పిల్లల్లో ఆలోచనాసరళి పెంచేలా..

Jan 28,2024 06:56 #book review, #Children, #Sneha, #Stories
book review

గతంలో పిల్లలు రాత్రయితే.. అమ్మమ్మలు, నానమ్మల పక్కలోకి చేరేవారు. గారాలు పోతూ కథలు చెప్పమని అడిగేవారు. కానీ కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. దాంతో పిల్లలందరూ సాయంత్రం అయితే చాలు తల్లిఫోనో, తండ్రి ఫోనో పట్టుకుని గంటల తరబడి చూస్తూ ఉండిపోతున్నారు. పక్కన ఏం జరుగుతుందో కూడా గమనించలేని స్థితిలోకి నెట్టబడుతున్నారు. కథలు వినేందుకు గానీ, చెప్పించుకునేందుకు ఆసక్తి కనబరచడం లేదు. చాలామందికి అసలు కథలు అంటే ఏంటో కూడా తెలియదు. అటువంటి వారికి పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని అనుకునే తల్లిదండ్రులకు ఈ ‘టక్కరి మొసలి’ కథల పుస్తకం గొప్ప కానుక. రచయిత కె.వి. లక్ష్మణరావు పిల్లల్లో విచక్షణా జ్ఞానం పెంపొందేలా చక్కటి వెలుగు చుక్కల్లాంటి కథలను రాశారు.

చిన్న పిల్లలు జిజ్ఞాస, ఆలోచనా శక్తి పెరగాలంటే మొదటగా కథల పుస్తకాలు చదవాలి.. చదివేట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలవాటు చేయాలి. ఆ కథల్లోని నీతి అర్థం అయితే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సమాజాన్ని అర్థంచేసుకోగలరు. నీతి కథలే పిల్లల జీవితాలు మంచి మార్గంలో నడిపంచగలవు. ఎవరైనా పిల్లలకు కథలు చెప్పాలని అనిపించినప్పుడు ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మొత్తం 17 నీతి కథలు ఉన్నాయి. ప్రతి కథా పిల్లల్ని పలకరిస్తుంది. పిల్లల మనసు వికసించేలా చేస్తాయనడంలో సందేహం లేదు. ఆపద వచ్చినప్పుడు పారిపోకుండా తెలివిగా ఎలా నడుచుకోవాలో ‘బురిడీ కొట్టిందిలే..బుస్‌..బుస్‌..పాము!’ కథలో చెప్పారు.

పిల్లల్లో సహజంగానే ధైర్యం తక్కువగా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చిందని తెలియగానే భయపడటం, వెనకడుగు వేయడం చేస్తారు. కానీ ఈ కథలో ఉపాయంతో అపాయం నుంచి బయటపడొచ్చు అని తెలియజెప్పింది.

మనిషి అన్నాక తోటి ప్రాణుల పట్ల జాలి, కరుణ, దయతో పాటు కష్టపడేతత్వం, నిజాయితీ ఉండాలని ‘మార్పు మంచిదే’ కథలో చెప్పారు. అందం కన్నా పరోపకారం బుద్ధి ఉన్న వారితో స్నేహం వదులుకో కూడదని ‘గుణమే ప్రధానం’ కథ చెబుతుంది. చిన్న పిల్లలకు ఇతరులకు సాయం చేసే వ్యక్తిత్వాన్ని అలవరచడం చాలా అవసరం. అదే వారిని మరింత మంది స్నేహితులను దగ్గర చేస్తుందన్న సందేశం ఈ కథ ద్వారా రచయిత చెప్పారు.

చిన్న పిల్లలు ఏదైనా వస్తువును చూసి ఇష్టపడితే.. అది చేతికి అందేవరకూ గోల చేస్తూనే ఉంటారు. అది అందకపోతే జీవితంలో అంతా కోల్పోయినట్లు ముఖం పెడతారు. దాన్నే ‘అద్దంలో చిట్టికోతి’ కథలో చెప్పారు. పిల్లలు ఆడుకునే సమయాల్లో ఆపదలు వస్తూంటాయి. వాటిని తెలివిగా ఎలా ఎదుర్కొవాలో ‘టక్కరి మొసలి…తెలివైన గోపి!’ కథ చెబుతుంది.

