పిల్లలతో ఆటలాడించండి..!

Feb 18,2024 10:03 #Children, #Parenting, #Sneha

పిల్లల్ని ఆటల గురించి అడిగితే.. ఆన్‌లైన్‌లో ఏమేమి గేమ్‌ యాప్స్‌ ఉన్నాయో.. అందులో వచ్చే గేమ్స్‌ లిస్టు ఏకరువు పెట్టేస్తారు. తరగతిలో చెప్పిన పాఠం కూడా అంత వివరంగా చెప్పరు. అంతలా పిల్లలు ఆటల పట్ల ఆసక్తితో ఉంటారు. అది వాళ్ల తప్పు కాదు. పరిస్థితులలా ఉన్నాయి. ఈ ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల కళ్లు, మెడ నరాలు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయనేది నిపుణులు చెప్తున్న మాట. తల్లిదండ్రులు, స్కూల్‌ యాజమాన్యాలు వీటి పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆట, పాటలు లేని బాల్యం పరిపూర్ణమైంది కాదు. స్నేహాలు, మానసిక వికాసాలు ఆటల్లోనే ప్రధానంగా జరిగేది. శారీరక వ్యాయామం కలిగేది ఆరుబయట ఆడే ఆటల్లోనే. పిల్లలు ఆటలు ఆడటంతోనే గెలుపు ఓటములు అంగీకరించే తత్వం అలవడుతుంది. సుధ, సుబ్బారావు ఇద్దరూ ఉద్యోగస్థులే. సుధ తను పనిచేసే ఆఫీసుకు దగ్గరలోని స్కూల్లో కొడుకును చేర్చింది. పిల్లవాడి స్కూల్‌ ముందే అయిపోతుంది. వాడిని ఆఫీసుకు తీసుకొచ్చి, తన పని అయ్యాక ఇంటికి వెళ్లడం చేస్తుంది. ఇది రోజూ జరిగేదే. వాడు రాగానే తల్లి ఫోన్‌ తన ఫోనే అన్నంత ఇదిగా తీసుకుని, యాప్‌ ఓపెన్‌ చేస్తాడు. గేమ్స్‌ మాత్రమే కాదు.. పిల్లల కామిక్స్‌, రకరకాల పిల్లలకు సంబంధించిన యాప్స్‌ అన్నీ వాడికి తెలిసినంత వాళ్లమ్మకి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. అంతగా వాటి పట్ల ఆకళింపు ఉంటుంది పిల్లల్లో. అదే పరిస్థితి కరుణ, కమలాకర్‌ది. వాళ్లిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసేది. వాళ్ల పిల్లలిద్దర్నీ ఆఫీసుకే తీసుకొస్తారు. వాళ్లు కూడా రాగానే అమ్మానాన్నల ఫోన్లను చెరొకరూ తీసుకుని కూర్చుంటారు. ఏదైనా తిందాము, తాగుదాము అన్న ధ్యాసే ఉండదు. అంతలా పిల్లలు ఆన్‌లైన్‌ యాప్స్‌కి అలవాటైపోతున్నారు. తర్వాత జరిగే పర్యవసానాలకు తల్లిదండ్రులు బాధపడినా ఉపయోగం లేదంటున్నారు నిపుణులు.

పెద్దలే సరికావాలి..

పిల్లలు ఫోనుకు అలవాటు పడటానికి, ఫోన్‌లోనే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటానికి పెద్దలే కారణమంటున్నారు నిపుణులు. ఆ మాటలు అక్షర సత్యాలు కూడా. కొందరు తల్లిదండ్రులైతే ఫోన్‌ వదలకుండా వాళ్లూ అందులో గేమ్స్‌ ఆడుతున్నారు. వాళ్లు ఫోన్‌ పక్కన పెట్టకుండా పిల్లల్ని ఆపమంటే ఆపుతారా? ఇప్పుడు పిల్లలకు నదురుబెదురు కూడా ఉండటం లేదు. ఏకంగా ‘నువ్వు ముందు ఫోన్‌ పెట్టు.. నేను పెడతాను అప్పుడు!’ అని సమాధానం చెప్తున్నారు. ‘నువ్వు చూడటం లేదా? నన్ను అంటున్నావు?’ అని అడిగే గడుగ్గాయలూ లేకపోలేదు. అందుకనే పెద్దలే ముందు సరికావాల్సింది అంటున్నారు నిపుణులు. అప్పుడు పిల్లల్ని మాన్పించడం తేలికవుతుందని చెప్తున్నారు.

