పఠనం ఉద్యమంలా జరగాలి..

ఈ వేసవి సెలవుల్లో ఎలాగైనా పిల్లలతో వివిధ పుస్తకాలు చదివించాలనే ఆలోచనతో సమ్మర్‌ క్యాంపులలో ఇది ప్రధాన అంశంగా పెడితే బాగుంటుంది అనుకున్నాము. అందుకు ఆసరా చారిటబుల్‌ సొసైటీ, గౌతు లచ్చన్న ఆర్గనైజేషన్‌ ఫర్‌ వీకర్‌ సెక్షన్స్‌ సంస్థలు ముందుకు వచ్చి 6,765 పుస్తకాలు, 165 కిట్స్‌గా ఇచ్చారు. క్యాంపులు నిర్వహించిన చోట ప్రతిరోజూ గంటసేపు వారికి నచ్చిన పుస్తకం చదివేలా ప్రోత్సహించడంతో వేలాదిమంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. అటువంటి ఏర్పాటు ద్వారా మాత్రమే ఇది సాధ్యం. దానికోసం వాలంటీర్స్‌ వుండాలి. తల్లిదండ్రుల సహకారమూ అవసరం. అలాంటి ప్రయత్నం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ వేసవిలో చిల్డ్రన్స్‌ క్లబ్స్‌ ద్వారా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని జరగాలి.

నాకు బాగా గుర్తు – బహుశా ఐదో తరగతి అనుకుంటాను మా తెలుగు మాష్టారు చాలా కోపంగా వున్నారు. ఆయన్ని చూస్తే క్లాసులో వున్న 10 మందికి భయం వేసింది. తరువాత ఆయన మమ్మల్ని దగ్గరకు తీసుకొని, మీకు ఒక కథ చెబుతాను అంటూ మొదలుపెట్టారు. ఈ కథ బహుశా బాల్యంలో ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ఆకతాయితనంగా వున్న కొడుకును దారిలో పెట్టడం కోసం ఒక తండ్రి చేసిన ప్రయత్నం ఏవిధంగా అతనిలో మార్పు తెచ్చింది అనేది. రామన్న ఇనుప వస్తువులు తయారు చేస్తుంటాడు. అతని ముగ్గురు పిల్లల్లో చివరి కొడుకు చదువు, పని దేనిపైనా శ్రద్ధ లేకుండా తిరుగుతుండడం అతనిని కలచివేసింది. ఎలా గయినా బాధ్యతగా వుండేలా చేయాలని ఒక ఒప్పందం చేసుకుంటాడు కొడుకుతో. నువ్వు స్వయంగా ఒక రూపాయి సంపాదించి తీసుకొని రా, అప్పుడు నీకు ఏమి కావాలంటే అది ఇస్తాను అంటాడు. ఇదేదో బాగుంది అని వాళ్ళ అమ్మ దగ్గర రూపాయి తీసుకొని, వాళ్ళ నాన్నకు ఇస్తాడు. అది వాళ్ళ నాన్న కొలిమిలో పడేస్తాడు. పెద్దగా రియాక్ట్‌ అవ్వడు. రెండోరోజు స్నేహితుని దగ్గర అప్పు తీసుకుని ఇస్తాడు.. దానిని కూడా కొలిమిలో వేసేస్తాడు. ఏమిటి అన్నీ అలా వేస్తున్నావు? నేను కష్టపడి సంపాదించాను అంటాడు. మూడో రోజు ఎక్కడా డబ్బులు దొరకవు. పొలంలో పని చేసి సాయంత్రం వాళ్ళ నాన్నకి ఇస్తాడు. అది కూడా కొలిమిలో వేస్తాడు. వెంటనే కొలిమిలో చేయి పట్టి, ఆతృతగా తీయడానికి ప్రయత్నిస్తాడు. కష్టపడి సంపాదించినది కాబట్టి దాని విలువ తెలిసింది అన్నారు మాస్టారు. అప్పుడు మాకు అర్థం అయ్యింది. మాలో ఎవరో దొంగతనం చేసి వుంటారు. అందుకే మాష్టారుకి అంత కోపం వచ్చింది. ఆ కథ మా అందరిపైన చాలా ప్రభావం చూపింది. ఎప్పుడూ నిజాయితీగా వుండాలి, కష్టపడి పని చేయాలి అని.
