పాడుబడిన చీకటింట్లో ఆకాశమే పైకప్పుగా
బుడ్డి దీపమే చంద్రోదయములా కనిపిస్తుంది
మనసు మౌనంగా నిద్రలోకి జారుతుంటే
గబ్బిలాల రెక్కల శబ్దం నిద్రను దూరం చేస్తుంది!
కడుపులో పేగుల అరుపులు శృతులు కలుపుతుంటే
విస్తర్లో చివరి మెతుకు అమతములా తోస్తుంటే
తాగే మంచినీళ్లు ఉదరంలో అలజడి కలిగిస్తే
పట్టెడన్నము కనిపిస్తే కళ్ళకు పరమానందమే కదా!
నేలను ఈదుతూ ముంజేతులు గాయపడితే
రిగెత్తే కాళ్లలో సత్తువ అంతా కరిగిపోతే
సమాజంలో ఈసడింపుల పుండు ప్రాకుతుంటే
సమానత్వపు ఘోష సంఘములో నిద్రిస్తుంది!
ఒక్క కాలిపై తపస్సు చేస్తున్న దివ్యాంగపు మునులు
హారతి పళ్లెము లాంటి భిక్ష పాత్రలో చిల్లర డబ్బులు
పోగుచేసినా నూకలు దొరకని బతుకులు ఎన్నో
ఉదరాగ్నిని చల్లార్చలేని నిస్సహాయ స్థితిలో సమాజం!
ఈర్ష్యా ద్వేషం రాజ్యంలో నవ సమాజం ఎక్కడా
నలుగురి సంపద ఒక్కడే తిమింగలమై మింగితే
కడగొట్టు బిడ్డ కన్నీటితో వీడ్కోలు పలుకుతుంటే
పిడికిటి నిండా మట్టి ముఖముపై చల్లుతుంటే ఎలా!
అర్ధాకలి కడుపే చేయిస్తుంది విద్రోహాలెన్నో
అమ్మ తాలుకా తనువును అంగట్లో అమ్ముకున్నట్లు
మొండి చేతుల మానవత్వం నింగిలో ఏడుస్తుంది
సముద్రపు వర్షంలా సహాయం ఎదురుచూస్తుంది!
- కొప్పుల ప్రసాద్, 9885066235