ఇదీ జీవితమేనా..!?

Jan 28,2024 10:26 #Poetry
poetry on life

నీకు చేరువ అవుదామనుకున్న

ప్రతిసారీ దూరం నెట్టేశావు

నీ మాటల ఈటెలతో..

నువ్వు దగ్గరవాలనుకున్నప్పుడు

నేను దూరం చేసుకున్నాను..

పేరుకే కలిసున్న ఆలూమగలం

మనసారా కలవని నింగీ, నేలలం!

అవ్యక్తమైన ప్రేమను బహిర్గతం

చేయలేక ఇద్దరి మనసుల మధ్య

పేరుకుపోయిన ఏవో మబ్బుతెరలు

తుపానుకు ముందు నిశ్శబ్దంలా

ఇద్దరి మధ్య ఇక మౌనమే రాజ్యం

తప్పొప్పుల సంగతి ఎలా ఉన్నా

రాజీ పడదామంటే రాజుకునే ‘ఇగో’

ఇద్దరిదీ ఒకే పరిస్థితి.. అయినా

బతికే ఉన్నాము నిస్తేజంగా..

నివురుగప్పిన నిప్పులా..

కానీ మంటలు చెలరేగవు

ప్రేమను తుడిచేయవు..

చల్లార్చిన ప్రతిసారీ

విశ్రాంతిలో ఉంటాయి

ఇంతేనా జీవితం..

అని ఆలోచిస్తూంటాయి..!

 

  • న్యాలకంటి నారాయణ, 95508 33490
➡️