అడ్డం రాకుండా..

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలు చేసే వారైనా.. తమ పనికి అడ్డం రాకూడదనుకున్న అమ్మనాన్నలు ఎవరైనా.. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఫోన్‌ అలవాటు చేసేస్తున్నారు. ఈ అలవాటు తర్వాత అనేక విపరీతాలకు దారితీస్తుందన్న ఆలోచన చేయడం లేదు. పిల్లలకు చిన్న వయస్సులోనే కళ్లజోళ్లు రావడం, మెడ నరాలు దెబ్బతినడం, తలనొప్పి వంటి సమస్యలు బాల్యంలోనే ఎదుర్కోవల్సిన పరిస్థితులు వస్తున్నాయనేది ఆరోగ్య నిపుణులు హెచ్చరిక. ఇటీవల ఇలాంటి సమస్యలతోనే ఎక్కువమంది పిల్లలు వస్తున్నారనీ, విచారిస్తే మొబైల్స్‌ ఎక్కువసేపు చూడటానికి అలవాటు కావడమే కారణమని తేలిందని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటమే దీన్ని అరికట్టడానికి వీలవుతుంది. ఒక వయస్సు వచ్చే వరకూ ఫోన్‌ ఇవ్వకూడదనేది నిపుణులు చెప్తున్న మాట.

బయటకెళ్లేదేది..?

ఉదయం స్కూల్‌కి వెళ్లింది మొదలు రాత్రి పడుకునే వరకూ నాలుగు గోడల మధ్యే పిల్లలు ఎక్కువగా గడుపుతున్నారు. దీనివల్ల బాల్యం వసివాడిపోతుంది. అదే స్కూల్లోగానీ, ఇంటి దగ్గరగానీ పిల్లలు కాసేపు ఆరు బయటో, గ్రౌండ్‌లోనే ఆటలు ఆడితే శారీరక వ్యాయమమే కాదు. వారి మనుసులు కూడా వికసిస్తాయి. రక్తప్రసరణ జరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆటల్లో ఓడినా, గెలిచినా వాస్తవికంగా తీసుకునేతత్వం అలవాటవుతుంది. కనీసం వీకెండ్స్‌లో అయినా పిల్లల్ని పార్కులకు తీసికెళ్లి, ఆటలు ఆడించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మిగిలిన రోజుల్లో ఇండోర్‌ గేమ్స్‌కి ప్లాన్‌ చేయాలని చెప్తున్నారు నిపుణులు. అవి కూడా మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయంటున్నారు. ఇలాంటి ప్రయత్నం చేయకపోతే పిల్లలు బావిలో కప్పలకన్నా ఘోరంగా అయిపోతారు. బయట ప్రపంచం, స్నేహాలు, ఎదుటివారితో ఎలా మెలగాలి అనే ఆలోచనే చేయరు. అందుకే పిల్లల్ని కాసేపు బయటకి తీసికెళ్లి ఆడించండి. మీరూ వారితో ఆడితే మీకూ ఆరోగ్యమే అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు పిల్లలతో కాసేపు ఆడుకుంటే.. ఆఫీసు పని ఒత్తిడి నుంచి గొప్ప రిలీఫ్‌ పొందుతారని చెప్తున్నారు. నేటి నుంచి ఆచరణలో పెట్టండి. మన బాల్యం వికసితమైనట్లే.. నేటి తరం కూడా వికసిత కుసుమాలు కావడానికి మరింత బాధ్యతతో మెలుగుదాం.

➡️