కాలేజీ రోజులలో నీకు ఈ పుస్తకాల పిచ్చి ఏమిటి అనేవారు స్నేహితులు? అన్నయ్య మొదటి జీతంతో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, శరత్‌చంద్ర పుస్తకాలు కొని ఇచ్చినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసిన మిత్ర బృందం, తరువాత ఆ పుస్తకాలు చదివి వాటిపై చర్చోప చర్చలు చేసేవారం. చతుర, విపుల చదవడం కోసం తలా కొంచెం డబ్బులు వేసుకొని, ఒకరి తరువాత ఒకరు చదివిన జ్ఞాపకం. పుస్తకాలు చదివిన తరువాత ప్రశ్నలు ఉదయిస్తాయి. ఈ కథ ఇలాగే ఎందుకు వుండాలి? అలా జరిగితే బాగుంటుంది? విషాద ముగింపులు నచ్చనప్పుడు రోజుల తరబడి దాని గురించే ఆలోచించడం, స్నేహితులతో చర్చించడం కొన్ని రోజులకు మరచిపోయినా అంతర్గతంగా మనుషుల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది.
”దాహంతో కూడిన కాకి” రాళ్లు నింపి నీరు తాగిన సమయస్పూర్తిని మరచిపోలేము. బంగారం, వెండి గొడ్డలిని సొంతం చేసుకోలేనని నా గొడ్డలి నాకు ఇచ్చేరు అని అడిగిన కట్టెలు కొట్టే అతని నిజాయితీ బాల్యంలో వేసిన ముద్ర కథలు మాత్రమే అందించగలవు. బంగారం దొంగతనంకి వచ్చిన దొంగతో తోటకి నీరు పెట్టించిన తెనాలి రామకృష్ణుడి తెలివికి ఫిదా కావలిసిందే. రాజుగారు దేవతా వస్త్రం కథలో రాజుకి నిజం చెప్పలేని పెద్దలు.. బట్టలు లేవని పిల్లాడు చెబితే కానీ, తన మూర్ఖత్వం అర్థంకాక సిగ్గుపడిన రాజు.. తన ప్రజల పట్ల కూడా అలాగే వున్నానని తెలుసుకుంటాడు.
ఏ వయసు అయినా కథలు, పుస్తకాలు నేర్పిన విలువైన పాఠాలు ప్రేరణగా వుంటాయి. ఇంటర్‌లో ”భగత్‌సింగ్‌ నేను నాస్తికుడిని ఎందుకు అయ్యాను” అన్న పుస్తకం మా మిత్ర బృందాన్ని వుర్రూతలూగించింది. ఎడ తెగని చర్చలు, ఏ గట్టున వుంటావో, నిర్ణయం ఎలా చేయాలో తెలిపేందుకు ఈ పుస్తకం ఇప్పటికీ మార్గదర్శిగా వుంటుంది. వుద్యోగం వచ్చిన కొత్తలో పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆత్మకథ చదివాను. అది ఎంతలా ప్రభావితం చేసిందంటే సమాజం కోసం ఏమీ చేయని జీవితం జీవితమే కాదనిపించింది.
ప్రపంచీకరణతో జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పుస్తకం స్థానాన్ని మొబైల్‌ ఆక్రమించింది. చేతిలో పుస్తకం వుంటే ఇంకెక్కడికీ వెళ్లలేము. కానీ మొబైల్‌ ఒకచోట మొదలు పెడితే ఎక్కడ ముగిస్తామో తెలియదు. దృష్టి కుదురుగా వుండదు. సహజ సిద్ధమైన ఎదుగుదలకు చదవడం, జ్ఞాపకం పెట్టుకోవడం మళ్ళీ దానిని చెప్పడం అవసరం. చదువులో డైవర్సిటీ లేదు. పరిజ్ఞాన గ్రహణ, సృజనాత్మకత మొదలైనవి రానురానూ క్షీణిస్తున్నాయి.