మనకు ఎవరైనా సాయం చేస్తే.. కృతజ్ఞతా పూర్వకంగా మెలగడం మంచిదని ‘ఉడత సాయం’ కథ చెప్తుంది. పిల్లల్ని గారాబంగా పెంచితే ఎలా తయారవుతారో చాలామంది తల్లిదండ్రులకు అనుభవమే. రానురానూ వారిలో గర్వం పెరుగుతుంది. అదే ‘మారిన గౌరవ్‌’ కథలో చెప్పారు. అయితే గౌరవ్‌ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకున్న తల్లిదండ్రులు వాడిలో మార్పుకు ప్రయత్నిస్తారు. పిల్లలు తెలిసీతెలియక పెద్దవాళ్లను, తల్లిదండ్రులను తప్పుమాటలు అన్నప్పుడు, వారిని వెంటనే దండించకూడదు. ఓపిక పట్టి, వారికర్థమయ్యే రీతిలోనే నిదానంగా చెప్పాలి. అప్పుడే పిల్లలు ఆలోచించ గలరు. తమను తాము సరిదిద్దుకోగలరు.

సహజంగా ఎవరింట్లోనైనా ఎలుకలు పడి, పాడుచేస్తుంటే, ఏమి చేస్తారు? వాటికి మందు పెట్టి చంపే ప్రయత్నం చేస్తారు. కానీ మనసు పెట్టి ‘ఒక్కసారి ఆలోచించండి!’. ప్రకృతిలో, భూమి మీద జీవించే హక్కు ప్రతి ప్రాణకోటికీ ఉంది. కానీ మనిషి స్వార్థంతో తనకు హాని కలిగించే ఏ జీవినైనా చంపేందుకు వెనకాడడు అని మనల్ని మనమే ప్రశ్నించుకునేలా ఈ కథ ఉంది. ఎలుకల్ని చంపకుండా బోనులో బంధించి, దూరంగా వదిలేయాలన్న విషయాన్ని సందేశాత్మకంగా వినరు అనే పిల్లవాడి ద్వారా రచయిత చెప్పించడం చాలా బాగుంది. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు లాక్‌డౌన్‌లో స్నేహితులను, బంధువులను, రక్త సంబంధీకులను కలుసుకోనివ్వలేదు. కానీ కరోనా వచ్చిన వారిపట్ల ఎలా మసలుకోవాలో ‘పసి మనసు’ కథలో చెప్పిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. తల్లి స్వార్థంగా ఆలోచించినా, చింటూ మాత్రం తన ప్రాణ స్నేహితుడు కోసం స్పందించిన తీరు బాగుంది. జంతువులకు ఆపద వస్తే ఆదుకోవాల్సిన ‘బాధ్యత’ అడవిలో ఉన్న రాజు సింహానిదే. అదే విధంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని చిన్న సంఘటనతో సందేశం ఇచ్చిన తీరు అభినందనీయం.

‘మనుషులకే మెదుడు ఉంది. వారే బుద్ధిబలం ఉన్నవారు’ అని విర్రవీగిన రాజుకు ‘చిన్నచూపు’ కథలో మంత్రి సుబుద్ధి కళ్లు తెరిపిస్తారు. మాట్లాడలేని ప్రాణులను సైతం ప్రేమించాలని, బుద్ధిబలం లేనంత మాత్రాన వాటిని తక్కువ అంచనా వేయకూడదని నిరూపించిన విధానం బాగుంది.ఇలా ‘న్యాయమైన కోరిక, చక్కని చిట్టి.. చిన్నారి చిన్ని!, ఫలించిన ప్రయత్నం, చిట్టెలుక సమయస్ఫూర్తి’ వంటి కథలు పిల్లల మనసుకు చేరువవుతాయి. వారి మానసిక ఎదుగుదలకు దోహదపడతాయి. టీవీలు, సినిమాలు, ఫోన్లు వెంట పరుగులు తీస్తున్న పిల్లల కోసం ఇలాంటి కథల పుస్తకం తెచ్చిన రచయిత అభినందనీయులు.

పుస్తకం : టక్కరి మొసలి

రచయిత : కె.వి. లక్ష్మణరావు

ధర : 60/-

ఫోన్‌ నెం :9014659041

–  పద్మావతి

➡️