నూతన ఆరంభం

Jan 28,2024 10:29 #Poetry, #Sneha
poetry on new year

అదే పొద్దు

అదే గది, అదే గోడ !

అదే మేకుకు ఇంకా తీయని పాత క్యాలెండర్‌ !

అవునూ

ఎవరు మార్చుతారు ..?!

నా ఆలోచనలను మార్చుతూ

చకా చకా కదులుతున్న

సెకన్ల ముల్లు శబ్దం !

బాధ్యతల నిర్వహణలో ఒంటరితనమనే

మాటే లేని దాని స్వభావం !!

తదేకంగా చూస్తేఆచీ తూచీ సమయానికి అనుకూలంగా

స్థిరంగా అడుగులు వేస్తున్న

‘పెద్ద’ ముల్లు కదలిక !

అడుగడుగునా

అనుభవాన్ని మిళితం చేసుకోవాలనే

ఓ ముఖ్య సూచిక !

ఏ హంగూ ఆర్భాటం లేకుండానే

ఏ శబ్దమూ చేయకుండానే

ముందుకు కదిలిపోతున్న

‘చిన్న’ ముల్లు వైనం!

గెలుపు ఎవరినైనా వరిస్తుంది అనే పెద్ద పాఠం !

కాసేపటికి అదే నిశీధి కానీ నాలో కొత్త వైఖరి !

అదే ఉషోదయం

కానీ నాదో నూతన ఆరంభం

తెలియని శక్తి సంరంభం!

 

  • తిప్పాన హరిరెడ్డి, 9493832412
➡️