మాతృభాష రాకపోవడం బాల్యానికి శాపంగా మారింది. ఎక్కువ పుస్తకాలు తెలుగులో వున్నాయి. చదివే అవకాశాలు తగ్గిపోతున్నాయి. పఠనంలో మాధుర్యం మాతృభాషలో మాత్రమే ఆస్వాదించగలరు. జీవితానికి సంబంధించిన లోతుల్ని స్పృశించగలరు. ఈనాటి బాలల కోసం డా.హరికిషన్‌ గారి కథలు బాగా ఉపయోగపడతాయి. అవి చిన్నవి, సరళంగా ఉంటాయి. అన్ని అంశాలపై వున్నాయి, ఒక పేజీ మించకుండా వుంటాయి. జనవిజ్ఞాన వేదిక వేసిన చిన్న చిన్న పుస్తకాలు అతి తక్కువ ఖరీదుతో అందుబాటులో వున్నాయి.
పుస్తక పఠనం గురించి డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ఇలా అన్నారు, ‘నా జీవితాంతం వేలాది గ్రంథాలను అవిశ్రాంతంగా అధ్యయనం చేయడం వల్లనే నేనింతటి మేథా సంపన్నుడనైనాను. నేను ”లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌” లో చదివే సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీగా ప్రసిద్ధి పొందిన బ్రిటిష్‌ లైబ్రరీలో ప్రపంచంలో పలువురి ప్రముఖ రచయితల పుస్తకాలను చదివే సువర్ణావకాశం నాకు లభించింది. నేను ఏదైనా పుస్తకం చదివినప్పుడు దానిలోని తత్త్వాన్ని బయటికి తీస్తాను. అవసరం లేని భాగాన్ని వదిలివేస్తాను’.
‘పుస్తకాలు దీపాల వంటివి. అవి చీకటిలో దారిని చూపుతాయి. అవి మనలోని మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తాయి. నేను నా భార్యాబిడ్డల కంటే పుస్తకాలనే ఎక్కువగా ప్రేమిస్తాను. విద్యా వికాసములు పొందండి. విద్యా వికాసాలను అందించండి. అంతర్గతంగా ఆందోళనపడండి. మార్పు కోసం పోరాటం చేయండి. ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది. దేవాలయం ముష్టివాళ్ళను సృష్టిస్తే గ్రంథాలయం దేశాన్ని మార్చే మహావీరుల్ని సృష్టిస్తుంది’ అంటాడు బట్రెండ్‌ రస్సెల్‌.
ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహిస్తున్న బాలోత్సవాలు ఈ దిశగా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కథ రాయడం, కథా విశ్లేషణ వంటి పోటీ అంశాలలో పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. చక్కటి ప్రతిభను కనబరుస్తున్నారు. అవకాశాలు ఇస్తే తప్పకుండా రాస్తారు. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక పాఠశాలలో పిల్లలతో కథలు రాయించే కృషి చేస్తున్నది.
కొన్ని కథలలో హీరోలు సమాజానికి సేవ చేస్తుంటారు. ఆ పాత్రలలో పిల్లలు తమని ఊహించుకుంటారు. పిల్లల వయస్సుకు తగ్గ పుస్తకాలు ఎంపిక చేయాలి. హింస, అసత్యాలు, మూఢ విశ్వాసాలు పెంచే పుస్తకాలు ఇవ్వకూడదు. కథల పుస్తకాలు పిల్లలకు కొన్ని ప్రత్యేక అభిరుచులను ఏర్పాటు చేసుకోవడానికి సహాయపడతాయి. అందుకే వారికి ఆసక్తి ఉన్న పుస్తకాలు మొదట ఇవ్వాలి. తరువాత వారే ఎంచుకుంటారు.
