అసలు నిజం

Jan 21,2024 08:58 #Poetry
poetry-on-freedom

వేటగాడా..

నీ ఇనుప కంచెల పైనుండి

ఎగురుతున్న మా రెక్కల చప్పుడు విని

గాభరాపడుతున్నావెందుకు?

మా స్వేచ్ఛా కువకువలు విన్న మనుషులు

ఆకాశానికేయి తలెత్తి చూస్తే

కంగారు పడుతున్నావెందుకు?

ఆ స్వేచ్ఛా కువకువలు వారిలో

ఎగరాలనే కాంక్షను రగిలిస్తాయనే భయమా?

 

వేటగాడా..

మా రెక్కలిరిసి నీ ఇనుప గోడల మధ్యనే

మము బంధించావు కదా? అయినా..

నీవు బెరుకుబెరుకుగానే ఉంటున్నావెందుకు?

గాలితో జరుపుతున్న మా కువకువల

సంభాషణలను

నీ నిఘాయంత్రం తర్జుమా

చేయలేకపోతున్నందుకా?

 

వేటగాడా..

నీ ఇనుప గోడల మధ్యనే ఉన్న

మా కుదురు నిదురను తలచి

నీవు నిదురలోనే ఉలిక్కిపడుతున్నావెందుకు?

మా నిదురలో నీ ఇనుప గోడలను

బద్దలు చేసే ఆలోచనలేవో చేస్తున్నామని

మా కలల్లో నూతన స్వేచ్ఛా ప్రపంచాలనేవో

కలగంటున్నామనే తలపులు నీ బుర్రను

చిందరవందర చేసి నీ నిదురను

చెడగొడుతున్నాయా?

 

వేటగాడా..

నీ మొరటు దెబ్బలకు తట్టుకుని

నిలబడుతున్న మా ధైర్యమేదో తెలియక

తలను బండకేసి బాదుకుంటున్నావా?

మృత్యువులోనూ..

మరో ప్రపంచాన్ని స్వప్నించడమే మా ధైర్యం

 

వేటగాడా..

నీవెరుగని ఓ నిజాన్ని నీకు చెప్పనా…

స్వేచ్ఛగా ఎగరడం, స్వేచ్ఛగా కూయడమనే

మా సహజ గుణాన్ని నిర్మూలించడం

నీవల్ల కాదు… నీ వల్ల కాదు…

 

  • దిలీప్‌.వి – 8464030808
➡️