేవారు. కూర్చోమంటూ మర్యాదలు చేసేవారు. మంచినీళ్లు తాగుతారా అని అడిగేవారు. ఇప్పుడు పిల్లలు ఇంటికొచ్చిన వారిని అసలు చూడను కూడా చూడటం లేదు. కొందరైతే మొబైల్‌లో మొహం పెట్టి అందులోనే లీనమై ఉంటారు. ‘చింటూ.. అదిగో అంకుల్‌ వచ్చారు.. విష్‌ చెయ్యి. అమ్మమ్మ వచ్చింది చూడు.. వెళ్లి హగ్‌ చేసుకో..’ అంటుంటే కూడా ఒక లుక్‌ వేసి, మళ్లీ వాళ్ల వద్ద ఉన్న ఫోన్‌లో మునిగిపోతున్నారు. ఇలాంటి అలవాట్లు సరిజేయాల్సింది తల్లిదండ్రులే.. పిల్లలకు అలా వ్యవహరించడం తప్పు అని అర్థమయ్యేలా చెప్పాలి. ప్రేమానురాగాలు అల్లుకుంటేనే అనుబంధాలు బలపడతాయంటున్నారు నిపుణులు. వచ్చిన వారితో మర్యాదనే కాదు.. ప్రేమగా పలకరించడం ప్రధానం. ఇలా తయారుకావాలంటే అందుకు తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి.

ప్రశ్నకు ప్రోత్సాహం..

పిల్లలకు సహజంగానే చిన్నప్పుడు ఏది చూసినా అబ్బురంగా అనిపిస్తుంది. అలాగే బోలెడు సందేహాలు కలుగుతాయి. విత్తనం నుంచి మొక్క మొలచినా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘అది ఎలా వచ్చింది? రక్తం ఎర్రగా ఎందుకుంది? జుట్టు నల్లగా ఎందుకుంది? అమ్మమ్మ జుట్టు తెల్లగా ఎందుకుంది? ఆకులు పచ్చగానే ఎందుకున్నాయి? ఆకాశం పైన ఎందుకుంది. చందమామ, సూర్యుడు ఆకాశం అలా ఎలా ఉన్నారు. ఒకటి పగలు వస్తే, ఇంకోటి రాత్రి ఎందుకు వస్తుంది?’ ఇలా అనేక ప్రశ్నలు సంధిస్తారు. ఈ ప్రశ్నలకు ఏమాత్రం చికాకు పడకుండా వివరించాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే అంటున్నారు నిపుణులు. అవసరమైతే వాటికి జవాబులు తెలుసుకునైనా తీర్చాల్సింది పేరెంట్సే. అది పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రశ్నించడాన్ని ప్రోత్సహించాలి.. అప్పుడే వారి మనుసులు వికసితమవుతాయి.

పూర్తి చేయడం..

పని మొదలు పెడితే.. ఎలాగైనా పూర్తి చేయాల్సిందనే పట్టుదల ఉండాలి. అదీ సకాలంలో పూర్తి చేయాలనే అప్రమత్తత ఉండాలి. సహజంగా పిల్లలు మొదట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు అంతా బాగా జరిగితే ఓకే.. లేకపోతే దాన్ని అలాగే మధ్యలో వదిలేస్తుంటారు. ఇలాంటి అలవాటును ఎలాంటి పరిస్థితుల్లో ప్రోత్సహించకండి. అలాగే ఏదైనా పని ఉంటే ఒక పట్టాన మొదలుపెట్టరు. రేపు కదా ఇవ్వాల్సింది. సాయంత్రం చేయొచ్చులే అని వాయిదాలు వేస్తూ.. చివరి నిమిషంలో మొదలుపెడతారు. పిల్లలు మొక్కలుగా ఉన్నప్పుడే వంగుతారు. ఈ అలవాటు మాని, పని పూర్తయ్యే వరకూ పట్టుబట్టేలా ఉండాలి. అలాగే ఏదైనా పనిని ముందుగానే ప్రారంభించి, సకాలంలో ముగించాలనే పద్ధతి అలవాటు కావాలి. ఇలా చేయడం వల్ల పెద్దయ్యాక వాళ్లు ప్రయోజకులు అవ్వడానికి దోహదపడుతుంది అంటున్నారు నిపుణులు. పిల్లలు పట్టుదలగా చేస్తున్నా.. ఒక్కోసారి తల్లిదండ్రులు వెనక్కి లాగుతుంటారు. అలా అసలు చేయకండి. వాళ్లకు తోడుగా మీరు సహాయపడి త్వరగా పని పూర్తయ్యేలా చూడండి.

వస్తువుల విలువ..

ఏదైనా వస్తువు పాడైపోతే.. దాన్ని పడేసి కొత్తది కొనమంటారు పిల్లలు. అలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో ఆహ్వానించవద్దు అంటున్నారు నిపుణులు. ఆ వస్తువుల విలువ పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వాళ్లకి డబ్బు విలువ, వినియోగం కూడా అవగతమయ్యేది. అందుకే పిల్లలకు వస్తువులు ఏదైనా పాడైపోతే, దాన్ని రిపేరు చేయించి, తిరిగి వాడేలా చూడాలి. ప్రతిసారీ పాడవ్వగానే కొత్తది కొంటే, అదే అలవాటవుతుంది. అందుకే పిల్లలు ముందు వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం కూడా నేర్పాలి. అదే సందర్భంలో వాడే క్రమంలో పాడైతే రిపేరు చేయించుకుని, వాడాలనే ఆలోచన నేర్పాలి.

➡️