పుస్తకం చదువుతున్నప్పుడు ఊహా ప్రపంచంలోకి వెళతారు. ఏదైనా చేయాలనే కోరికలకు రెక్కలు వస్తాయి. మంచి, గొప్ప పనులు చేసిన వారిలా తామూ చేయాలనుకుంటారు. ఒక పక్షిని, ఒక జంతువును రక్షించడం వారిలో ప్రేమను పంచే గుణం బయటపడుతుంది. కథలలో భిన్నత్వం ఉండేలా చూడాలి. ప్రకృతి, చరిత్ర, సాహసాలు, సస్పెన్స్‌, అద్భుతాలు, హీరోయిజం, స్నేహం, సహాయపడడం ఇలా వుంటాయి. పిల్లల సామాజిక, భావోద్వేగ అభివృద్ధికి, అభిరుచులు ఏర్పరుచుకోవడానికి పుస్తకాలు సహాయపడతాయి. ఇందులో తల్లిదండ్రుల పాత్ర చాలా వుంది. పుస్తకాలు వారు చదువుతూ పిల్లలతో చదివించాలి. తెల్లవారే పేపర్‌ చదివే ఇంటిలో పిల్లలు పేపర్‌ చదువుతారు. దానికి ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. ఏదైనా చదివినా దాని గురించి ఎవరో ఒకరితో చర్చించాలి లేదా చెప్పాలి, చెప్పించాలి. అప్పుడే దానిలో సారం మరింత బాగా మనల్ని పట్టి ఉంచుతుంది. చిన్నతనంలో పిల్లలతో అనుబంధం పెరగడానికి పిల్లలతో కలిసి కథల పుస్తకాలు చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
సమాజంలో పడిపోతున్న నైతిక విలువలు, కొరవడుతున్న మానవత్వం నేపథ్యంలో వయసుతో ప్రమేయం లేకుండా మంచి పుస్తకాలు సమాజ శ్రేయస్సుకు, సృజనాత్మకత, సమస్యలను ఎదుర్కొనే శక్తి, ఐక్యతకు, మనమందరం ఒక్కటే అనే భావనకు పునాదులు వేస్తాయి. ఇలా ఎన్నో లక్షణాలకి జీవం పోయ గలిగే శక్తి పుస్తకం ఇస్తుంది. ముఖ్యంగా ఆటో బయోగ్రఫీలు అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. వారిని అనుసరించాలన్న కోరిక, మంచిపని చేయాలన్న తపన పెరుగుతాయి. అంతేకాదు, తరతరాల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తరవాతి తరాలకు అందించడంలో ప్రధానపాత్ర కూడా ఈ పుస్తకాలదే. ఈ తరంలో కవులు, కళాకారులు, రచయితల పుట్టుకకు పుస్తకాలే కారణమవుతుంటాయి.కథ చదివిన తరువాత పసి హృదయంపై పడే ప్రభావం జీవితమంతా వుంటుంది. భాష పైన పట్టు వస్తుంది. తమంతట తాము పుస్తకాలు వెతుక్కొని, చదివే అవకాశం వుంటుంది. ఏ భాషా సరిగ్గా రాకపోవడంతో అర్థం చేసుకునే విశ్లేషణా శక్తీ నేటితరంలో కనబడడం లేదు. పుస్తకాలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించే చారిత్రక ఘట్టాలు, ఆ సామాజిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి నిలిచిన సాక్ష్యాలుగా మిగులుతాయి. మనిషి మనోవికాసానికి, మంచి ప్రవర్తన అలవడడానికి, బాల్యం నుంచి పుస్తకాలు, కథలు చదవడం చాలా అవసరమనీ, వాటి వలన ప్రయోజనం ఉందనేదీ అనేకమంది ప్రముఖుల జీవితం నుండి నేర్చుకోవచ్చు. మనిషి మనోవికాసానికి, మంచి ప్రవర్తన అలవడడానికి, బాల్యం నుంచి పుస్తకాలు, కథలు చదవడం చాలా అవసరమనేది గుర్తించి, స్కూలు యాజమాన్యాలు, ప్రభుత్వం ఆ ఏర్పాట్లు చేయాలి. మొబైల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయవచ్చు. పుస్తక పఠనం కూడా ఒక ఉద్యమంలా జరగాలి. దానికోసం తలిదండ్రులు, పాఠశాలలు, వివిధ సంస్థలు, ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తేనే అది సాధ్యమవుతుంది.


– డా. కె. రమాప్రభ, సామాజిక కార్యకర్త
9492348428

➡️